iDreamPost

Khiladi Review : ఖిలాడీ రివ్యూ

Khiladi Review : ఖిలాడీ రివ్యూ

కొంత గ్యాప్ తర్వాత ఇవాళ థియేటర్ల దగ్గర జనం బాగా కనిపించారు. కారణం రవితేజ ఖిలాడీ. సంక్రాంతికి బంగార్రాజు హిట్ తర్వాత చెప్పుకోదగ్గ సినిమా ఏదీ లేకపోవడంతో అంతంత మాత్రంగా ఉన్న హాళ్లు ఈ రోజు నిండుగా ఉన్నాయి. రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ క్రైమ్ థ్రిల్లర్ లో యాక్షన్ కింగ్ అర్జున్ ఓ కీలక పాత్ర పోషించడం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, హీరోయిన్ల గ్లామర్ లాంటి అంశాలు హైప్ ని బాగానే తీసుకొచ్చాయి. గత ఏడాది క్రాక్ తో ఆఫ్టర్ లాక్ డౌన్ ఫస్ట్ హిట్టు కొట్టిన మాస్ మహారాజా ఇప్పుడూ అదే ఫలితం అందుకుంటాడనే నమ్మకంతో అభిమానులు ఉన్నారు. మరి దానికి తగ్గట్టు సినిమా ఉందో లేదో రివ్యూలో చూద్దాం

కథ

మోహనగాంధీ(రవితేజ) స్వంత భార్య(డింపుల్ హయాతి), ఆమె తల్లితండ్రులను హత్య చేసి జైలులో ఉంటాడు. కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్. గాంధీ చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన రాజశేఖర్(రావు రమేష్)దగ్గరే ఆయన కంపెనీలోనే ఆడిటర్ గా పని చేస్తుంటాడు. హోమ్ మినిస్టర్ గురు సింగం(ముఖేష్ ఋషి)తాను సిఎం అవ్వడం కోసం ఇటలీ నుంచి తెప్పించిన పది వేల కోట్లు హఠాత్తుగా మాయమవుతాయి. ఆ నేరం రాజశేఖర్ మీద పడుతుంది. ఇన్వెస్టిగేషన్ కోసం వచ్చిన సిబిఐ ఆఫీసర్ అర్జున్ భరద్వాజ్ (అర్జున్) అన్నివైపులా ఆధారాలు సేకరిస్తాడు. గాంధీ ప్రవర్తన గురించి రీసెర్చ్ చేస్తున్న సైకాలజీ స్టూడెంట్ పూజా (మీనాక్షి చౌదరి) అనుకోకుండా ఈ వలయంలో చిక్కుతుంది. అసలు గాంధీ నిజంగా నేరాలు చేశాడా అనేది తెరమీద చూసి తరించాలి

నటీనటులు

మాస్ మహారాజ రవితేజ బలం ఎనర్జీ. వయసు మీద పడుతున్న ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నా సరే తన టైమింగ్ తో ఆ తలంపు రాకుండా చేయడంలో ఎక్స్ పర్ట్. ఇందులోనూ అదే చేశాడు. ఫస్ట్ హాఫ్ లో ఇబ్బంది పడినట్టు కనిపించినా సెకండ్ హాఫ్ నుంచి తన పెర్ఫార్మన్స్ తో అభిమానులను మెప్పించాడు. తను పవర్ హౌస్ లాంటోడు. సరిగ్గా వాడుకుంటే మంచి కరెంట్ ఇస్తాడు. తేడా వచ్చిందా చెయ్యి కాలిపోతుంది.డిజాస్టర్లలోనూ తన తప్పేమి లేకుండా చూసుకున్న రవితేజ ఖిలాడీలో రెండు షేడ్స్ కు తనవరకు న్యాయం చేశాడు కానీ ఏదైనా అసంతృప్తి కలిగిందంటే దానికి కారణం దర్శక రచయితలే తప్ప ఇంకెవరిని నిందించలేం

హీరోయిన్లలో డింపుల్ హయాతి అవసరానికి మించిన అందాల ఆరబోతతో మాస్ కి ఫుల్ మీల్స్ ఇచ్చేసింది. ఫ్యామిలీ ఆడియన్స్ కి మాత్రం ఇదంతా అతి అనిపించే వ్యవహారం. నటించకపోయినా పర్లేదు బట్టల్లో పొదుపు పాటించమన్నారు కాబోలు రెచ్చిపోయింది. ఆకర్షణ కూడా మరీ గొప్పగా ఏం లేదు మీనాక్షి చౌదరి కొంత నయం కానీ తనతోనూ స్విమ్ సూట్ వేయించే దాకా వదల్లేదు. అర్జున్ మరీ దారుణంగా వృధా అయ్యారు. స్ట్రెయిట్ తెలుగు సినిమా చేస్తే అది అడదన్న నమ్మకం మరోసారి నిజమయ్యేలా ఉంది. అనసూయ, ముఖేష్ ఋషి, రావు రమేష్, మురళి శర్మ, వెన్నెల కిషోర్, సచిన్ కెడ్కర్, ఠాకూర్ అనూప్ సింగ్ అందరివీ రొటీన్ పాత్రలు

డైరెక్టర్ అండ్ టీమ్

కమర్షియల్ సినిమాకు లాజిక్స్ అక్కర్లేదు. కానీ మీటర్ ఉండాలి. డబ్బు చుట్టూ తిరిగే క్రైమ్ డ్రామాలో మంచి చెడు అటు ఇటు కావొచ్చు. కానీ వాటిని తెలివిగా చూపించే నేర్పు ఉండాలి. దర్శకుడు రమేష్ వర్మ ఖిలాడీకి సంబంధించి ఈ రెండు విషయాల్లోనూ దారుణంగా ఫెయిల్ అయ్యారు. రొట్ట మాస్ సన్నివేశాలతో ఫస్ట్ హాఫ్ అంతా నడిపేసి అసలైన ట్విస్టులు రెండో సగం కోసం దాచేసి ఏదో గొప్పగా థ్రిల్ చేయబోతున్నానని భ్రమపడ్డారు కాబోలు స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ గా ఉంటేనే ఇలాంటివి పండుతాయన్న సూత్రాన్ని పూర్తిగా గాలికి వదిలేశారు. దీంతో అర్థం పర్థం లేని మలుపులతో ఖిలాడీ ఎటు వెళ్తున్నాడో అర్థం కానీ అయోమయం నెలకొంటుంది.

మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రవితేజ మాట్లాడుతూ కథ విని చాలా ఎగ్జైట్ అయిపోయి ఒప్పుకున్నానని రచయితను పైకి పిలిచి మరీ హైలైట్ చేశాడు. నిజానికిది ఎప్పుడూ చూడని కనివిని ఎరుగని లైన్ కాదు. ఎవరితోనో పోలిక ఎందుకు కిక్ లో మెయిన్ పాయింట్ నే దీనికి తీసుకుని పైపై ఏదేదో అద్దేసి దాన్నో గొప్ప స్టోరీ అనుకోమంటే ఎలా. ఓ మంచి ఉద్దేశం కోసం హీరో నలుగుర్ని మోసం చేయడం లేదా విలన్ల సొమ్ముని కాజేయడం తాతల కాలం నుంచి వందల సినిమాల్లో వస్తున్నదే. అదే మళ్ళీ వాడుకోవాలనుకున్నప్పుడు కేవలం ఖరీదైన క్యాస్టింగ్, కోట్ల బడ్జెట్, అన్నీ ఇచ్చే నిర్మాత ఉంటే సరిపోదు. ముందు క్వాలిటీ కంటెంట్ కావాలి.

ఖిలాడీలో మిస్ అయ్యింది అదే. అజిత్ గ్యాంబ్లర్, బాలీవుడ్ మూవీ రేస్ లాంటి సినిమాలు కల్ట్ క్లాసిక్ స్టేటస్ లు తెచ్చుకుని భీభత్సంగా ఆడేయడానికి కారణం కేవలం వాటిలో ట్విస్టులు కాదు. బలమైన క్యారెక్టరైజేషన్లు, వాటి మధ్య ఇంటర్ లింకులు, ఊహించని విధంగా షాక్ ఇచ్చే మలుపులు. కానీ ఖిలాడీలో అంతా ఊహలకు అనుగుణంగానే సాగుతుంది. కొన్ని కొన్ని ఝలక్ ఇచ్చినప్పటికీ వీక్ రైటింగ్ వల్ల అవి అబ్బో అనిపించకపోగా అబ్బా అని విసుగు తెప్పిస్తాయి. ఆ స్థాయిలో సాగింది టేకింగ్. ఇదెంత బలహీనంగా సాగిందంటే విదేశీ లొకేషన్లు, వరసగా వచ్చే ఫైట్లు అన్నీ కలిపి బూడిదలో పోసిన పన్నీరయ్యాయి.

బండి స్పీడ్ గా పరుగులు పెట్టాలంటే ట్యాంక్ నిండా పెట్రోల్ పోయించి స్టాండ్ వేసుకుని కూర్చుంటే ఏం లాభం. రోడ్డు మీదకు వెళ్ళాలి. కానీ ఖిలాడీ కనీసం స్టార్ట్ చేయకుండానే ఊరికే క్లచ్, యాగ్జిలరేటర్ తిప్పుతూ ఉన్న చోటే దిక్కులు చూస్తూ కూర్చున్నాడు. అందుకే ఎన్ని క్యారెక్టర్లు వచ్చినా, ఎన్ని ఝర్కులు ఇచ్చినా బేలగా మొహం పెట్టుకుని చూడటం తప్ప ఏమి చేయలేని పరిస్థితి. జరగని కథను హీరో ద్వారా చెప్పించడమనే టెక్నిక్ ప్రభాస్ డార్లింగ్ తో సహా చాలా చూశాం. దీంట్లో తెఫ్ట్(దొంగతనం) కోసం వాడారు అంతే తేడా. కాకపోతే అక్కడ డైరెక్టర్ తెలివి వల్ల పండింది ఇక్కడ దర్శకుడి మేథాశక్తి వల్ల తేలిపోయింది.

మరీ ఇంతగా నిందించాలా అనే సందేహం రావొచ్చు కానీ దర్శకుడిని కెప్టెన్ అఫ్ ది షిప్ అని ఊరికే అనరు. ఇండస్ట్రీ హిట్లకు ముందుగా క్రెడిట్ తీసుకునేది డైరెక్టరే. కాబట్టి ఇలాంటి అవుట్ ఫుట్ ఇచ్చినప్పుడు కూడా వాళ్లే బాధ్యత తీసుకోవాలి. అందుకే రమేష్ వర్మనే ఖిలాడీ మిస్ ఫైర్ కావడానికి ప్రధాన కారణం అయ్యాడు. పాటల ప్లేస్ మెంట్ మరీ దారుణంగా ఉంది. సెకండ్ హాఫ్ లో కేవలం పది నిమిషాల నిడివిలో రెండు పాటలు వస్తాయి. మొదట్లోనూ అంతే. ఓటిటిలో విచ్చలవిడి బోల్డ్ కంటెంట్ దొరుకుతుంటే కేవలం హీరోయిన్ల స్కిన్ షోల కోసం పాటల కోసం థియేటర్లకు వచ్చే కాలమా ఇది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇక్కడితో ఆగదు

దేవిశ్రీప్రసాద్ సంగీతంలో ఎలాంటి మెరుపులు లేవు. ఓ రెండు పాటలు మాస్ కి ఎక్కేసేలా ఉన్నాయి కానీ రెగ్యులర్ ఆడియన్స్ కి మాత్రం అవి వాష్ రూమ్ సాంగ్సే. నేపధ్య సంగీతం మరీ తీసికట్టుగా ఉంది. ఏదో మొక్కుబడిగా ఇచ్చాడు. సుజిత్ వాసుదేవ్-విష్ణుల ఛాయాగ్రహణం పర్లేదు. మంచి క్వాలిటీని ఇచ్చారు. ఎడిటర్ అమర్ రెడ్డి అయోమయంలో పడ్డారేమో ఏది కత్తిరించాలో అర్థం కాక ఇష్టం వచ్చినట్టు పేర్చుకుంటూ పోవడం నిడివిని పెంచింది. యాక్షన్ ఎపిసోడ్స్ పర్లేదు. ఇంటర్వెల్ బ్లాక్ స్టైలిష్ గా వచ్చింది. నిర్మాణ విలువలు సగం రిచ్ గా సగం తూచ్ గా ఉన్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ హడావిడి కనిపించింది

ప్లస్ గా అనిపించేవి

రవితేజ ఎనర్జీ
ఇంటర్వెల్ యాక్షన్ బ్లాక్
మాస్ కోసం పెట్టిన పాటలు

మైనస్ గా తోచేవి

విపరీతమైన ట్విస్టులు
రొటీన్ ఫస్ట్ హాఫ్
కన్ఫ్యూజ్ చేసే రెండో సగం
కథాకథనాలు

కంక్లూజన్

మాస్ మహారాజాకు ఎంత ఎనర్జీ ఉన్నా యావరేజ్ కథలైతే ఏదో రకంగా నిలబెట్టేసి హిట్టు కొట్టిస్తాడు. అసలు మ్యాటర్ లోనే తేడా ఉన్నప్పుడు తను మాత్రం ఏం చేయగలడు. ఏపుగా గడ్డి పెరిగిన పిచ్చు మీద సెంచరీ కొట్టమంటే కోహ్లీ కూడా ఏం చేయలేడు. ఖిలాడీ అలాగే తయారయ్యింది. ఈసారి రవితేజ కేవలం ట్విస్టులు విని కథలు ఒప్పుకోకుండా పూర్తిగా కథ మీద అవగాహన తెచ్చుకుని అప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తే బెటర్. లేదంటే ఇలాంటి కిచిడి ఖిలాడీలు వస్తూనే ఉంటాయి. తనంటే వీరాభిమానం ఉండి ఇంకేమి అక్కర్లేదు అనుకునే వీర ఫ్యాన్స్ కు తప్ప సగటు సామాన్య ప్రేక్షకుడికి ఇది తాడు లేకుండా ట్రెక్కింగ్ చేయడమే

ఒక్క మాటలో – ఉప్పు లేని కిచిడీ

Also Read : Mahaan Review : మహాన్ రివ్యూ

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి