Idream media
Idream media
సూపర్ స్టార్ కృష్ణ మనుమడు, హీరో మహేశ్‌బాబు మేనల్లుడు, ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు, మాజీ మంత్రి గల్లా అరుణ మనుమడు, అమర్‌రాజ్ బ్యాటరీస్ అధినేత రామచంద్రనాయుడు మనుమడు గల్లా అశోక్. ఈ చరిత్ర అంతా ఎందుకు అంటారా? మనకి బిల్డప్ బ్యాగ్రౌండ్ చెప్పకపోతే విషయం ఎక్కదు.
అశోక్ హీరోగా తొలి సినిమా “హీరో” సంక్రాంతికి వచ్చింది. పెద్ద సినిమాలు పోటీలో వుంటే రాకపోయేది. అవన్నీ తప్పుకోవడంతో హీరో వచ్చాడు. మరి అశోక్‌కి నటన ఏమైనా వచ్చా అంటే డాన్స్‌లు, ఫైట్స్ చేశాడు. హీరోయిన్‌తో లవ్ సీన్స్ ఓకే. కొంచెం కష్టంతోనైనా డైలాగులు చెప్పాడు. అన్నిటికి మించి ఈజ్ వుంది. మరో వారసుడు మన నెత్తిమీది కొచ్చాడనే భయం ప్రస్తుతానికి అనవసరం.
ప్రారంభంలోనే అశోక్ బ్యాగ్రవుండ్ ఎందుకు చెప్పానంటే మనవాళ్లు సినిమాని సినిమాగా చూడనివ్వరు. అర్జున్ అనే కుర్రాడి కథ చెబుతున్నప్పుడు తెరమీద అతని పాత్ర మటుకే రిజిస్టర్ కావాలి. అది జరగనీకుండా opening సీన్‌లోనే అతని తాత మోసగాళ్లకి మోసగాడు, మేనమామ టక్కరిదొంగ అని ఇంట్రడక్షన్.
నిజానికి అశోక్‌కి ఇవేం అవసరం లేదు. చూడడానికి బావున్నాడు. బిగినింగ్‌లో రైలుని అటాక్ చేసే కౌబాయ్‌గా నిజంగానే తాత కృష్ణని గుర్తుకు తెచ్చాడు. అయితే అది ఆడియన్స్ ఫీల్ కావాలి. కానీ డైరెక్టరే పనిగట్టుకుని గుర్తు చేయకూడదు. మొదటి పది నిముషాలు రైలు ఛేజింగ్, ఫైట్ చాలా బావున్నాయి. అదే స్థాయి కంటిన్యూ అయితే బావుంటుంది అనిపించింది కానీ అది కల.
అర్జున్ (గల్లా అశోక్)కి సినిమా హీరో కావాలని పిచ్చి. ఆడిషన్స్‌కి వెళుతూ నిధి అగర్వాల్‌ని ప్రేమిస్తూ వుంటాడు. జుత్తు వూడితే హీరోగా పనికి రావని ఫ్రెండ్ సత్య చెబితే టీవీలో యాడ్ చూసి హెయిర్ ఆయిల్‌కి ఆర్డరిస్తాడు. కొరియర్ వస్తుంది. విప్పి చూస్తే రివాల్వర్. భయంతో సత్యని పిలుస్తాడు. తాగిన మైకంలో అతను రివాల్వర్ పట్టుకుంటే, హీరో అడ్డుకోబోతే మిస్‌ఫైర్‌తో సీఐ (అజయ్)కి తగులుతుంది.
ఈ మిస్‌ఫైర్ సీన్ బ్రాడ్‌ఫిట్ నటించిన బాబెల్‌లో వుంటుంది. అదే విధంగా కొరియర్ తారుమారు కావడం ఢిల్లీబెల్లి హిందీ సినిమా కథాంశం. దాంట్లో వజ్రాలు తారుమారు అవుతాయి. దీంట్లో గన్.
ఆ గన్ ఎవరిది? ఎందుకొచ్చిందనేది మిగతా కథ. హీరోయిన్ తండ్రి జగపతిబాబు. ముంబై నుంచి హైదరాబాద్ వస్తాడు. గన్‌కి జగపతిబాబుకి లింక్ ఏమిటనేది సెకెండాఫ్. ఇదంతా చెబితే సస్పెన్స్ పోతుంది.
గన్‌ని కొరియర్‌లో పంపడం సాధ్యమా? వాట్సప్ కాలంలో ఎవరైనా ఫొటోని కొరియర్‌లో పంపి , దాని మీద కిల్ హిమ్ అని రాస్తారా? లాజిక్‌లు అడిగితే కామెడీ మిస్ అవుతుంది. సినిమాలో నవ్వించడం ముఖ్యమని దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య నమ్మడం వల్ల , పాత్రలు క్యారెక్టర్ మనకి అర్థమయ్యేలోగా అవి దర్శకుడికి అనుగుణంగా ప్రవర్తిస్తాయి. సినిమా అంతా మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతుంది. ఆ సంఘటనలు మరీ సిల్లీగా వుండడంతో ఒక దశలో బలవంతంగా నవ్వుతూనే విసుక్కుంటాం. ఈ విషయం డైరెక్టర్‌కి కూడా తెలుసు.
అందుకే జగపతిబాబు ప్లాష్ బ్యాక్ తర్వాత ఇంత చెత్త ప్లాష్ బ్యాక్ ఎప్పుడూ వినలేదని నరేష్‌తో అనిపిస్తాడు. హీరోని ఏదో చేసేస్తానని వెళ్లిన విలన్ , బిర్యానీ తిని మారిపోవడం , ముంబై డాన్‌గా బిల్డప్ ఇచ్చిన సలీమ్ బాయ్ కూడా బుద్ధిహీనుడిగా ప్రవర్తించడం ఇదంతా కామెడీ అని సరిపెట్టుకోవాలి.
కామెడీ అనుకుంటే ప్రతి పాత్రని బిగినింగ్ నుంచి అలాగే డిజైన్ చేయాలి. కాసేపు సీరియస్‌గా, కాసేపు కామెడీగా వుంటే ఆడియన్స్‌కి కన్ఫ్యూజన్. ఈ లోపం లేకపోతో ఇది ఫుల్ లెంగ్త్ కామెడీగా ఉండేది.
తొలి సినిమా అనగానే ప్రేమ కథలు తీసుకుంటారు. అది సేఫ్ ప్రాజెక్ట్. కృష్ణ తేనె మనుషులు, మహేశ్ రాజకుమారుడు కూడా బేసిక్‌గా ప్రేమ కథలే. రాజకుమారుడులో కొన్ని యాక్షన్ సీన్స్ వున్నా క్యూట్ లవర్ బాయ్‌గానే మహేశ్ కనిపిస్తాడు.
ఈ లాజిక్ మిస్ అయి అఖిల్ ఫుల్ లెంగ్త్ యాక్షన్‌తో ఎంట్రీ ఇచ్చి దెబ్బ తిన్నాడు. గల్లా అశోక్ లవ్, యాక్షన్ రెండూ కాకుండా థ్రిల్లర్ కామెడీతో ఎంట్రీ ఇచ్చాడు. అతని మీద ఎక్కువ భారం మోపకుండా జగపతిబాబు , నరేష్ , సత్య, వెన్నెల కిషోర్ చుట్టూ వుండడంతో కథ స్మూత్‌గా సాగిపోయింది. ఒక దశలో సెకెండాఫ్ హీరో కథ కాకుండా జగపతిబాబు కథగా మారిపోయింది. చివర్లో బోయపాటి సినిమాలో పేరడి హీరోగా బ్రహ్మాజీ నవ్విస్తాడు.
క్లైమాక్స్‌లో హీరో మా సినిమాలు స్వర్గాన్ని చూపిస్తాయి అంటాడు. ఉదయం చలిలో ప్రసాద్ ఐమాక్స్‌కి వచ్చి ఉద్యోగ ధర్మంగా సినిమాలు చూసే సమీక్షకులు విమర్శకులకి సినిమాలు చూపించే నరకం బాగా తెలుసు.
సినిమాలో ఫొటోగ్రఫీ చాలా బాగుంది. పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్ ఓకే. రచయితలు రాగూర్, కల్యాణ్ శంకర్ మాటలు బాగా పేలాయి. చివర్లో దోమల మిషన్‌కి గన్‌కి తేడా తెలియని నువ్వేం డాన్‌రా డైలాగ్ నవ్వులు కురిపించింది.
బ్యాగ్రౌండ్ మరిచి వచ్చే సినిమాల్లో తానెవరో పదేపదే గుర్తు చేయకుండా , ఒక కొత్త నటుడిగా సాధన చేస్తే మెల్లిగా నిలదొక్కుకుంటాడు. ప్రతి సినిమాలో ప్యాడింగ్ సాధ్యం కాదు. కొన్నిసార్లు హీరోనే సినిమాని నిలబెట్టాల్సి వుంటుంది.
ప్లస్ పాయింట్స్ః నిడివి 2 గంటల 10 నిమిషాలే ఉండడం
కామెడీ , హెవీ వెయిట్ సీన్స్ లేకపోవడం, డైలాగ్స్, ఫొటోగ్రఫీ
మైనస్ పాయింట్స్ః బిల్డప్ ఎక్కువై, విషయం తక్కువ కావడం. లాజిక్ తప్పిన కథనం
Also Read : Bangarraju Review : పాత బంగార్రాజే!