iDreamPost
android-app
ios-app

అదిరింది రివ్యూ

అదిరింది రివ్యూ

ఇటీవ‌లికాలంలో ఏ చిత్రానికీ ఎదురుకాన‌న్ని వివాదాలతో స‌త‌మ‌త‌మై, అదేస్థాయిలో అదే అంశంపై విప‌రీత‌మైన ప్ర‌చారం కూడా పొందిన మూవీ కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ న‌టించిన `మెర్స‌ల్‌`. వ‌ర్త‌మానంలో జీఎస్‌టీ, నోట్ల ర‌ద్దు వంటి ప్ర‌భుత్వ ఆర్థిక విధానాల‌తో సామాన్య‌ ప్ర‌జ‌లు ప‌డే ఇబ్బందులపై ఈ చిత్రంలో కొన్నివిమ‌ర్శ‌లు ఉండ‌టంతో ఇది రాజ‌కీయ నాయ‌కులు, కోలీవుడ్ ఇండ‌స్ట్రీకి వార్‌గా కూడా మారిన విష‌యం తెలిసిందే..! ఇక తోటి కోలీవుడ్ హీరోలంతా తెలుగులోనూ మంచి మార్కెట్ సృష్టించుకోవ‌డంతో ఆ రేసులో తానూ వెనుక‌బ‌డ‌కుండా ఉండేందుకు కొంత‌కాలంగా గట్టి ప్ర‌య‌త్న‌మే చేస్తున్నాడు కోలీవుడ్ మాస్ హీరో విజ‌య్. ‘స్నేహితుడు’, ‘తుపాకీ’, ‘పులి’, ‘పోలీసోడు’, ‘భైరవ’ చిత్రాలతో ఇప్ప‌టికే మంచి గుర్తింపు తెచ్చుకున్న విష‌యం తెలిసిందే..! ఈ చిత్రం తెలుగు అనువాదం ద్వారా మ‌రోసారి టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు సిద్ధ‌మ‌య్యాడు హీరో విజ‌య్‌. తెలుగులో ఈ చిత్రం `అదిరింది` పేరుతో గురువారం ప్రేక్ష‌కుల‌ముందుకు వ‌చ్చింది. అయితే సెన్సార్ ఇబ్బందులు దాటుకువ‌చ్చేస‌రికి కాస్త స‌మ‌యం ప‌ట్ట‌డంతో ఈ చిత్రం త‌మిళనాట కన్నా తెలుగు రాష్ట్రాల్లో ఆల‌స్యంగా విడుద‌లైంది. ఇక ఈ చిత్రానికి మొద‌టినుంచి ఎదురైన వివాదాలు ప్ర‌చారంతో టాలీవుడ్ ప్రేక్ష‌కుల్లోను ఈ చిత్రంపై మంచి ఆస‌క్తి ఏర్ప‌డింద‌ని చెప్పాలి. మ‌రి విజ‌య్ హీరోగా వ‌చ్చిన ఈ చిత్రం తెలుగు ప్రేక్ష‌కుల అంచ‌నాల‌ను ఏమాత్రం చేరుకుందో విశ్లేష‌ణ లోకి వెళ్లి చూద్దాం..!

అస‌లు క‌థేంటి-
భార్గ‌వ్(విజ‌య్‌) డాక్ట‌ర్‌గా పేద‌ ప్ర‌జ‌లంద‌రికీ వైద్యం అందుబాటులో ఉండాల‌నే ఉదాత్త ల‌క్ష్యంతో కేవ‌లం ఐదు రూపాయ‌లు మాత్ర‌మే ఫీజు తీసుకుని వైద్యం అందిస్తుంటాడు. అతని సేవను గుర్తించిన ఓ సంస్థ అవార్డును ఇస్తామని ప్ర‌క‌టించి భార్గవ్‌కు ఆహ్వానం పంపుతుంది. దీంతో భార్గవ్‌ ఫారిన్‌ వెళ్తాడు. అక్కడ అత‌డికి పల్లవి(కాజల్‌) పరిచయం అవుతుంది. ఇదిలాఉండ‌గా ఇండియాలో వరుసగా కిడ్నాప్‌లు జరుగుతాయి. ఈ కేసును ర‌త్న‌వేలు(స‌త్య‌రాజ్‌)కి అప్ప‌గిస్తారు. ఆయ‌న కేసుని శోధించి అస‌లు నేర‌స్థుడు డా.భార్గ‌వ్‌(విజ‌య్‌)గా తెలుసుకుంటాడు. భార్గవ్‌కు అవార్డు అందించిన డాక్టర్ కూడా హత్యకు గురవుతాడు. ఈ హత్యలకీ, కిడ్నాప్‌లకు ఉన్న సంబంధం ఏంటి? వైద్య రంగంలో లోపాలను భార్గవ్‌ ఎలా ఎత్తి చూపించాడు. అన్నదే కథ!

విశ్లేష‌ణ‌-
ఈ సినిమా ప్ర‌స్తుతం వైద్య‌రంగంలోని లోపాల కార‌ణంగా సామాన్య ప్ర‌జ‌లు ప‌డే బాధ‌ల‌ను చూపించ‌డం ప్ర‌ధానాంశంగా తెర‌కెక్కింది. సామాజిక ప్రాధాన్య‌మున్న అంశాన్ని క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ ఎక్క‌డా మిస్ కాకుండా తెర‌కెక్కించడంలో ద‌ర్శ‌కుడి ప్ర‌తిభ క‌న‌బ‌డుతుంది. స్క్రీన్‌ప్లే పరంగా గ‌తంలో వ‌చ్చిన‌ ‘ఠాగూర్‌’, ‘శివాజీ’ వంటి చిత్రాల పోలికలు కనిపించినా.. అక్క‌డినుంచి క‌థ‌లో మొద‌ల‌య్యే ట్విస్టుల‌తో ప్రేక్ష‌కులు క‌థ‌లో లీన‌మయ్యేలా చేయ‌డంలో ద‌ర్శ‌కుడు అట్లీ త‌న ప్ర‌త్యేక‌త చూపించాడు. విజయ్‌ ఒకడు కాదు.. ఇద్దరు.. అని తెలియ‌డం, ద్వితీయార్ధంలో విజయ్‌, నిత్యామేనన్‌, ఎస్‌.జె. సూర్యల మధ్య నడిచే ఆస్పత్రి ఎపిసోడ్‌ ఈ కథకు ప్ర‌ధాన బ‌లంగా నిలిచే స‌న్నివేశాలు. ఫ్లాష్‌బ్యాక్‌ను ప్రేక్ష‌కులు ఎక్క‌డా క‌న్ఫ్యూజ‌న్‌కు గురికాకుండా చెప్ప‌డంలోనూ ద‌ర్శ‌కుడు స‌క్సెస్‌కాగ‌లిగాడు. ప్రభుత్వాసుపత్రులు ఎలా ఉండాలి? కార్పొరేట్‌ ఆస్పత్రుల దోపిడి ఎలా ఉంది? వంటి అంశాలను మాస్‌కు నచ్చేలా.. వారిలో ఆలోచలు రేకెత్తించేలా తీర్చిదిద్దిన విధానాన్ని మెచ్చుకోకుండా ఉండ‌లేం..! ఇక ఈ చిత్రంపై విప‌రీత‌మైన ఆస‌క్తి నెల‌కొన‌డానికి అస‌లు కార‌ణ‌మైన జీఎస్‌టీ, నోట్లరద్దు.. లాంటి సున్నితమైన అంశాలకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు తెలుగులో సెన్సార్ వేటుకు గురికావ‌డం ప్రేక్ష‌కుల‌కు కాస్త నిరాశ క‌లిగించే అంశ‌మే..! ఇక స‌హ‌జంగానే చిత్రంలో త‌మిళ నేటివిటీ ఎక్కువ‌గా క‌నిపించింది. అయితే స‌మ‌స్య సార్వ‌జ‌నీన‌మైన సామాజిక అంశం కావ‌డంతో ప్రేక్ష‌కుల‌ను ఆ అంశం పెద్ద‌గా ఇబ్బంది పెట్ట‌దు.

న‌టీన‌టులు, సాంకేతిక వ‌ర్గం పనితీరు-
హీరో విజ‌య్ ఈ సినిమాలో త్రిపాత్రాభిన‌యం చేశాడు. న‌టించ‌డం ఇంత సులువా అన్న‌ట్టుగా త‌న‌దైన శైలిలో మెప్పించే ఈ మాస్ హీరో తండ్రి, ఇద్ద‌రు కొడుకులుగా చ‌క్క‌టి వైవిధ్యంతో కూడిన న‌ట‌న‌ను ప్ర‌ద‌ర్శించాడు. డాక్ట‌ర్‌గా, మేజిషియ‌న్‌గా విజ‌య్ పెర్‌ఫార్మెన్స్ ఆక‌ట్టుకుంటుంది. ఇక స‌మంత‌, కాజ‌ల్, నిత్యా పాత్ర‌ల్లో నిత్యామీన‌న్‌ పాత్ర‌కు న‌ట‌న‌లో మంచి స్కోప్ ఉండ‌టంతో… నిత్యా మ‌రోసారి త‌న స‌త్తా చాటింది. ఎస్‌జె.సూర్య స్టైలిష్ విల‌న్‌గా బాగా న‌టించాడు. ఇక స‌త్య‌రాజ్‌, రాజేంద్ర‌న్, వ‌డివేలు, కోవై స‌ర‌ళ‌లు త‌మ పాత్రల ప‌రిధిలో మెప్పించారు. ఇక ఈ సినిమాకు మ‌రో ప్ర‌త్యేక‌త ఏమిటంటే టాలీవుడ్ స్టార్ రైట‌ర్‌ విజ‌యేంద్ర ప్ర‌సాద్ స్కీన్‌ప్లే అందించ‌డం. విశేషం. ఈ ర‌క‌మైన క‌థ‌లు గ‌తంలోనూ వ‌చ్చినా.. ఆస‌క్తిక‌రంగా న‌డిచిన‌ స్క్రీన్‌ప్లే ఈ చిత్రానికి ప్ర‌త్యేక బ‌లంగా నిలిచింది. ఎ.ఆర్‌.రెహామాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది. విష్ణు సినిమాటోగ్ర‌ఫీకి మంచి మార్కులు ప‌డ‌తాయి.

చివ‌రిగా-
`అదిరింది`… మాస్‌ను మెప్పించే మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా