iDreamPost
android-app
ios-app

తెలంగాణ‌పై యూపీ ఎఫెక్ట్ ఎంత‌.?

తెలంగాణ‌పై యూపీ ఎఫెక్ట్ ఎంత‌.?

భార‌తీయ జ‌న‌తా పార్టీ త‌న జోరు కొన‌సాగిస్తోంది. అనుమానాల‌ను ప‌టాపంచ‌లు చేస్తూ మ‌రోసారి విజ‌య‌ప‌తాకం ఎగుర‌వేసింది. తాజాగా వెల్ల‌డైన ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాల్లో నాలుగింటిని కైవ‌సం చేసుకుంది. ఇక భవిష్య‌త్ లో జ‌రిగే ఎన్నిక‌ల్లో బీజేపీ గురి ప్ర‌ధానంగా తెలంగాణ‌పై ఉంది. ఇప్ప‌టికే ఏడాదిన్న‌ర‌గా రాష్ట్రంలో దూకుడు ప్ర‌ద‌ర్శిస్తోంది. ఇప్పుడు తాజా ఎన్నిక‌ల ఫ‌లితాల అనంత‌రం మ‌రింత దూకుడు పెంచ‌నుంది. యూపీ ప్ర‌భావం తెలంగాణ‌పై ఉంటుంద‌ని మొద‌టినుంచీ ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంటుంది. అనుకున్నట్లే ఉత్తరప్రదేశ్‌ను మరోసారి బీజేపీ నిలబెట్టుకుంది. ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లే యూపీలో బీజేపీ దూసుకెళ్లింది.

2017 మాదిరిగానే ఈసారి కూడా బీజేపీ తనకు ఎదురులేదని నిరూపించింది. ఎలాంటి సందిగ్ధతకు తావులేకుండా పూర్తి మెజారిటీతో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్‌షాల వ్యూహరచన మరోసారి ఫలించిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ విజయంలో వారిదే కీలక భూమిక. ఇదిలాఉంటే.. తాజాగా వెలువడిన యూపీ ఫలితాలు తెలంగాణపై ప్రభావం చూపుతాయా? మోడీ, అమిత్‌షా ద్వయం ఆపరేషన్ ‘తెలంగాణ’ మొదలెట్టబోతున్నారా? సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలవైపు పావులు కదపడం కూడా రాష్ట్రంలో బీజేపీకి కలిసి రానుందా? అంటే.. చాలావరకు అవుననే సమాధానం వస్తుంది.

సీఎం కేసీఆర్‌ జాతీయ స్థాయిలో బీజేపీయేతర, కాంగ్రెసేతర కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తుండడం, తెలంగాణలో ప్రత్యామ్నాయ రేసులో కాంగ్రెస్‌, బీజేపీ పోటీ పడుతున్న నేపథ్యంలో యూపీ ఫలితాలు రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక తెలంగాణలోనూ బీజేపీ దూకుడు పెంచనుంది. దాంతో ప్రత్యామ్నాయ రేసులో మరికాస్త ముందుకువెళ్లే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే దుబ్బాక, హూజురాబాద్ ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ విజయం సాధించి సత్తా చాటింది. ఈ రెండు స్థానాల్లో అధికార టీఆర్ఎస్ గెలిచేందుకు విశ్వప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. ప్రజలు బీజేపీకే పట్టం కట్టడంతో టీఆర్ఎస్‌కు నిరాశ తప్పలేదు.

అంతకుముందు 2019 లోక్‌సభ ఎన్నికల్లో కూడా బీజేపీ నాలుగు సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. అలాగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఎవరూ ఊహించని విధంగా భారీగా సీట్లను సాధించింది. టీఆర్ఎస్‌కు గట్టిపోటీని ఇచ్చింది. ఇలా కొంతకాలంగా తెలంగాణలో మిగతా ప్రతిపక్ష పార్టీలతో పోల్చుకుంటే బీజేపీ ప్రభావం కూసింత ఎక్కువగానే ఉంది. అటు కాంగ్రెస్‌ పరిస్థితి రాష్ట్రంలో మరి దారుణంగా ఉంది. గ్రూపు రాజకీయాలతో కొట్టుమిట్టాడుతోంది. ఇలాంటి సమయంలో తెలంగాణలో బీజేపీ ఎంతోకొంత ప్రభావం చూపడం ఖాయం. ఇక అమిత్‌షా, మోడీ కాన్సంట్రేట్ చేస్తే బీజేపీ అనుకుంటున్న దానికంటే కూడా మంచి ఫలితాలు రావచ్చనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వారి నెక్స్ట్ టార్గెట్ ఆపరేషన్ ‘తెలంగాణ’ అనే అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. యూపీలో అధికారంలో ఉండి మ‌రోసారి అధికారం కోసం పోరాడి సాధించిన బీజేపీ ప్ర‌స్తుతం తెలంగాణ‌లో కేవ‌లం మూడు సీట్ల‌తోనే ఉన్న పార్టీ.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి అధికారంలోకి వ‌చ్చేందుకు ఎలాంటి వ్యూహాలు ర‌చిస్తుందో చూడాలి.