Idream media
Idream media
కొంతమందికి తన పాత మిత్రులు తన కన్నా ఉన్నత స్థితిలో ఉంటే కంటగింపుగా ఉంటుంది. అసూయతో రగిలిపోతారు. తాను కూడా ఇదే కోవకు చెందిన వాడినే అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిరూపించుకుంటున్నారు. పాత మిత్రులు, ప్రస్తుత మంత్రులు అవంతి శ్రీనివాసరావు, వెల్లంపల్లి శ్రీనివాస్‌లపై పవన్ కళ్యాణ్ తరచూ తన అక్కసును వెళ్లగక్కుతున్నారు. సందర్భం వచ్చిన ప్రతిసారి వారిపై విమర్శలు, వెటకారపు మాటలతో తన కడుపు మంటను చల్లార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.
తాజాగా జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జరిగిన సభలోనూ పవన్ కళ్యాణ్.. అవంతి, వెల్లంపల్లిలపై విమర్శలతోనే తన అసలు ప్రసంగం మొదలుపెట్టారు. వారు ఏదో అంటున్నారంటూ చెబుతూ.. అల్లంపల్లి, వెల్లుల్లి అని వెల్లంపల్లి శ్రీనివాస్‌ను, మంత్రి అవంతిని.. చేమంతి, ముద్దబంతి, గోడకు కొట్టిన బంతి అంటూ వెటకారంగా సంబోధించారు.
ఈ ఇద్దరు మంత్రుల రాజకీయ జీవితం పీఆర్‌పీతో మొదలైంది. 2009లో అవంతి శ్రీనివాసరావు పీఆర్‌పీ తరపున విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. వెల్లంపల్లి శ్రీనివాస్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి గెలిచారు. పీఆర్‌పీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన తర్వాత ఆ పార్టీలోని నేతలు ఎవరి దారి వారు చూసుకున్నారు. అవంతి టీడీపీలో చేరి 2014లో అనకాపల్లి లోక్‌సభ నుంచి పోటీ చేసి గెలిచారు. వెల్లంపల్లి బీజేపీలో చేరి మళ్లీ విజయవాడ పశ్చిమ నుంచి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి జలీల్‌ఖాన్ చేతిలో మూడు వేల ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి చవిచూశారు. 2019లో ఈ ఇద్దరు నేతలు వైసీపీ తరపున బరిలోకి దిగారు. భీమిలి నుంచి అవంతి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి వెల్లంపల్లి పోటీ చేసి విజయం సాధించారు. వైఎస్ జగన్ కేబినెట్‌లో మంత్రులుగా నియమితులయ్యారు.
పీఆర్‌పీలో ఈ నేతలకు పవన్ కళ్యాణే టిక్కెట్లు ఇప్పించారనే ప్రచారం జరిగింది. తన వల్ల ఎమ్మెల్యేలుగా అయిన వారు.. తాను పార్టీ పెట్టినప్పుడు తనతో రాలేదనే కోపం పవన్ కళ్యాణ్‌కు ఉన్నట్లుగా ఆయన మాటల ద్వారా అర్థమవుతోంది. పైగా 2019లో రెండు చోట్ల పోటీ చేసినా పవన్‌కు ఓటమి ఎదురైంది. అదే సమయంలో అవంతి, వెల్లంపల్లిలు మరోసారి విజయం సాధించి మంత్రులు కూడా అయ్యారు. తన పాత మిత్రులు తన కన్నా రాజకీయంగా మిన్నగా ఉన్నారనే అక్కసు పవన్‌లో ఉన్నట్లు వారిపై చేస్తున్న వెటకారపు వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతోంది.
ఓ పక్క తాను ఎవరినీ వ్యక్తిగతంగా దూషించనని, విమర్శలు చేయనని, అది తన సంస్కారమంటూనే మంత్రులు అవంతి, వెల్లంపల్లి శ్రీనివాస్‌లను వెటకారంగా పవన్ కళ్యాణ్ సంబోధించడం గమనార్హం. తనకు సంస్కారం ఉందంటూ ఉభయ తెలుగు రాష్ట్రాలలోని అన్ని రాజకీయ పార్టీల నేతలకు, కార్యదర్శులకు, ఆయా పార్టీల కార్యకర్తలకు, నేతలకు, మేథావులకు, ప్రజా సంఘాల వారికి నమస్కారాలు పెట్టిన పవన్ కళ్యాణ్.. ఆ వెంటనే వైసీపీ నేతలు, మంత్రులపై వ్యక్తిగత విమర్శలు, వెటకారపు పదజాలంలో అవహేళన చేయడంతో ఆయన మాటలకు చేతలకు పొంతన ఉండదని మరోసారి రుజువైంది.