Idream media
Idream media
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను బట్టి తెలంగాణ సీఎం కేసీఆర్.. జాతీయ రాజకీయాల గురించి ఆలోచించడంపై పునరాలోచన చేస్తారనే విశ్లేషణలు సాగాయి. బీజేపీకి ప్రతికూల ఫలితాలు వస్తే కేసీఆర్ స్పీడు పెంచుతాడని, అనుకూల ఫలితాలు వస్తే దూకుడు తగ్గిస్తాడనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమయ్యాయి. అయితే అందుకు భిన్నంగా కేసీఆర్ వ్యవహారశైలి ఉండడం విశేషం. జాతీయ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు, అందులో తాను కీలక ప్రాత పోషించబోతున్నట్లు కేసీఆర్ తాజాగా కుండబద్దలు కొట్టారు. బీజేపీ చేస్తున్న రాజకీయంపై నిప్పులు చెరిగారు. కాశ్మీరీ ఫైల్స్ సినిమా విషయంలో బీజేపీ వైఖరిని తూర్పారబట్టారు. ధాన్యం కొనుగోలు సహా వివిధ అంశాలపై కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని తప్పుబట్టారు.
టార్గెట్ హ్యాట్రిక్..
కేసీఆర్ జాతీయ రాజకీయాల గురించి మాట్లాడుతున్నా.. దాని వెనుక లక్ష్యం మాత్రం రాష్ట్రంలో మూడోసారి అధికారంలోకి రావడమే. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావడం అనే లక్ష్యాన్ని చేరుకునేందుకు కేసీఆర్, బీజేపీపై పోరాట పంథాని ఎంచుకున్నట్లు అర్థమవుతోంది. తెలంగాణలో ఇప్పడిప్పుడే బీజేపీ బలపడుతోంది. ఎన్ని ఓట్లు, సీట్లు బీజేపీ గెలుస్తుందనే ఆలోచన కేసీఆర్ చేయడంలేదు కానీ.. బీజేపీని లక్ష్యంగా చేసుకుని రాజకీయాలు చేయడం ద్వారా తెలంగాణ ప్రజల మద్ధతు పొందవచ్చనే ఆలోచనతో ఉన్నట్లు కనిపిస్తోంది. టీఆర్‌ఎస్ తర్వాత స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నా.. అక్కడ కేసీఆర్‌కు తూగే నాయకుడు లేకపోవడం, అంతర్గత కుమ్ములాటల వల్ల.. ఆ పార్టీపై కేసీఆర్ ఫోకస్ చేయడం లేదు.
మొన్న చంద్రబాబు..
2018 ఎన్నికల్లో రెండోసారి టీఆర్‌ఎస్‌కు అధికారం రావడం కష్టమనే వ్యాఖ్యలు అప్పుడు వినిపించాయి. అయితే కాంగ్రెస్ పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత సీన్ మారిపోయింది. ఈ పరిణామం కేసీఆర్ పాలిట వరంగా మారింది. అప్పటి వరకు వివిధ అంశాలపై మాట్లాడుతున్న కేసీఆర్.. కాంగ్రెస్, టీడీపీ పొత్తు తర్వాత దాని గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. ప్రత్యేక తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా ఇంకా ఆంధ్రావాళ్ల పెత్తనం కావాలా..? కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే ముఖ్యమంత్రి ఎవరైనా.. అధికారం చంద్రబాబు చెలాయిస్తారంటూ కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో పదే పదే చెప్పారు. ఇది వర్క్ అవుట్ అయింది. గెలుపు కష్టమనే పరిస్థితి పోయి.. మూడింట రెండొంతుల సీట్లను గులాబీ పార్టీ గెలుచుకుంది.
రేపు బీజేపీ, మోడీ..
వచ్చే ఏడాది డిసెంబర్‌లో జరిగే ఎన్నికల్లో ఎవరిని లక్ష్యంగా చేసుకుని రాజకీయాలు చేయాలనే మాట వస్తే.. కేసీఆర్ ముందు బీజేపీ కనిపిస్తోంది. చంద్రబాబు ఇక తెలంగాణకు రాడు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలతో ఉంది. బీజేపీని, మోడీ సర్కార్‌ను లక్ష్యంగా చేసుకుని జాతీయ రాజకీయాలు చేయడం ద్వారా తెలంగాణ బిడ్డ.. ఢిల్లీని ఢీ కొడుతున్నాడనే భావన తెలంగాణ ప్రజల్లో నెలకొల్పాలనే లక్ష్యంతో గులాబీ దళపతి ఉన్నట్లు తెలుస్తోంది. ఆ భావన తెలంగాణ ప్రజల్లో నెలకొంటే.. కేసీఆర్‌కు ప్రజల నుంచి బలమైన మద్ధతు లభిస్తుంది. అంతిమంగా లోక్‌సభ ఎన్నికలకు ఆరునెలల ముందు.. అంటే 2023 డిసెంబర్‌లో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో కారుపార్టీకి లాభించే అవకాశం ఉంది. హ్యాట్రిక్ విజయం సాధించిన తర్వాత.. ఇప్పుడు చెబుతున్నట్లు జాతీయ రాజకీయాలపై కేసీఆర్ పూర్తి స్థాయిలో దృష్టి పెడతారనడంలో సందేహం లేదు.