iDreamPost
android-app
ios-app

చంద్రబాబు మెప్పుకోసం మీరు కమ్యూనిజాన్ని దిగజార్చడం లేదా రామకృష్ణా?

  • Published Mar 26, 2022 | 5:57 PM Updated Updated Mar 26, 2022 | 8:40 PM
చంద్రబాబు మెప్పుకోసం మీరు కమ్యూనిజాన్ని దిగజార్చడం లేదా రామకృష్ణా?

మంత్రి పదవి కోసం తమ్మినేని సీతారామ్ సభాపతి పదవిని దిగజార్చారు అంటున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ చంద్రబాబు మెప్పుకోసం కమ్యూనిజాన్ని దిగజార్చడం లేదా? అని అధికార పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. శనివారం రామకృష్ణ విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఈసారి జరిగిన అసెంబ్లీ సమావేశాలు.. సభ హుందాను దిగజార్చాయని, 1953- 2022 వరకు జరిగిన సమావేశాలు ఎప్పుడూ ఇంత ఘోరంగా జరగలేదని విమర్శించారు. స్పీకర్ తమ్మినేని సీతారామ్ ఆ కుర్చీకి ఉన్న పరువు తీస్తున్నారని వ్యాఖ్యానించారు.

మరి మీ నిర్వాకం ఏమిటి?

స్పీకర్ తమ్మినేనిని విమర్శిస్తున్న రామకృష్ణ ఒక ప్రతిపక్ష నాయకుడిగా తాను వెలగబెట్టింది ఏమిటి? జాతీయ పార్టీ అయిన సీపీఐని రాష్ట్రంలో టీడీపీకి తోక పార్టీగా మార్చేయలేదా? ఎంతసేపూ తెలుగుదేశం పార్టీ ప్రయోజనాల పరిరక్షణకు పనిచేయడం తప్ప ఎప్పుడైనా ఒక కార్యదర్శిగా స్వతంత్రంగా వ్యవహరించారా? అని అధికార పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అధికార వైఎస్సార్ సీపీని టీడీపీ నేతలు విమర్శిస్తున్న మాదిరిగానే దుమ్మెత్తిపోయడం తప్ప కనీసం సొంతంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించలేని స్థాయికి సీపీఐని దిగజార్చిన ఘనత మీది కాదా? ప్రభుత్వం ప్రజాహితం కోసం తీసుకున్న నిర్ణయాలను సైతం మెచ్చుకోలేని కుంచిత స్వభావంతో వ్యవహరించడం సబబేనా? రాష్ట్రంలో ఒకేసారి 32 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే ఒక కమ్యూనిస్టుగా ఎందుకు స్వాగతించలేకపోయారు? అవినీతికి తావు లేకుండా అనేక సంక్షేమ పథకాల సొమ్ము లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తుంటే ప్రభుత్వాన్ని ప్రశంసించాలనిపించలేదా? అనేక ప్రజా హిత కార్యక్రమాలకు కోర్టుల ద్వారా టీడీపీ అడ్డుపడుతుంటే ఎందుకు ఖండించడం లేదు.

టీడీపీ ధోరణి మీకు తప్పు అనిపించలేదా?

అసెంబ్లీలో విచిత్రమైన ప్రవర్తనతో రోజూ కావాలనే సస్పెండ్ అయిన, సభ గౌరవానికి భంగం కలిగించిన టీడీపీ సభ్యులను రామకృష్ణ ఎందుకు తప్పుపట్టడం లేదో చెప్పాలి. ప్రధాన ప్రతిపక్షం ఉద్దేశపూర్వకంగా సభలో అల్లరి చేసి రాజకీయంగా ప్రయోజనం పొందాలని యత్నించిన విషయం అందరికీ అర్థమైనా రామకృష్ణ ఇంకా టీడీపీని ఎందుకు వెనకేసుకొస్తున్నారు? అసెంబ్లీలో ఏకపక్షంగా నిర్ణయాలు ఆమోదించుకున్నారు. ప్రజల సమస్యలు, పరిష్కారంపై చర్చలు జరగలేదని నిందలు వేస్తున్నారు. మరి ఉన్న ఒక్క ప్రతిపక్షం సభను కావాలని బహిష్కరిస్తే అధికార పార్టీకి అంతకన్న వేరు మార్గం ఏముంటుంది?

ఆ నైతికత ఉందా?

రోజూ ప్రెస్ మీట్లు పెట్టి అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని, ఇటు రాష్ట్రంలోని వైఎస్సార్ సీపీని విమర్శించడం తప్ప సీపీఐ ఆంధ్రప్రదేశ్ లో బలపడడానికి రామకృష్ణ చేసిందేమిటి అని అధికార పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. స్పీకర్ తమ్మినేని మంత్రి పదవికి ఆశపడ్డారని ఆరోపిస్తున్నారు సరే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు విదిల్చే నాలుగు సీట్ల కోసం సీపీఐని టీడీపీకి తాకట్టుపెట్టడం సరైనదేనా అని వైఎస్సార్ సీపీ నేతలు అడుగుతున్నారు. చరిత్రాత్మకమైన సీపీఐని చంద్రబాబు పార్టీ ఆఫ్ ఇండియాగా మార్చేసిన రామకృష్ణకు.. స్పీకర్ కుర్చీ పరువు, అసెంబ్లీ గౌరవం, మర్యాదల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు అని అంటున్నారు.