iDreamPost
android-app
ios-app

యుద్ధం చేయాల్సింది ఎవరితో..?

యుద్ధం చేయాల్సింది ఎవరితో..?

రష్యా ఒకప్పుడు యూఎస్‌ఎస్‌ఆర్‌లో భాగంగా ఉన్న ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తోంది. రష్యాకు వ్యతిరేకంగా ఏర్పడిన అమెరికా, నాటో కూటమిలో చేరాలనే ఉక్రెయిన్‌ ప్రతిపాదనకు వ్యతిరేకంగా రష్యా దాడులు ప్రారంభించింది. ఉక్రెయిన్‌ నాటోలో చేరితే.. తన ఉనికికే ప్రమాదమని రష్యా ఆందోళన ఫలితమే ఈ యుద్ధం. ఉక్రెయిన్‌ను నాటోలో చేరాలంటూ ఎగదోసిన అమెరికా, నాటో దేశాలు.. ఇప్పుడు ఉక్రెయిన్‌ను గాలికి వదిలేశాయి. ఉక్రెయిన్‌లోని అమాయక ప్రజలు బలి అవుతున్నారు.

తాజాగా అమెరికా అధ్యక్షుడు రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంపై స్పందించారు. పుతిన్‌పై నిప్పులు చెరిగారు. పక్కా ప్రణాళికతోనే పుతిన్‌ ఈ యుద్ధం ప్రారంభించారని బైడెన్‌ మండిపడ్డారు. ‘‘పాశ్చాత్య దేశాలు, నాటో రష్యా దాడులకు స్పందించవని పుతిన్‌ భావించారు. కానీ పుతిన్‌ అంచనా తప్పు. మేము ఏ పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించారు. బైడెన్‌ వ్యాఖ్యలు.. ఏ క్షణమైనా తాము రష్యాతో యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉన్నామనేలా ఉన్నాయి. అదే జరిగితే.. మూడో ప్రపంచ యుద్ధం అనివార్యమవుతుంది. ఈ ప్రపంచం మునుపెన్నడూ చూడని విపత్తును చవిచూస్తుంది.

ఇప్పటికే ప్రపంచం కరోనాతో యుద్ధం చేస్తోంది. ఈ యుద్ధం రెండేళ్లుగా నిరంతరంగా సాగుతోంది. కరోనా వల్ల ఎక్కువగా నష్టపోయిన దేశాల్లో.. అమెరికా, రష్యా, నాటో దేశాలు ముందు వరసలో ఉన్నాయి. ఆయా దేశాల్లోని ప్రజలు తమకు తాముగా కరోనాపై యుద్ధం చేస్తున్నారు. ప్రజలను కరోనా నుంచి రక్షించాల్సిన అమెరికా, రష్యా దేశాలు ఉక్రెయిన్‌ను అడ్డం పెట్టుకుని 1991 ముందు నాటి ప్రచ్ఛన్న యుద్ధానికి దిగాయి. ప్రత్యక్ష యుద్ధానికి సై అంటూ ప్రకటనలు చేస్తున్నాయి.

కరోనా ప్రభావానికి భారీగా లోనైన భారత్, బ్రెజిల్‌ దేశాలు.. తమ ప్రజలను రక్షించేందుకు కరోనాతో యుద్ధం చేస్తున్నాయి. కరోనా కట్టడి చర్యలతోపాటు, వ్యాక్సినేషన్‌ కార్యక్రమం భారీ ఎత్తున చేపట్టడంతో భారత్, బ్రెజిల్‌ దేశాల్లో కరోనా కేసులు తగ్గాయి. గడిచిన 24 గంటల్లో బ్రెజిల్‌లో దాదాపు 25 వేల కేసులు నమోదవగా, భారత్‌లో ఆ సంఖ్య కేవలం ఏడు వేలు మాత్రమే. ఈ పరిస్థితి కయ్యానికి కాలుదువ్వుతున్న అమెరికా, రష్యాలలో భిన్నంగా ఉంది. అక్కడ ప్రజలు ఇప్పటికీ భారీ సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారు. వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

అమెరికాలో తాజాగా 41,899 మంది కరోనా వైరస్‌ బారిన పడగా.. 1,451 మంది ప్రాణాలు కోల్పోయారు. రష్యాలో 97,333 మంది వైరస్‌ బారిన పడగా.. కొత్తగా 786 మంది మరణించారు. నాటో సభ్య దేశాలైన జర్మనీలో కొత్తగా 1,50,565 మందికి వైరస్‌ సోకగా.. 275 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫ్రాన్స్‌లో 79,794 మందికి వైరస్‌ సోకగా.. 209 మంది వైరస్‌కు బలయ్యారు. ఈ గణాంకాలు ద్వారా.. అమెరికా, రష్యా, నాటో దేశాలతోపాటు ప్రపంచ దేశాలు యుద్ధం చేయాల్సింది ఎవరితో..? అనే ప్రశ్న ఉదయిస్తుంది. యుద్ధం చేయాల్సింది పొరుగు, శత్రు దేశాలతోనా..? కరోనాతోనా..?