iDreamPost

జైలు నుండి నామినేషన్! ఒకేసారి 3 స్థానాల్లో గెలిచిన నేత!

  • Published Nov 28, 2023 | 3:13 PMUpdated Nov 28, 2023 | 3:13 PM

ప్రస్తుత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ సహా పలువురు కీలక నేతలు ఒకటి కన్నా ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తున్నారు. అయితే ఈ ట్రెండ్ ఇప్పటిది కాదు. సుమారు 70 ఏళ్ల క్రితమే ఓ వ్యక్తి జైలు నుంచి నామినేషన్ వేయడం మాత్రమే కాక ఒకేసారి మూడు చోట్ల విజయం సాధించారు. ఇంతకు ఎవరా నేత అంటే..

ప్రస్తుత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ సహా పలువురు కీలక నేతలు ఒకటి కన్నా ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తున్నారు. అయితే ఈ ట్రెండ్ ఇప్పటిది కాదు. సుమారు 70 ఏళ్ల క్రితమే ఓ వ్యక్తి జైలు నుంచి నామినేషన్ వేయడం మాత్రమే కాక ఒకేసారి మూడు చోట్ల విజయం సాధించారు. ఇంతకు ఎవరా నేత అంటే..

  • Published Nov 28, 2023 | 3:13 PMUpdated Nov 28, 2023 | 3:13 PM
జైలు నుండి నామినేషన్! ఒకేసారి 3 స్థానాల్లో గెలిచిన నేత!

తెలంగాణలోనే కాక దేశవ్యాప్తంగా మరో నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక తెలంగాణలో నేటి సాయంత్రంతో ప్రచార పర్వానికి శుభం కార్డు పడనుంది. నవంబర్ 30న పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించడం కోసం అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ, బీజేపీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రజాకర్షక హామీలతో మేనిఫెస్టోలు విడుదల చేశాయి. మరి జనాలు ఎవరిని నమ్ముతున్నారో.. ఎవరిని ముంచేటోళ్లుగా భావిస్తున్నారో తెలియాలంటే.. డిసెంబర్ 1 వరకు ఆగాలి. ఇక ఈ సారి ఎన్నికల్లో కొందరు కేసీఆర్ సహా కొందరు కీలక నేతలు రెండు చోట్ల బరిలో దిగుతున్నారు. దాంతో ఆయా నియోజకవర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది. అయితే ఒకే అభ్యర్థి ఇలా రెండు, మూడు నియోజకవర్గాల్లో పోటీ చేయడం ఇదే ప్రథమం కాదు. గతంలో కూడా చాలా మంది కీలక నేతలు ఒకటి కంటే ఎక్కువ స్థానాల్లో బరిలో దిగారు.

ఈ క్రమంలో తాజాగా ఓ నాయకుడికి సంబంధించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చింది. ఆయన ఏకంగా జైలు నుంచి నామినేషన్ వేసి.. ఎన్నికల్లో విజయం సాధించారు. పైగా ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన అంశం ఏంటి అంటే ఆయన ఒకటి, రెండు కాదు.. ఏకంగా మూడు స్థానాల్లో పోటీ చేయడమే కాక.. ప్రతి చోటా విజయం సాధించారు. ఎన్టీఆర్ ను మించిన ఆ నాయకుడు ఎవరంటే.. ఆయనే పెండ్యాల రాఘవరావు.

1952 ఎన్నికల్లో ఈ రికార్డు..

1952 సాధారణ ఎన్నికల్లో రాఘవరావు ఈ రికార్డు సృష్టించారు. కమ్యూనిస్ట్ నాయకుడు అయిన పెండ్యాల రాఘవరావు 1952 ఎన్నికల్లో ప్రొగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్(పీడీఎఫ్) అభ్యర్థిగా బరిలో దిగి.. ఈ రికార్డ్ సాధించారు. అప్పుడు లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగాయి. రాఘవరావు వరంగల్‌ లోక్‌సభ స్థానంతో పాటు హన్మకొండ, వర్ధన్నపేట శాసనసభ స్థానాల నుంచి పోటీ చేశారు. అన్ని చోట్లా విజయం సాధించారు. అయితే, గెలిచాక హన్మకొండ, వర్ధన్నపేట అసెంబ్లీ నియోజకవర్గాలను వదులుకుని వరంగల్ లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు రాఘవరావు.

ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. ఈ ఎన్నికల్లో నామినేషన్ వేసే సమయానికి రాఘవరావు జైలులో ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలు చేసినందుకు అప్పటి ప్రభుత్వం ఆయనని అరెస్ట్ చేసి జైలులో పెట్టింది. అయినా సరే ఆయన జైల్ నుంచే నామినేషన్ వేయడమే కాక.. మూడు చోట్లా విజయం సాధించారు. అప్పటికి రాఘవరావు వయసు కేవలం 35 ఏళ్లు మాత్రమే.

రాఘవరావు ఓడించినవారు ఎవరంటే..

వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి రాఘవరావు పీడీఎఫ్ అభ్యర్థిగా పోటీ చేయగా, కాంగ్రెస్ తరఫున కాళోజీ నారాయణ రావు పోటీ చేశారు. అలానే సోషలిస్ట్ పార్టీ నుంచి కె.సోమయాజులు బరిలో దిగారు. ఈ ముగ్గురిలో రాఘవరావు అత్యధికంగా 77,267 ఓట్లు సాధించి గెలిచారు.

ఎన్టీఆర్ కూడా 3 చోట్ల గెలిచారు..

రాఘవరావులానే తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నందమూరి తారకరామరావు కూడా మూడు స్థానాల్లో పోటీ చేసి విజయం సాధించారు. ఉమ్మడి ఏపీలో 1985లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో.. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల నుంచి పోటీ చేయాలన్న ఉద్దేశంతో కోస్తాలోని గుడివాడ, రాయలసీమలోని హిందూపురం, తెలంగాణలోని నల్గొండ అసెంబ్లీ స్థానాలకు పోటీ చేశారు. మూడు చోట్లా ఆయన విజయం సాధించారు. రాఘవరావు, ఎన్టీఆర్ లానే మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయీ ఒకేసారి మూడు స్థానాల్లో పోటీచేసినప్పటికీ, ఒక్క స్థానంలో మాత్రమే గెలిచారు.

రాఘవరావు వ్యక్తిగత జీవితం..

పెండ్యాల రాఘవరావు 1917 మార్చి 15న వరంగల్ జిల్లా చినపెండ్యాలలో జన్మించారు. చిన్నతనం నుంచే నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడారు. హైదరాబాద్ సంస్థానంలో ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించి, పోరాటాలు సాగించి జైలుకెళ్లారు. ‘నా ప్రజా జీవితం’ పేరిట ఆయన రాసిన ఆత్మకథలో నాటి సామాజిక ఆర్థిక పరిస్థితులతో పాటు తాను సాగించిన పోరాటాలు, రాజకీయ పరిస్థితులనూ వివరించారు. హైదరాబాద్ రాష్ట్రంలో పోలీస్ యాక్షన్ సమయంలో ఆయన మూడేళ్లు జైలులో గడిపారు. ఆ సమయంలోనే 1952లో జైలు నుంచే నామినేషన్ వేసి ఎన్నికల్లో గెలిచారు.

ఏడో తరగతి వరకే చదువుకున్నప్పటికీ తెలుగుతో పాటు ఇంగ్లిష్, హిందీ, ఉర్దూలో అనర్గళంగా మాట్లాడేవారు రాఘరవారు. అందుకే మూడు చోట్ల నుంచి ఆయన గెలిచినప్పటికీ అందులోని రెండు శాసనసభ సీట్లను వదులుకుని.. లోక్‌సభ‌కు ప్రాతినిధ్యం వహించాలని అప్పటి కమ్యూనిస్ట్ నాయకులు రాఘవరావుకి సూచించారని ఆయన కుమార్తె కొండపల్లి నీహారిణి అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అయితే నేటి తరానికి ఆయన గురించి తెలియకపోవడం విచారకరం అన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి