బీజేపీపై బాంబ్‌ పేల్చిన ప్రవీణ్‌ తొగాడియా

ఉత్తరప్రదేశ్‌లో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్న బీజేపీకి.. విజయం అంత సులువుగా దక్కదనే అభిప్రాయాలు ఎన్నికల ముందు నుంచి ఉన్నాయి. గత నెలలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఐదు దశల ఎన్నికలు పూర్తయ్యాయి. ఈ రోజు ఆరో దశ పోలింగ్‌ జరుగుతోంది. ఈ దశ పోలింగ్‌కు ఒక్కరోజు ముందు బీజేపీపై బాంబ్‌ పేల్చారు విశ్వహిందూ పరిషత్‌ మాజీ కార్యనిర్వాహఖ అధ్యక్షుడు ప్రవీణ్‌ తొగాడియా. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో బీజేపీకి విజయం అంత సులువు కాదన్నారు. అందుకు గల కారణాలను కూడా ప్రవీణ్‌ తొగాడియా వివరించారు.

ముంబైలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలు, బీజేపీ విజయావకాశాలపై మాట్లాడారు. సాగు చట్టాల రద్దు, రైతుల ఆందోళనలపై బీజేపీ వ్యవహరించిన తీరు.. ఆ పార్టీకి నష్టం చేకూర్చబోతోందని ప్రవీణ్‌ అభిప్రాయపడ్డారు. సాగు చట్టాలను రద్దులో జాప్యం, రైతుల పట్ల బీజేపీ వ్యవహరించిన తీరు ఏమాత్రం సరికాదని ప్రవీణ్‌ తొగాడియా అన్నారు. ఇదే అభిప్రాయాన్ని గతంలో వివిధ పార్టీల నేతలు, రైతు సంఘాల నేతలు, బీజేపీ ఎంపీ వరుణ్‌ గాంధీలు కూడా వెలిబుచ్చారు. అయితే ఇప్పుడు వీహెచ్‌పీ మాజీ కార్యనిర్వాహఖ అధ్యక్షుడే ఇలా మాట్లాడడం వల్ల ఆ ప్రభావం ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో ఉంటుందనే ఆందోళన కమలనాథుల్లో నెలకొంది.

సాగు చట్టాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకునే సమయంలో.. బీజేపీ సర్కార్‌ పలు హామీలు ఇచ్చింది. వాటిపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. చట్టాలకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో దాదాపు ఏడు వందల మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. వర్షం, చలి, ఎండ వంటి ప్రతికూల పరిస్థితుల్లోనే రైతులు రోడ్లపైనే ఉద్యమం సాగించారు. చనిపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలనే డిమాండ్‌ వచ్చింది. దానిపై అప్పుడు సానుకూలంగా స్పందించిన మోడీ సర్కార్‌.. ఆ తర్వాత ముఖం చాటేసింది. మూడు నెలలుగా ఆ విషయంలో ఎలాంటి ముందడుగు లేదు. ఈ విషయాన్నే ప్రస్తావించిన ప్రవీణ్‌ తొగాడియా.. బీజేపీ తీరును ఏకిపారేశారు. ‘‘ఆఫ్ఘనిస్తాన్‌కు మనం 20వేలకోట్ల రూపాయల సాయం చేశాం. కానీ చనిపోయిన మన రైతులకు కోటి రూపాయలు ఇవ్వలేమా..? మనం రైతుల్ని ప్రేమిస్తామా..? లేక ఆఫ్ఘనిస్తాన్‌నా..?’’ అంటూ ప్రవీణ్‌.. బీజేపీ సర్కార్‌ తీరును ఎండగట్టారు.

ప్రవీణ్‌ తొగాడియా మరో విషయం కూడా చెప్పారు. ఇప్పుడు బీజేపీ అంటే కోపంగా ఉన్న రైతులు అందరూ.. గత ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటువేసిన వారేనని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యతో రైతులు బీజేపీపై కోపంగా ఉన్నారనే భావనలో ఆర్‌ఎస్‌ఎస్, వీహెచ్‌పీ, బీజేపీ నేతలు ఉన్నారనే విషయం అర్థమవుతోంది. రైతులను మోసం చేసిన బీజేపీని శిక్షించండంటూ ఇటీవల సంయుక్త కిసాన్‌ మోర్చా ఉత్తరప్రదేశ్‌ ప్రజలకు పిలుపునిచ్చింది. ఈ పరిణామాలతో సాగు చట్టాలను రద్దు చేసినా ఫలితం లేదని బీజేపీ నేతలు చింతిస్తున్నారు. అయితే ఎన్నికల ఫలితాలు వస్తే గానీ.. రైతులు బీజేపీ పై కోపంగా ఉన్నారా..? లేదా..? అనేది తెలుస్తుంది. ఉత్తరప్రదేశ్‌లో తుది విడత పోలింగ్‌ ఈ నెల 7వ తేదీన జరుగుతుంది. మార్చి 10వ తేదీన ఉత్తరప్రదేశ్‌తో సహా పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయి.

Show comments