iDreamPost
android-app
ios-app

భీమ్లా నాయక్‌ కోసం లోకేష్‌ ఎదురుచూస్తున్నారట..!

భీమ్లా నాయక్‌ కోసం లోకేష్‌ ఎదురుచూస్తున్నారట..!

రాజకీయ లక్ష్యాలు సాధించే క్రమంలో కొంతమంది రాజకీయ నాయకులు ఇటీవల సినిమా ప్రమోటర్ల అవతారం ఎత్తుతున్నారు. ఆ మధ్య తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల సమయంలో జనసేన అధినేత, సినీనటుడు పవన్‌ కళ్యాణ్‌ నటించిన చిత్రం వకీల్‌సాబ్‌ చిత్రం విడుదలైంది. పవన్‌ మద్ధతు కోసం చేసిన ప్రయత్నాల్లో.. ఆయన అభిమానులను ఆకట్టుకునేందుకు వకీల్‌సాబ్‌ సినిమా చూస్తున్నానంటూ బీజేపీ నేత, ఏపీ సహ ఇంఛార్జి సునిల్‌ దియోధర్‌ థియేటర్‌ వద్దకు వెళ్లి ఫేస్‌బుక్‌లో లైవ్‌ పెట్టారు. తాను వకీల్‌సాబ్‌ సినిమా చూసేందుకు వచ్చానంటూ పవన్‌కళ్యాణ్‌ అభిమానులకు అర్థం అయ్యేందుకు తెలుగులో మాట్లాడారు.

పవన్‌కోసం బీజేపీనేతలే కాదు.. టీడీపీ కూడా పాకులాడుతోంది. జనసేనతో తిరిగి పొత్తు పెట్టుకునేందుకు ఊవ్విళ్లూరుతున్న టీడీపీ.. ఆ దిశగా చాలాకాలం నుంచే ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా నారా లోకేష్, పవన్‌ కళ్యాణ్‌ నటించిన భీమ్లానాయక్‌ చిత్రానికి ప్రమోటర్‌ అవతారమెత్తారు. భీమ్లానాయక్‌ సినిమాకోసం ఎదురుచూస్తున్నానంటూ ఆయన తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. భీమ్లానాయక్‌ చిత్రానికి మంచిస్పందన వస్తోందన్నారు. సీఎం జగన్‌రెడ్డి అన్ని పరిశ్రమలను ధ్వంసం చేస్తున్నారని, ఇప్పుడు సినీపరిశ్రమ వంతు వచ్చిందని విమర్శించారు. అన్ని కుట్రలను అధిగమించి భీమ్లానాయక్‌ మంచివిజయం సాధించాలంటూ నారాలోకేష్‌ అభిలషించారు.

నారా లోకేష్‌ ఇలా వ్యవహరించడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. రాబోయే ఎన్నికల్లో ఒంటరిగా వైసీపీని ఎదుర్కోవడం కష్టసాధ్యమైన పని. ఈ విషయం చంద్రబాబుతో సహా అందరికీ తెలిసిన విషయమే. జనసేన, సీపీఎం, సీపీఐ, వస్తే బీజేపీని కలుపుకుని ఈసారి ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నారు చంద్రబాబు. ఐదుశాతం ఓట్లు మారితే చాలు వైసీపీ అధికారం పోతుందని ఇటీవల చంద్రబాబు వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో వైసీపీకి 50.06 శాతం, టీడీపీకి 39.26 శాతం, జనసేనకు 5.54 శాతం ఓట్లు వచ్చాయి. ఇక బీజేపీ, కాంగ్రెస్‌ సహా అన్ని పార్టీలకు వచ్చిన ఓట్లు మరో రెండుశాతం ఓట్లు వచ్చాయి.

వైసీపీకి టీడీపీ మధ్య ఓట్ల వ్యత్యాసం 10.8 శాతం. ఐదు శాతం ఓట్లు మారితే వైసీపీ అధికారం పోతుందని అంటున్న చంద్రబాబు.. ఆ ఓట్లను జనసేన ద్వారా సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జనసేనతో పొత్తువల్ల ఆ పార్టీకి వచ్చే ఐదు లేదా ఆరుశాతం ఓట్లు కలిస్తే.. టీడీపీ కూటమికి వచ్చే ఓట్లు 45శాతంపైగా ఉంటాయి. ఈ తరహా లెక్కలు వేసుకున్న చంద్రబాబు.. జనసేనానిని మళ్లీ దగ్గర చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, టీడీపీ భావి ముఖ్యమంత్రి అభ్యర్థి అయిన నారా లోకేష్‌.. భీమ్లానాయక్‌ సినిమాకు ప్రమోటర్‌ అవతారం ఎత్తారు. కోటివిద్యలు కూటికోసం అన్నట్లుగా టీడీపీ నేతల కోటి విద్యలు.. అధికారంకోసమే. మరి వీరి ప్రయత్నాలు ఫలిస్తాయా..? లేదా..? కాలమే తేల్చాలి.