iDreamPost
android-app
ios-app

TDPకి ముద్దరబోయిన రాజీనామా.. బాబు ఓ మోసకారి అంటూ

  • Published Feb 21, 2024 | 11:55 AM Updated Updated Feb 21, 2024 | 11:55 AM

ఎన్నికల ముందు టీడీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. సీనియర్‌ నేత ఒకరు టీడీపీ నుంచి బయటకు వస్తున్నట్లు ప్రకటించడమే కాక.. చంద్రబాబుపై విమర్శలు చేశాడు. ఆ వివరాలు..

ఎన్నికల ముందు టీడీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. సీనియర్‌ నేత ఒకరు టీడీపీ నుంచి బయటకు వస్తున్నట్లు ప్రకటించడమే కాక.. చంద్రబాబుపై విమర్శలు చేశాడు. ఆ వివరాలు..

  • Published Feb 21, 2024 | 11:55 AMUpdated Feb 21, 2024 | 11:55 AM
TDPకి ముద్దరబోయిన రాజీనామా.. బాబు ఓ మోసకారి అంటూ

ఎన్నికలు సమీపిస్తోన్న వేళ తెలుగుదేశం పార్టీకి భారీ షాక్‌ తగిలింది. టీడీపీ నుంచి సీనియర్లు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. చంద్రబాబు స్వార్థపూరిత రాజకీయాల గురించి అర్థం చేసుకున్న నేతలు.. క్రమంగా ఆయనకు దూరమవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా నూజివీడు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వర్లు.. తెలుగు దేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.

నూజివీడులోని తన కార్యాలయంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఫొటోతో కూడిన ఫ్లెక్సీని మంగళవారం నాడు ఆయనే స్వయంగా తొలగించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేశారు. నియోజకవర్గంలో పదేళ్ల పాటు పనిచేసి టీడీపీని పటిష్టంగా తయారు చేస్తే ఇప్పుడు చంద్రబాబుకు తాను పనికిరాలేదని ముద్దరబోయిన ఆవేదన వ్యక్తం చేశారు.

2014 ఎన్నికల వేళ ఇక్కడ నుంచి పోటీ చేయడానికి ఎవరూ లేకపోవడంతో తాను అడగకుండానే యనమల రామకృష్ణుడితో కబురు చేసి నూజివీడు టికెట్‌ ఇచ్చారని ముద్దరబోయిన గుర్తు చేశారు. నాడు పిలిచి మరీ ఇచ్చి.. ఇప్పుడు టికెట్‌ నిరాకరించడానికి గల కారణమేమిటో చెప్పమని తాను అడుగుతుంటే.. అందుకు బాబు వద్ద సమాధానం లేదన్నారు. తనను పదేళ్ల పాటు వాడుకొని బలిపశువును చేశారంటూ ముద్దరబోయిన చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

ఉరిశిక్ష వేసేటప్పుడు కూడా ఆఖరి కోరిక ఏమిటని జడ్జి అడుగుతారని, టీడీపీలో మాత్రం అలాంటి నైతిక విలువలు ఏమీ లేవంటూ ఘాటు విమర్శలు చేశారు. ‘చంద్రబాబుకు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి, యనమల రామకృష్ణుడికి నమస్కారం, టీడీపీకి ఓ పెద్ద నమస్కారం’ అంటూ ముద్దరబోయిన రెండు చేతులెత్తి దండం పెట్టారు.

టీడీపీకి రాజీనామా తర్వాత.. తన అభిమానులు, సానుభూతిపరులు, కలిసివచ్చే కార్యకర్తలు, నాయకులతో చర్చించి వారి నిర్ణయం మేరకు త్వరలోనే భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటిస్తానన్నారు ముద్దరబోయిన. అంతేకాక టీడీపీలో తనతను నమ్మించి మోసం చేశారని.. తనను పదేళ్లపాటు వాడుకొని అన్యాయంగా బయటకు గెంటివేసిన వారి అంతు చూస్తానని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. తనకు జరిగిన అన్యాయంపై పోరాడతానని తెలిపారు. పుట్టగతులు లేకుండా పోయే పరిస్థితి టీడీపీకి వచ్చిందని, తనకు అన్యాయం చేసిన ఆ పార్టీ సంగతి చూస్తానంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.