ఆర్థికంగా తోడ్పాటు, రాజకీయంగా అస్పష్టత, అమరావతి తీర్పు తర్వాత టీడీపీ నేతల్లో కొత్త బెంగ

అమరావతి చుట్టూ టీడీపీ చాలా ఆశలు పెట్టుకుంది. ఆపార్టీ నేతల ఆర్థిక సామ్రాజ్యం దానితో ముడిపడి ఉండడం అందుకు ప్రధాన కారణం. అనేకమంది నాయకులు వేలకోట్ల పెట్టుబడులు పెట్టి, లక్షలకోట్ల రిటర్నుల మీద ఆశలు పెట్టుకుని అమరావతి నిర్మాణానికి పూనుకున్నట్టు కనిపిస్తుంది. దాంతో అమరావతి చుట్టూ ఏర్పడిన సందిగ్ధం తొలగిపోతే టీడీపీ కీలక నేతల ఆర్థిక ప్రయోజనాలకు ఢోకా ఉండదు. ఏకైక రాజధానిగా నిర్ణయం జరిగితే అది ఖచ్చితంగా టీడీపీలో పెత్తనం చేసే నేతలకు భారీలబ్దికి మార్గం సుగమం చేస్తుంది.

అదే సమయంలో రాజకీయంగా దాని ప్రభావం ఎలా ఉంటుందన్నది టీడీపీ నేతలకు అంతుబట్టడం లేదు. ఇప్పటికే ఏపీలో కమ్మ కులస్తుల మీద ఇతర అన్ని కులాల్లోనూ వైరం స్పష్టంగా ఉంది. కాపులు చాలాకాలంగా అంటీముట్టనట్టుగా ఉంటారు. రెడ్లతో వైరం ఎలానూ తప్పదు. ఎస్సీ, మైనార్టీలు చేరువయ్యే అవకాశం లేదు. సుదీర్ఘకాలం పాటు కొమ్ముకాసిన బీసీల్లోనూ అనుమానాలు బలపడ్డాయి. దాంతో కమ్మ కులాధిపత్యానికి అమరావతి ఓ నిలువుటద్దం అనే అభిప్రాయం అన్ని వర్గాల్లో బలపడింది. ఫలితంగా చివరకు అమరావతి ప్రాంతంలో కూడా ఇతర కులస్తులంతా కలిసి టీడీపీ అభ్యర్థులను ఓడించి ప్రతీకారం తీర్చుకున్నారు. ముఖ్యంగా అమరావతి ప్రకటించిన తర్వాత రెచ్చిపోయిన కమ్మలకు గుణపాఠం చెప్పారనే అభిప్రాయం బలంగా ఉంది.

ఈ తరుణంలో జగన్ ప్రయత్నించిన మూడు రాజధానుల ద్వారా ఉత్తరాంధ్ర బీసీలు, కర్నూలు మైనార్టీలకు మేలు జరగకుండా టీడీపీ అడ్డుకుందనే వాదన పెరిగితే ఆపార్టీకి రాజకీయంగా కష్టాలు తప్పవు. ముఖ్యంగా ఇన్నాళ్లుగా టీడీపీకి కొమ్ము కాస్తున్న ఉత్తరాంధ్ర కొప్పుల వెలమల్లో ఆర్థికంగా నిలదొక్కుకున్న పలువురు విశాఖ రాజధానిని ఆహ్వానిస్తున్నారు. దానిని చంద్రబాబు, టీడీపీ అడ్డుకోవడం వారికి రుచించడం లేదు. ఫలితంగా కొప్పుల వెలమల్లో కూడా టీడీపీ పట్టుకోల్పోయే ప్రమాదం దాపురిస్తుందా అనే అనుమానం టీడీపీలో కొత్త బెంగకు కారణమవుతోంది. అదే జరిగితే ఇప్పటికే దూరమయిన తూర్పు కాపులకు తోడు కొప్పుల వెలమలు తోడయితే ఉత్తరాంధ్ర మీద కూడా టీడీపీ ఆశలు వదులుకోవాల్సి ఉంటుంది. అంతిమంగా రాజకీయంగా టీడీపీకి కోలుకోలేని దెబ్బ అవుతుంది.

ఇప్పటికే అమరావతికి సంబంధించి టీడీపీ హడావిడి అంతా రెండు మూడు జిల్లాలకే పరిమితం అయ్యింది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కమ్మ కులస్తులున్న బెల్ట్ లోనే దాని తాకిడి కనిపించింది. ఇప్పుడు రాజకీయంగానూ ఈ మూడు జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ దెబ్బకొట్టే ప్రమాదం లేకపోలేదు. అమరావతికి కట్టుబడి టీడీపీ కుయుక్తులకు సిద్ధమయ్యిందనే వాదన బలపడితే టీడీపీకి కష్టాలు అనివార్యం. జగన్ చేసిన ప్రయత్నాలను అడ్డుకున్నారనే వాదన సామాన్యుల్లోకి వెళితే టీడీపీకి చుక్కలే. ముఖ్యంగా అన్ని ప్రాంతాలు, అన్ని కులాలకు మేలు చేసే నిర్ణయానికి టీడీపీ అడ్డుపడిందనే అభిప్రాయం బలపడడం టీడీపీని బలహీనం చేస్తుందనే అంచనాలున్నాయి. దాంతో దానిని ఎదుర్కోవాలనే లక్ష్యంతోనే తాజాగా టీడీపీ నాయకత్వం మల్లగుల్లాలు పడుతోంది.

రాజకీయంగా జరగబోతున్న నష్టం రీత్యా టీడీపీకి ప్రత్యామ్నాయ మార్గాలు కూడా కనిపించడం లేదు. అందుకే ఎలా ముందుకెళ్లాలనేది చంద్రబాబుని సతమతం చేస్తున్నట్టు పలువురు భావిస్తున్నారు. ఆర్థికంగా చంద్రబాబు సహా టీడీపీ నేతలందరికీ అమరావతి ప్రాజెక్టు ద్వారా వేలకోట్ల లబ్ది ఖాయం. అదే సమయంలో చంద్రబాబు సహా ఇతర టీడీపీ నేతలు తాము ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రాంతాల్లో ప్రజాకోర్టులో బోనులో నిలబడాల్సి వస్తుందనే వాదన చర్చనీయాంశం అవుతోంది. టీడీపీ దిగువ శ్రేణి నేతలను ఇది కలవరపరుస్తోంది.

Show comments