iDreamPost
iDreamPost
స్వార్థ ప్రయోజనాల కోసం పోలవరాన్ని తాకట్టు పెడుతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమా చేసిన వ్యాఖ్యలను వైఎస్సార్ సీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. సీబీఐ, ఈడీ, బాబాయి హత్య కేసుల నుంచి తప్పించుకునేందుకే జగన్ రాజీపడి కేంద్రంముందు నోరెత్తలేదని ఉమా శనివారం ఆరోపించారు.
నిన్న బాబు, నేడు ఉమా..
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ శుక్రవారం పోలవరం ప్రాజెక్టును, నిర్వాసితులకు నిర్మించిన కాలనీలను సందర్శించారు. ప్రాజెక్టు ప్రగతిని సమీక్షించారు. సవరించిన అంచనా వ్యయం రూ.55,548.87 కోట్లకు క్లియరెన్స్ ఇవ్వాలన్న సీఎం అభ్యర్థనకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. అంతే చంద్రబాబు వెంటనే అలర్ట్ అయిపోయారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే ప్రస్తుత ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందో అన్న ఆందోళనతో మీడియాసాక్షిగా తనకు అలవాటైన అబద్దాలను వల్లించేశారు. తమ హయాంలో 72 శాతం పనులు చేశామని, టీడీపీ అధికారంలో ఉండి ఉంటే ఈపాటికి పోలవరం పూర్తి అయ్యేదని సెలవిచ్చారు. ఈ రోజు ఆ పార్టీ నేత, నీటిపారుదల శాఖ మాజీమంత్రి దేవినేని ఉమా మరికొన్ని అబద్దాలు చెప్పేశారని వైఎస్సార్ సీపీ నేతలు అంటున్నారు.
పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టును తమ పార్టీ ఎంపీకి కట్టబెట్టేందుకు ప్రత్యేకహోదాను తాకట్టుపెట్టిన చరిత్ర చంద్రబాబు ప్రభుత్వానిది. పోలవరంను ఒక ఆదాయవనరుగా భావించడం వల్లనే కేంద్రం నిర్మించాల్సిన ఈ జాతీయ ప్రాజెక్టు మేమే నిర్మిస్తామంటూ చంద్రబాబు ముందుకువచ్చారు.ప్రాజెక్టు నిర్మాణంపై కన్నా తన సొంత లాభంపైనే ధ్యాసపెట్టిన ఆయన పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగం చేశారు. అందుకే ప్రధాని మోడీ పోలవరంను చంద్రబాబు ఏటీఎంగా మార్చుకున్నారని విమర్శించారని అధికార పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. వ్యక్తిగత స్వార్థంకోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడం చంద్రబాబు నైజం. రాష్ట్ర అభివృద్ధి కోసం వ్యక్తిగత జీవితాన్ని కూడా త్యాగం చేయడం సీఎం జగన్మోహన్ రెడ్డి తత్వం అని వైఎస్సార్ సీపీ నేతలు అంటున్నారు.
నిర్వాసితులకు ద్రోహంచేసే హక్కు సీఎం జగన్‌కు ఎవరిచ్చారని ప్రశ్నిస్తున్న ఉమా తాను మంత్రిగా ఉండగా నిర్వాసితుల గురించి ఎందుకు పట్టించుకోలేదు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన ఏడాదిన్నరకే 4,182 నిర్వాసిత కుటుంబాలను కాలనీలకు తరలించారు. కాలనీల నిర్మాణానికి రూ.620.53 కోట్లు వెచ్చించారు. నష్టపరిహారం కింద వ్యక్తిగత ప్యాకేజీగా కేంద్రప్రభుత్వం ఇచ్చే రూ.6.80 లక్షలకు రాష్ట్రప్రభుత్వం మరో రూ.3.20 లక్షలు కలిపి రూ.10లక్షలు ఇచ్చేలా చర్యలు తీసుకొంది. ఈ పనులన్నీ చిత్తశుద్ధితో చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి క్రెడిట్ రాకుండా ఉండేందుకు టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు.
కేసుల నుంచి తప్పించుకోవడం చంద్రబాబుకు అలవాటు..
కేసుల నుంచి తప్పించుకునేందుకే జగన్ రాజీపడ్డారు అంటున్న ఉమా అటువంటి అలవాటు చంద్రబాబుకే ఉందన్న సంగతి గుర్తు చేసుకోవాలని వైఎస్సార్ సిపి నేతలు అంటున్నారు. అప్పట్లో చీకట్లో కేంద్ర మంత్రి చిదంబరంతో చేసుకున్న ఒప్పందం కానీ,ఇటీవల నలుగురు టీడీపీరాజ్యసభ సభ్యులను బీజేపీలో విలీనం చేయడం కానీ చంద్రబాబు తనపై ఉన్న అవినీతి కేసుల నుంచి తప్పించుకోవడం కోసం కాదా? ఆదే జగన్మోహన్ రెడ్డి… తనపై కాంగ్రెసు, టీడీపీ కుమ్మక్కు అయి పెట్టిన తప్పుడు కేసులను న్యాయ స్థానాల్లో ధైర్యంగా ఎదుర్కొన్నారని వైఎస్సార్ సీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.