రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. కానీ ఆ విమర్శలు హద్దులు దాటినప్పుడే తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటూ ఉంటాయి. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసే సంఘటనలు జరుగుతున్నాయి. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాలంటీర్ల మీద చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారన్ని లేపుతున్నాయి. ఏపీలోని వాలంటీర్లు వుమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపై ప్రముఖ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి స్పందించారు. పవన్ ఇంత నీచంగా మాట్లాడితే ఊరుకోవాలా? అంటూ సీరియస్ అయ్యారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాలంటీర్ల మీద చేసిన కామెంట్స్ వివాదానికి దారితీశాయి. దాంతో వైసీపీ నాయకులతో పాటుగా.. పొలిటికల్ అనలిస్టులు కూడా తప్పుపడుతున్నారు. ఈ క్రమంలోనే పవన్ కామెంట్స్ పై స్పందించారు ప్రముఖ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. ప్రముఖ యూట్యూబ్ ఛానల్ ఐడ్రీమ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ పై మండిపడ్డారు తమ్మారెడ్డి. ఆయన మాట్లాడుతూ..”వుమెన్ ట్రాఫికింగ్ అంటే చిన్న విషయం కాదు. దీనిపై జనసేనతో పాటుగా టీడీపీ, వైసీపీ కూడా స్పందించాలి. ఇక పవన్ కళ్యాణ్ వుమెన్ ట్రాఫికింగ్ జరిగిందని చెబుతున్నారు. కానీ ఎక్కడ జరిగింది? ఎవరు చేశారు? అన్న విషయాలు వెల్లడించలేదు. పైగా కేవలం రూ. 5 వేల జీతానికి పనిచేసే వాలంటీర్లను ఇంత నీచంగా మాట్లాడితే ఊరుకోవాలా? మరి ఇంత పెద్ద సమస్య ఉన్నప్పుడు సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థలు ఎందుకు రావడం లేదు?” ప్రశ్నించారు తమ్మారెడ్డి.
ఇక వుమెన్ ట్రాఫికింగ్ నిజంగా జరుగుతుంటే అటు కేంద్ర ప్రభుత్వం గానీ, ఇటు జనసేన గానీ, టీడీపీ, వైసీపీ గానీ ఎందుకు ఆపటంలేదని మండిపడ్డారు. ఆడపిల్లల భవిష్యత్ కాపాడ్డానికి అందరికి బాధ్యత ఉండాలన్నారు. ఎంతసేపు ఇంట్లో ఆడాళ్ల గురించి మాట్లాడ్డం కాదు.. ఆడపిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలని తమ్మారెడ్డి భరద్వాజ చెప్పుకొచ్చారు. కాగా.. పవన్ వాలంటీర్ల మీద చేసిన వ్యాఖ్యలపై వెంటనే క్షమాపణ చెప్పాలని వాలంటీర్లు డిమాండ్ చేస్తున్నారు. పవన్ సే సారీ వాలంటీర్స్ అన్న హ్యాష్ టాగ్ ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.