iDreamPost
android-app
ios-app

సనాతన ధర్మంపై వెనక్కి తగ్గిన స్టాలిన్! కొడుకుకి వార్నింగ్!

సనాతన ధర్మంపై వెనక్కి తగ్గిన స్టాలిన్! కొడుకుకి వార్నింగ్!

సనాతన ధర్మం డెంగ్యూ, మలేరియా, కరోనా వంటిదని, దాన్ని సమూలంగా సమాధి చేయాలంటూ తమిళనాడు ముఖ్యమంత్రి తనయుడు, ఆ రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి కమ్ నటుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేగిన సంగతి విదితమే. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు, హిందు ఆధ్యాత్మిక, ధార్మిక సంఘాలు మండిపడ్డాయి. అతడి తల నరికి తీసుకు వస్తే రూ. 20 కోట్లు ఇస్తానంటూ రివార్డు ప్రకటించారు అయోధ్య స్వామిజీ. దీనికి కౌంటర్ ఇచ్చారు ఉదయనిధి. ఈ వ్యాఖ్యలు చిలికి చిలికి గాలి వానగా మారాయి. ఈ వ్యాఖ్యలపై కొందరు ఉదయనిధికి మద్దతుగా నిలిస్తే.. మరికొందరు విరుచుకుపడ్డారు. కాగా, తన కుమారుడు వ్యాఖ్యలు సరైనవేనని, కొంత మంది వక్రీకరించారంటూ ఉదయనిధికి వంతపాడారు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్. అయితే ఈ వివాదం ఇంకా సద్దుమణగకపోవడంపై ఇప్పుడు పార్టీ శ్రేణులను అలర్ట్ చేశారు.

సనాతన ధర్మం అంశంపై పోరాడాలంటూ ప్రధాని మోడీ కేంద్ర మంత్రులకు సూచనలు చేశారన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో డీఎంకే చీఫ్, సీఎం స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశంపైన ఇక ఎటువంటి వ్యాఖ్యలు చేయరాదని పార్టీ నేతలకు సూచించారు. అటు కుమారుడికి కూడా హెచ్చరికలు జారీ చేశారు. బీజెపీ అవినీతి, కేంద్ర ప్రభుత్వ పథకాల అమల్లో లోపాలపై మాత్రమే గళం విప్పాలని తెలిపారు. దేశంలోని సమస్యలను, తమ లోపాలను కప్పిపుచ్చేందుకు ప్రజల దృష్టిని మళ్లించేందుకే సనాతన ధర్మంపై దృష్టి సారించేలా మోడీ.. ఆ పార్టీ మంత్రులకు సూచనలు చేశారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని గమనించి.. సనాతన ధర్మం అంశంపై చర్చలు పెట్టవద్దని పార్టీ కేడర్స్‌కు సూచనలు చేశారు.

మణిపూర్, అదానీ, కాగ్ నివేదికలపై ప్రశ్నలు సంధించకుండా ఉండేందుకు ఇటువంటి ఎత్తుగడలను బీజెపీ ప్రదర్శిస్తుందని పేర్కొన్నారు. సామాన్యులను ప్రభావితం చేసే రోజువారీ సమస్యలపై మోడీ మౌనం వహిస్తూ.. ఆయన మంత్రి వర్గం మాత్రం కొన్ని మీడియా కథనాలతో తప్పుడు వార్తలను సృష్టిస్తూ.. సనాతన ధర్మంపై దృష్టి పెడుతుందని అన్నారు. ఇటువంటి మళ్లింపు వ్యూహాలకు స్పందించవద్దని కోరారు. దేశంలోని సమస్యలపై మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని తెలిపారు. ఈ విషయంపై ఇక ప్రతిస్పందించవద్దని కుమారుడికి ఉదయనిధికి కూడా వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. వచ్చే ఏడాది ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో మతపరమైన వ్యాఖ్యలు.. పార్టీకి నష్టం చేకూరే అవకాశాలున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని ఉదయనిధికి సూచించినట్లు తెలుస్తోంది.