మధ్యప్రదేశ్ సీఎం చౌహాన్ రికార్డ్

మధ్యప్రదేశ్ సీఎం చౌహాన్ రికార్డ్

ఒక రాష్ట్రానికి అధినేత అయిన ముఖ్యమంత్రి పదవిలో పూర్తి కాలం అంటే ఐదేళ్లు కొనసాగడమే ఈ కాలంలో కత్తి మీద సాములాంటిది. ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో వాటి అధినేతలే సీఎంలుగా ఉంటారు కనుక వారికి ఎదురుండదు. ఎక్కువకాలం ఆ పదవిలో ఉండటం పెద్ద విషయం కూడా కాకపోవచ్చు. కానీ జాతీయ పార్టీల విషయంలో అది అంత సులభం కాదు. ఒకే నేత ఒక టర్మ్ మొత్తం ఆ పదవిలో కొనసాగడమే కష్టం. పార్టీ అధిష్టానానికి ఇష్టం లేకపోయినా, ఎమ్మెల్యేల్లో అసంతృప్తి రేగినా లేదా ఇతరత్రా కారణాలతోనైనా అతన్ని మార్చేసే అవకాశం ఉంటుంది. గతంలో దేశంలో కాంగ్రెస్ హవా ఉన్నప్పుడు రాష్ట్రాల్లో సీఎంలను తరచూ మార్చేసేవారు. బీజేపీ ఆధిపత్యం మొదలైన తర్వాత కూడా కొన్ని రాష్ట్రాల్లో ఆ సంస్కృతి కొనసాగింది. ఉత్తరాఖండ్ లో 2017లో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఐదేళ్లలో ముగ్గురు సీఎంలను మార్చేసింది. కానీ దీనికి భిన్నంగా ఆ పార్టీ తరపున సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రి పదవిలో ఉన్న నేతగా మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కొత్త రికార్డ్ సృష్టించారు. అంతకు ముందు బీజేపీకే చెందిన రమణ సింగ్ చత్తీస్గఢ్ సీఎంగా 15 ఏళ్లకు పైగా పనిచేసిన మొదటి బీజేపీ నేతగా పేరుపొందారు. ఆయన 15 ఏళ్ల 10 రోజులు సీఎం పదవి నిర్వహించారు. ఎంపీ సీఎం శివరాజ్ సింగ్ అతన్ని అధిగమించి నేటికీ 15 ఏళ్ల 12 రోజుల పాలన పూర్తి చేసుకున్నారు.

నాలుగు సార్లు సీఎం పదవిలో..

మధ్యప్రదేశ్ లోని బుడ్ని నియోజకవర్గానికి చెందిన చౌహాన్ 2005 నుంచి 2018 వరకు వరుసగా మూడుసార్లు.. మళ్లీ 2020 నుంచి ఇప్పటివరకు ఆ పదవిలో కొనసాగుతున్నారు. 1972లో ఆర్ఎస్ఎస్ లో చేరిన ఆయన అక్కడి నుంచి బీజేపీలోకి వచ్చారు. 1990లో మొదటిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత విదిశ స్థానం నుంచి వరుసగా ఐదుసార్లు లోకసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2003 అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్ లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. అయితే 2005లో అప్పటి సీఎం బాబులాల్ గౌర్ స్థానంలో సీఎంగా శివరాజ్ ను బీజేపీ అధిష్టానం ఎంపిక చేసింది. ఆ ఏడాది నవంబర్ 29న సీఎం పదవి చేపట్టిన ఆయన 2018 డిసెంబర్ 12 వరకు ఆ పదవిలో కొనసాగారు. ఆ మధ్యకాలంలో జరిగిన అన్ని ఎన్నికల్లోనూ పార్టీని విజయపథంలో నడిపించారు. అయితే 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ స్వల్ప సీట్ల ఆధిక్యంతో కమలనాథ్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ పార్టీకి చెందిన జ్యోతిరాదిత్య సింధియా వర్గానికి చెందిన 25 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో కాంగ్రెస్ మెజారిటీ కోల్పోయి బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. 2020 మార్చి 23న శివరాజ్ సింగ్ మళ్లీ సీఎం పదవి చేపట్టి ప్రస్తుతం కొనసాగుతున్నారు. మధ్యప్రదేశ్ లో అత్యధిక కాలం సీఎంగా ఉన్న ఘనతను కూడా ఆయన సొంతం చేసుకున్నారు.

2 దశాబ్దాల సీఎంలు నలుగురు

శివరాజ్ సింగ్, రమణ సింగ్ చెరో 15 ఏళ్లు సీఎంలుగా ఉండి బీజేపీలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా దేశంలో అత్యధిక కాలం సీఎంగా వ్యవహరించిన రికార్డ్ సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ కు దక్కుతుంది. రెండు దశాబ్దాలకు పైగా సీఎం పదవిలో ఉన్న ఘనతను నలుగురు నేతలు పొందారు. వారిలో పవన్ కుమార్ చామ్లింగ్ 24 ఏళ్లు సీఎంగా చేసి మొదటి స్థానంలో ఉన్నారు. పశ్చిమ బెంగాల్ సీఎంగా 23 ఏళ్లు పనిచేసిన దివంగత సీపీఎం నేత జ్యోతిబసు రెండో స్థానంలో ఉన్నారు. అరుణాచల్ ప్రదేశ్ మాజీ సీఎం గీగాంగ్ అపాంగ్ 22 ఏళ్ల సర్వీసుతో మూడో స్థానంలో ఉండగా.. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ 2000 సంవత్సరం నుంచి 22 ఏళ్లుగా ఏకధాటిగా సీఎం పదవి నిర్వహిస్తుండటం విశేషం.

Show comments