iDreamPost
iDreamPost
ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబుపై కోపం ఉంటే ఆయనపై చూపించుకోవాలని, అమరావతి పట్ల కక్ష పూరితంగా వ్యవహరించడం సరికాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ చేసిన వ్యాఖ్యలను అధికార పార్టీ నాయకులు తప్పు పడుతున్నారు. శుక్రవారం రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ అమరావతి రాజధానిగా ఉండాలనేది ప్రజల ఆకాంక్ష అని, అభివృద్ధి పేరుతో జగన్ ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు.
భూ కుంభకోణంపైనే అభ్యంతరం..
సీఎం జగన్‌కు చంద్రబాబుపై వ్యక్తిగతంగా ఎలాంటి కోపంలేదని, కేవలం ఆయన విధానాలతోనే విభేదిస్తారని వైఎస్సార్ సీపీ నాయకులు అంటున్నారు. రాజధాని పేరిట అమరావతిలో భారీ భూ కుంభకోణానికి తెరతీసిన చంద్రబాబు తీరునే ఇప్పటికీ తమపార్టీ,ప్రభుత్వం వ్యతిరేకిస్తోందని చెబుతున్నారు. అభివృద్ధి కేంద్రీకరణ ఎంత నష్టం చేస్తుందీ అన్నది రాష్ట్రవిభజనలో హైదరాబాద్‌ను కోల్పోయిన తరువాత అందరికీ తెలిసివచ్చింది. చంద్రబాబు అమరావతి రాజధాని పేరిట మళ్లీ అదేతప్పును చేయడాన్ని సీఎం జగన్ వ్యతిరేకిస్తున్నారు. అందుకే మూడు రాజధానుల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో కూడా రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు మూడు రాజధానులకే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కట్టుబడి ఉంది. దీనికి తీసుకోవాల్సిన చర్యలు, చేయాల్సిన న్యాయపోరాటంపై నిపుణులతో చర్చిస్తోందని ఆ పార్టీ నేతలు అంటున్నారు.
ఆ 29 గ్రామాల్లోనే బడుగు, బలహీల వర్గాల వారు కనిపిస్తున్నారా?
రాజధాని గ్రామాల్లో బడుగు, బలహీన వర్గాలు లేవా? అని ప్రశ్నిస్తున్న రామకృష్ణకు ఆ 29 గ్రామాల్లోని ప్రజల్లోనే బడుగు, బలహీల వర్గాల వారు కనిపిస్తున్నారా? రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో ముఖ్యంగా వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో కనిపించడం లేదా? ఆ ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని వైఎస్సార్ సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. టీడీపీ ప్రముఖులు, ఆ పార్టీ సానుభూతిపరులు బినామీగా పెద్ద ఎత్తున అమరావతి చుట్టుపక్కల భూములుకొని వాటి సంరక్షణకు ఇన్నాళ్లూ కృత్రిమ ఉద్యమం నడిపిస్తే అది రామకృష్ణకు న్యాయపోరాటంలా కనిపించడం విడ్డూరంగా ఉంది.
అమరావతిలో శాసన రాజధాని కొనసాగిస్తామని ప్రభుత్వం చెబుతున్నా, మొత్తం మూడు రాజధానులు అక్కడే ఉండాలని పట్టుబట్టడంలో రియల్ ఎస్టేట్ ప్రయోజనాలు ముడిపడి లేవని రామకృష్ణ చెప్పగలరా? హైకోర్టు తీర్పు వెలువడినది మొదలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి ఎలాగైనా రాజధానిని అమరావతిలో ఉంచాలని తాపత్రయ పడుతున్న టీడీపీ అండ్ కోకు అనుకూలంగా రామకృష్ణ ఎందుకు పదే పదే స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు? ఆయన స్పందించడానికి రాష్ట్రంలో అమరావతి తప్ప మరే సమస్యా కనిపించడం లేదా? రామకృష్ణకు చంద్రబాబుపై ప్రేమ ఉంటే వేరేలా చూపించుకోవాలి. అంతేగాని రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను, అభివృద్ధిని పణంగా పెట్టి అమరావతి రాజధానిగా ఉండాలని కోరడం తగదని వైఎస్సార్ సీపీ నేతలు అంటున్నారు.