iDreamPost
android-app
ios-app

కష్టకాలంలో అండ.. రుణం తీర్చుకుంటోన్న అశోక్‌

కష్టకాలంలో అండ.. రుణం తీర్చుకుంటోన్న అశోక్‌

2014లో కేంద్రంలో అధికారం కోల్పోయినప్పటి నుంచి కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. ఒక్కొక్క రాష్ట్రం హస్తం పార్టీ నుంచి చేజారిపోతున్నాయి. తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మరో రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారం కోల్పోయింది. పంజాబ్‌లో కాంగ్రెస్‌ స్థానాన్ని ఆప్‌ ఆక్రమించింది. ఇక మిగిలింది రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలు మాత్రమే. గోవా, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలలో అధికారంలోకి వస్తుందని పార్టీ నేతలు అందరు పెట్టుకున్న నమ్మకం వమ్ము అయింది. ఓ పక్క రాష్ట్రాలు చేజారిపోతుండడం, మరో వైపు ఇతర రాష్ట్రాలలో అధికారంలోకి వచ్చే పరిస్థితులను అనుకూలంగా మలుచుకోలేక పోతుండడంతో కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానంపై తీవ్ర ఒత్తిడి నెలకొంది.

తాజా పరిణామాల నేపథ్యంలో గాంధీ కుటుంబం లక్ష్యంగా పార్టీలో అసమ్మతి మరోసారి రేగే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమయంలో గాంధీ కుటుంబానికి సీనియర్‌ నేత, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్‌ అండగా నిలబడ్డారు. కాంగ్రెస్‌ పార్టీకి గాంధీ కుటుంబ అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. కాంగ్రెస్‌ ఐక్యతకు గాంధీ కుటుంబం ముఖ్యమనే అంశాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని పార్టీ నేతలకు సూచించారు. అదే సమయంలో గాంధీ కుటుంబం చేసిన త్యాగాలను గుర్తు చేసిన అశోక్‌.. పార్టీ నేతల్లో సోనియా, రాహుల్‌ గాంధీల పట్ల ఉన్న వ్యతిరేకతను తగ్గించేందుకు యత్నించారు. మూడు దశాబ్ధాలుగా గాంధీ కుటుంబం నుంచి ఏ ఒక్కరూ ప్రధాని గానీ, మంత్రిగానీ కాలేదని అశోక్‌ గుర్తు చేయడం ప్రస్తుత సమయంలో ఉపయుక్తం.

గత ఏడాది మధ్యలో రాజస్థాన్‌ కాంగ్రెస్‌ పార్టీలో సంక్షోభం తలెత్తింది. కాంగ్రెస్‌ పార్టీ యువ నేత సచిన్‌ పైలెట్, ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాత్‌ మధ్య విభేదాలు తలెత్తాయి. సచిన్‌ తన వర్గం ఎమ్మెల్యేలతో వేరు కుంపటి పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి మార్పిడిపై జోరుగా ఊహాగానాలు రేగాయి. అశోక్‌ గెహ్లాత్‌ విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్నారు. ఇలాంటి కష్టకాలంలో అశోక్‌కు మద్ధతుగా గాంధీ కుటుంబం నిలబడింది. దీంతో సంక్షోభాన్ని అశోక్‌ అధిగమించారు. ఆ తర్వాత సచిన్‌ పైలెట్‌ కూడా సర్దుకున్నారు. కష్టకాలంలో ఉన్నప్పుడు తనకు అండగా నిలబడిన గాంధీ కుటుంబానికి ఇప్పుడు అశోక్‌ గెహ్లాత్‌ బాసటగా నిలుస్తున్నారు.

పంజాబ్‌ ఎన్నికల్లో ఓటమికి స్థానిక పరిస్థితులే కారణమంటూ గాంధీ కుటుంబాన్ని అశోక్‌ వెనకేసుకొస్తున్నారు. అనైక్యతే కాంగ్రెస్‌ పార్టీ ఓటమికి కారణమని అశోక్‌ తేల్చి చెప్పారు. 2017లో పంజాబ్‌లో కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఐక్యం ఉండడంతోనే అధికారం దక్కిందన్న అశోక్‌.. తాజా ఎన్నికల్లో ఆ ఐక్యత లోపించడంతోనే ఓడిపోయామని వివరిస్తున్నారు. అమరిందర్‌ సింగ్‌ తర్వాత… చన్నీ ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిస్థితులు అనుకూలించాయని చెప్పుకొచ్చారు. అయితే ఆ తర్వాత చెలరేగిన అంతర్గత కలహాలు పార్టీని దెబ్బతీశాయంటూ పరోక్షంగా సిద్ధూ వ్యవహారాన్ని గుర్తు చేస్తున్నారు. మొత్తం మీద పంజాబ్‌ ఓటమికి గాంధీ కుటుంబం కారణం కాదని చెబుతోన్న అశోక్‌ గెహ్లోత్‌.. పార్టీ అధ్యక్షుడుగా రాహుల్‌ గాంధీనే ఉండాలని డిమాండ్‌ చేస్తూ తన విశ్వాసాన్ని చాటుకుంటున్నారు.