iDreamPost
android-app
ios-app

ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు భారీ షాక్‌.. కేసీఆర్‌ను కలిసిన పొన్నాల దంపతులు

  • Published Oct 16, 2023 | 7:57 AM Updated Updated Oct 16, 2023 | 8:07 AM
  • Published Oct 16, 2023 | 7:57 AMUpdated Oct 16, 2023 | 8:07 AM
ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు భారీ షాక్‌.. కేసీఆర్‌ను కలిసిన పొన్నాల దంపతులు

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగడంతో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల సమరానికి రెడీ అవుతున్నాయి. గెలుపే లక్ష్యంగా ఓటర్లను ఆకట్టుకోవడం కోసం వ్యూహాలు రెడీ చేసుకుంటున్నాయి. దీనిలో భాగంగా అభ్యర్థులను ప్రకటించేందుకు పార్టీలన్ని రెడీ అవుతున్నాయి. జనాలను ఆకట్టుకోవడం కోసం మేనిఫేస్టోలో సరికొత్త హామీలను తెర మీదకు తెస్తున్నారు. అయితే తెలంగాణ ఎన్నికల సమరంలో అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ ఓ అడుగు ముందే ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన, మేనిఫేస్టో విడుదలతో దూకుడు మీద ఉండగా.. తాజాగా ఎన్నిక ప్రచార పర్వానికి కూడా శ్రీకారం చుట్టుంది. ఇక ఎన్నికలు తరుముకొస్తున్న వేళ.. హస్తం పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. తాజాగా కాంగ్రెస్‌ పార్టీ మాజీ సీనియర్‌ నేత పొన్నాల కేసీఆర్‌తో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.

మాజీ మంత్రి, తెలంగాణ సీనియర్ రాజకీయ నేత పొన్నాల లక్ష్మయ్య దంపతులు సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఆదివారం నాడు ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ను కలిశారు. పొన్నాల దంపతులను సాదరంగా ఆహ్వానించిన సీఎం కేసీఆర్ వారితో కాసేపు ముచ్చటించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే పొన్నాల బీఆర్‌ఎస్‌లో చేరనున్నారని సమాచారం. కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌ నేతగా ఉన్న పొన్నాల కొన్ని రోజుల క్రితం హస్తం పార్టీకి రాజీనామా చేశారు. అయితే హైకమాండ్‌ పెద్దలు ఆయనను బుజ్జగించి.. తిరిగి పార్టీలో చేరేలా ప్రయత్నిస్తారని అంతా భావించారు. కానీ అందుకు భిన్నంగా పొన్నాల కేసీఆర్‌తో భేటీ అవ్వడం సంచలనంగా మారింది.

ఇక పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేయగానే.. ఆయనను బీఆర్‌ఎస్‌లో చేరాలంటూ.. కేటీఆర్ ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో ఆదివారం నాడు పొన్నాల దంపతులు.. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసి ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై మాట్లాడారు. అంతేకాక త్వరలోనే జనగామలో నిర్వహించనున్న ప్రచార సభలో పొన్నాల బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ముందు.. పొన్నాల కాంగ్రెస్‌ పార్టీకి భారీ షాకే ఇచ్చారని చెప్పవచ్చు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.