చంద్రబాబుకి IT నోటీసులపై పవన్ మౌనం! ఇదేనా ప్రశ్నించడమంటే?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటారు. అధికారం కోసం కాదు.. ప్రశ్నించడం కోసం పార్టీ పెట్టాను అంటారు. అధికార పార్టీలో చీమ చిటుక్కుమన్నా పవన్ కల్యాణ్ ప్రశ్నల వర్షం కురిపిస్తారు. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది? రాష్ట్రం ఏమైపోతోంది? ఇదేనా పాలనా? ఇదేనా సంక్షేమం? అంటూ పంచు డైలాగులు, భారీ భారీ స్పీచులతో విరుచుకు పడతారు. అయితే ప్రశ్నించడానికి పార్టీ పెట్టాను అంటున్న పవన్ కల్యాణ్ కు గత కొన్ని రోజులుగా నెట్టింట, రాష్ట్రంలో ప్రజల నుంచి కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి.

గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ నోటీసులు అనే అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. ఆయన అధికారంలో ఉన్నప్పుడు దాదాపు రూ.118 కోట్లకు అవినీతి జరిగింది అంటూ నోటీసులు జారీ చేశారు. వాటికి చంద్రబాబు నాయుడు పొంతనలేని సమాధానాలు చెబుతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. నేషనల్ మీడియాలో కూడా ఈ అంశంపై చర్చ జరుగుతోంది. ఇంక నోటీసుల వార్తలపై అధికార పక్ష నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందించడం చూస్తూనే ఉన్నాం. ఈ అవినీతిపై చంద్రబాబు సమాధానం చెప్పాలి అంటూ అధికారపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రజలు కూడా చంద్రబాబు సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పవన్ కల్యాణ్ కు సంబంధించి కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ అంటే ఒంటికాలుపై వచ్చే పవన్ ఎందుకు ఈ అంశంపై స్పందించడం లేదని నిలదీస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన ఏ పనైనా, పథకం అయినా, ప్రాజెక్టు గురించి అయినా పవన్ కల్యాణ్ ప్రశ్నల వర్షం కురిపిస్తారు. అది పైలట్ ప్రాజెక్టులో ఉన్నా దానిపై కూడా విమర్శలు గుప్పిస్తారు. మరి.. ఈ ఐటీ నోటీసులపై ఎందుకు సమాధానం చెప్పడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఎక్కడో ఒకరో, ఇద్దరో వాలంటీర్లు చేసిన తప్పులను ఎత్తి చూపుతూ.. అసలు మొత్తం వాలంటీర్ వ్యవస్థే తప్పు అని వ్యాఖ్యానించారు కదా. అలాంటి పవన్ కల్యాణ్.. ఎందుకు చంద్రబాబు అవినీతి ఆరోపణలపై స్పందించడం లేదని అడుగుతున్నారు. ఆరోపణలు చేసింది ఆదాయపు పన్ను శాఖ. వాళ్లు నోటీసులు కూడా ఇచ్చారు.

 పవన్ కల్యాణ్ ఎందుకు చంద్రబాబుకు వచ్చిన ఐటీ నోటీసులపై తన గళాన్ని వినిపించడం లేదని నిలదీస్తున్నారు. అంటే చంద్రబాబు అవినీతిని సమర్థిస్తున్నారా? అని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రం సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కాంక్షిస్తున్నాం అంటూ చెప్పే మాటలు అవాస్తవమేనా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే రాష్ట్రం మీద శ్రద్ధ ఉంటే రూ.118 కోట్ల అవినీతి నోటీసులపై చంద్రబాబును నిలదీయాలంటూ సూచిస్తున్నారు. ఆయన అవినీతి చేయకపోతే.. అవన్నీ నిరాధార ఆరోపణలు అయితే ఎందుకు నోరు మెదపడం లేదని అడుగుతున్నారు. అవన్నీ తప్పుడు ఆరోపణలు అని ఒక చిన్న స్టేట్మెంట్ ఇస్తే సరిపోతుంది కదా అని అభిప్రాయపడుతున్నారు. పవన్ కల్యాణ్ అయినా చంద్రబాబు నుంచి సమాధానం రాబట్టాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు.

Show comments