Dharani
Dharani
వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. పార్టీలన్ని ఎన్నికల్లో గెలుపు కోసం కృషి చేస్తున్నాయి. అధికార వైసీపీ పార్టీ సంక్షేమం, అభివృద్ధిని నమ్ముకోగా.. విపక్షాలు మాత్రం.. రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చైనా సరే అధికారం చేజిక్కించుకోవాలని చూస్తున్నాయి. తాజాగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు చూస్తే.. ఏపీలో రానున్న అసెంబ్లీ ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయో అర్థం అవుతుంది. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలంటే.. ఏపీ కోసం చనిపోయే వ్యక్తులు కావాలి.. డబ్బులు ఖర్చు చేయాలి.. గొడవలకు సిద్ధంగా ఉండాలి అంటూ పిలుపునిచ్చారు. శుక్రవారం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నేతల సమావేశంలో మాట్లాడారు. అంతేకాక ఎన్నికల సమయం దగ్గర పడుతుందని.. రాష్ట్రంలో ముందుగానే ఎన్నికలు జరుగుతాయనే సంకేతాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు పవన్.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘‘ఎట్టి పరిస్థితుల్లోనూ రానున్న ఎన్నికల్లో ఇప్పుడున్న పాలన పోవాలి. ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపాలంటే.. ఏపీ కోసం చచ్చిపోయే వ్యక్తులు కావలి. అంటే త్యాగాలు చేయాలన్నది నా ఉద్దేశం. రాష్ట్రంలో ఈ సారి జరిగే ఎన్నికల్లో చాలా గొడవలు ఉంటాయి. మనకు అధికారం కావాలని అడిగితే ఎవడు ఇవ్వడు.. లాక్కోవాలి. కనీసం పది వేల ఓట్లు కూడా తెచ్చుకోలేని వాళ్లు కూడా పార్టీలో నాయకులం అయిపోదామని ఆశ పడుతున్నారు. పార్టీ తరఫున పోటీ చేయాలనుకునే వారు.. కనీసం 10 వేల ఓట్లు అయినా తెచ్చుకునే సామర్థ్యం కలిగి ఉండాలి. సర్వేలు చేయిస్తాను.. దాని ప్రకారమే సీట్లు ఇస్తా’’ అని స్పష్టం చేశారు.
‘‘రూపాయి ఖర్చు చేయకుండా నాయకులు కాలేరు.. ఖర్చు పెట్టాల్సిందే. నేను ఈ పార్టీ ఆఫీసు నిర్మాణం కోసం నా పిల్లల ఎఫ్‌డీ రద్దు చేశాను. అది నా బాధ్యత అనుకున్నారు. మీరు కూడా ఇలానే బాధ్యత తీసుకోవాలి. నేను నిరంతంర పార్టీ నేతలందరిని కలవలేను. ఓ ప్రసంగం కోసం 30-40 వరకు పుస్తకాలు తిరగేయాల్సి వస్తుంది. రూమ్‌లో ఖాళీగా కూర్చోలేను.. చాలా అధ్యయనం చేస్తుంటాను.. పాదయాత్ర చేయలేను. ఇక నుంచి మంగళగిరి పార్టీ ఆఫీసులోనే ఉంటాను. ఇదే నా స్థిర నివాసం’’ అని చెప్పుకొచ్చారు.