iDreamPost
android-app
ios-app

జమిలి ఎన్నికల కమిటీ ఛైర్మన్ గా రామ్ నాథ్ కోవింద్!

జమిలి ఎన్నికల కమిటీ ఛైర్మన్ గా రామ్ నాథ్ కోవింద్!

జమిలి ఎన్నికల అంశంపై కీలక అడుగు పడింది. 8 మంది సభ్యులతో ఒక కమిటీని శనివారం ఏర్పాటు చేశారు. మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఈ కమిటీకి ఛైర్మన్ గా వ్యవహరించనున్నారు. ఈ కమిటీని న్యాయ మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది ఈ కమిటీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సీనియర్ పొలిటీషియన్ గులాంనబీ ఆజాద్, లోక్ సభలో విపక్ష నేతగా ఉన్న అధిర్ రంజన్, హరీశ్ సాల్వే, 15వ ఆర్థిక సంఘం ఛైర్మన్ ఎన్ కే సింగ్, లోక్ సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ కశ్యప్, సంజయ్ కొఠారిలు సభ్యులుగా ఉన్నారు.

అన్ని రాష్ట్రాల్లో లోక్ సభ, శాసన సభ ఎన్నికలను ఒకేసారి జరిపించాలి అనేది ఈ జమిలి ఎన్నికల ఉద్దేశం. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్రం జమిలి ఎన్నికలు నిర్వహించాలని ఎప్పటి నుంచో భావిస్తోంది. అయితే ఈ నేపథ్యంలోనే అసలు ఇలా ఎన్నికలు నిర్వహించడం సాధ్యమేనా? ఆ ప్రక్రియలో ఉన్నా సాధ్యాసాధ్యాలు ఏంటి? అమలు చేయాలి అంటే తీసుకోవాల్సిన చర్యలు ఏంటి? వంటి విషయాలను అధ్యయనం చేసేందుకే ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ అన్ని రాజకీయ పార్టీలు, రాష్ట్రాలతో ఈ జమిలి ఎన్నికల అంశంపై కూలంకషంగా చర్చిస్తాయి. ఈ అంశంపై వారి అభిప్రాయాలను కూడా సేకరిస్తారు. సాధారణంగా వన్ నేషన్- వన్ ఎలక్షన్ విధానాన్ని అమలు చేసేందుకు చట్టాన్ని తీసుకురావలి అంటే శాసన పిరశీలన సంఘం ద్వారా సిఫార్సులు పొందాల్సి ఉంటుంది.

ఆ విధానానికి పూర్తి భిన్నంగా కేంద్రం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అంతేకాకుండా ఈ నెలలో జరగబోయే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఈ బిల్లు ప్రవేశ పెట్టేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే ఇప్పుడు జమిలి ఎన్నికల ఆచరణ దాదాపుగా అసాధ్యం అనే తెలుస్తోంది. ఎందుకంటే కొన్ని రాష్ట్రాల్లో కొన్ని నెలల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా.. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఎన్నికలు జరిగి కొన్ని నెలలో అవుతోంది. అంటే జమిలి ఎన్నికలకు వారు అంగీకరిస్తే దాదాపు నాలుగేళ్ల అధికారాన్ని కోల్పోవాల్సి వస్తుంది. అందుకు బీజేపీ పాలిత రాష్ట్రాలు అంగీకరించినా.. మిగిలిన రాష్ట్రాలు మాత్రం అంగీకరించేందుకు అవకాశం లేదు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు బాహాటంగానే తమ అసమ్మతిని తెలియజేశాయి.

అసలు ఏ రాష్ట్రాల్లో ఎన్నికలు ఎలా ఉన్నాయంటే.. ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒరిస్సా రాష్ట్రాల్లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ఒకేసారి జరగాల్సి ఉంది. ఈ డిసెంబర్ లో తెలంగాణ, మిజోరాం, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల శాసన సభ, లోక్ సభ ఎన్నికలు జరగాల్సి ఉంది. హర్యానా, జార్ఖండ్, ఢిల్లీ, మహారాష్ట్రలకు మాత్రం శాసనసభ ఎన్నికలు జరిగిన 7 నెలల్లోగా లోక్ సభ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ రాష్ట్రాల వరకు.. వాటిని సంప్రదించి జమిలికి ఒప్పించడం పెద్ద కష్టం కాకపోవచ్చు. కానీ, మిగిలిన 15 రాష్ట్రాల పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. కర్ణాటక, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఈ ఏడాదే ఎన్నికలు పూర్తయ్యాయి. 2022 సంవత్సరంలో ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, అస్సాంలో ఎన్నికలు జరిగాయి. ఈ రాష్ట్రాల్లో ఒకే పార్టీ అధికారంలో లేదు. కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ, కొన్నిచోట్ల కాంగ్రెస్, మరికొన్ని రాష్ట్రాల్లో కూటములు అధికారంలో ఉన్నాయి. మరి.. వాళ్లు ఇంత త్వరగా అధికారాన్ని వదులుకుని జమిలికి వెళ్తారా? అనేదే ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న. ఈ నేపథ్యంలోనే పాక్షిక జమిలి అనే ఇంకో పేరు కూడా వినిపిస్తోంది.