కొత్త మంత్రివర్గంలోనూ జగన్ అదే పంథాను అనుసరించబోతున్నారా..?

ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ అంటే సహజంగా ముఖ్యమంత్రి కులస్తులకు పెద్దపీట వేయడం సాధారణంగా జరుగుతుంది. చంద్రబాబు పాలనలో మంత్రులుగానే కాకుండా కీలకమైన స్పీకర్ పోస్టు కూడా కమ్మ కులస్తులకే కట్టబెట్టిన వైనం అందరికీ తెలిసిందే. కానీ జస్ట్ ఫర్ ఏ ఛేంజ్ జగన్ పాలన దానికి భిన్నం. రెడ్లకు తగిన ప్రాధాన్యతనిస్తూనే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ప్రాధాన్యతనివ్వడం చూస్తున్నాం. ఇప్పటికే నామినేటెడ్ పదవుల నుంచి మంత్రిమండలి ఎంపిక వరకూ అన్నింటా దీనిని చూడవచ్చు. మండలిలో చైర్మన్, డిప్యూటీ చైర్మన్ పోస్టులు రెండు ఒకటి ఎస్సీ, మరోటి మైనార్టీలతో నింపడం అందుకు తాజా ఉదాహరణ. అంతకుముందు అసెంబ్లీ స్పీకర్ గానూ బీసీ కులస్తుడికి అవకాశం ఇవ్వడం జగన్ పంథాను చాటుతోంది.

ప్రస్తుత తన మంత్రివర్గంలో ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు ఉండగా కేవలం ఒక్క కాపు మినహా మిగిలిన నలుగురు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నేతలే కావడం విశేషం.గతంలో ఎన్నడూ ఏపీలో ఎస్టీ, మైనార్టీ నాయకులు ఉప ముఖ్యమంత్రులుగా ఎదిగిన చరిత్ర లేదు. కానీ జగన్ మాత్రం వారికి కూడా అవకాశం కల్పించి చరిత్ర సృష్టించారు. ఇక ప్రస్తుతం మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ మీద దృష్టి పెట్టిన తరుణంలో ఆయా కులాల ప్రాధాన్యత మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. జగన్ తొలి క్యాబినెట్ లో నలుగురు రెడ్లు, నలుగురు కాపులు, ఒక వైశ్య, ఒక క్షత్రియుడున్నారు. మొత్తం పదిమందిగా ఉన్న ఈ సంఖ్యను కుదించే అవకాశం ఖాయంగా కనిపిస్తోంది. మిగిలిన 14 మంది మంత్రుల్లో బీసీలు, ఎస్సీలకు ఎక్కువగా ప్రాధాన్యత దక్కింది.

రాబోయే క్యాబినెట్ లో ఈ సంఖ్య పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. అందులో బీసీలు ప్రస్తుతం ఉన్న వారికి తోడుగా మరో ఒకరిద్దరికి అవకాశం దక్కబోతోంది. ఎస్సీల సంఖ్య, మహిళల సంఖ్య కూడా పెరిగేందుకు అవకాశాలున్నాయి. దాంతో ఈ వ్యవహారం ఆసక్తిగా మారుతోంది. ప్రస్తుతం తన క్యాబినెట్ లో దివంగత మేకపాటి గౌతమ్ రెడ్డి మరణం కారణంగా రెడ్లకు కేటాయించే బెర్తు ఒకటి ఖాళీ అయ్యింది. దాంతో ఆ సీటు ఇతర కులాలకు దక్కే అవకాశాలు ప్రబలంగా కనిపిస్తున్నాయి. రాజకీయంగా చంద్రబాబు బీసీల పక్షాన ఉంటానని చెప్పుకోవడం తప్ప బీసీలకు తగిన ప్రాధాన్యత కల్పించని తరుణంలో జగన్ మాత్రం ఆచరణలో బీసీ కులస్తులకు, ఎస్సీలకు కూడా పెద్దపీట వేసేందుకు పూనుకోవడం కీలక పరిణామం. అదే సమయంలో మైనార్టీలకు మండలిలో వరుసగా అవకాశాలిచ్చారు. ఎస్టీలకు కీలక పదవులు కట్టబెట్టారు. దాంతో ఆయా కులాల్లో జగన్ పట్ల ఉన్న ఆదరణ మరింత దృఢపరుచుకునే యత్నంలో ఉన్నట్టు స్పష్టమవుతోంది.

Show comments