iDreamPost
android-app
ios-app

ఏపీలో నెల రోజుల పాటు వైద్య శిబిరాలు.. ఉచితంగా మందులు

ఏపీలో నెల రోజుల పాటు వైద్య శిబిరాలు.. ఉచితంగా మందులు

ఆంధ్రప్రదేశ్‌లోని జగన్ సర్కార్ ప్రజా సంక్షేమ పథకాలతో దూసుకెళుతుంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చుతూ.. తమది ప్రజా ప్రభుత్వమని నిరూపించుకుంటుంది. నవరత్నాల పేరిట పలు పథకాలను దశల వారీగా అమలు చేస్తూ లబ్దిదారుల కుటుంబాలకు అండగా నిలుస్తోంది. పలు ఫించన్లతో పాటు అమ్మఒడి, చేయూత, ఆసరా, వైఎస్సార్ రైతు భరోసా, ఫీజు రీయింబర్స్ మెంట్, వాహన మిత్ర, జగనన్న చేదోడు పథకం, జగనన్న విద్యా దీవెన, వైఎస్సార్ కళ్యాణ కానుక వంటి పథకాలను అమలు చేస్తుంది ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం. అర్హులైన లబ్దిదారులను ఎంపిక చేసి.. నేరుగా వారి ఖాతాల్లోకే నగదును జమ చేస్తుంది. దీంతో ఆయన పరిపాలనపై పొగడ్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రంలోని ప్రజలకు వైద్య భరోసాను కల్పించేందుకు మరో అడుగు ముందుకు వేసింది.  ఆరోగ్య సురక్ష పథకం కింద 30 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీ ప్రకటన చేశారు. మండలానికి ఒక గ్రామం చొప్పున ఈ వైద్య శిబిరాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ వైద్య శిబిరంలో స్పెషలిస్టు డాక్టర్లు, ఇద్దరు పీహెచ్‌సీ వైద్యులు ఉండనున్నారు. రాష్ట్రంలోని పేదలందరికీ ఆరోగ్య భరోసా కల్పించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు రజనీ వెల్లడించారు. ఈ నెల 15 నుండి వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి ఆరోగ్యశ్రీ వివరాలు, అనుబంధ ఆసుపత్రుల జాబితాతో కూడిన కిట్ లు అందజేస్తారని తెలిపారు. అలాగే ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పిస్తారన్నారు. ఇంట్లో ఆరోగ్య సమస్యలుంటే గుర్తించి స్థానిక ఏఎన్ఎంలకు తెలియజేస్తారన్నారు. మరుసటి రోజు వారు ఇంటికి వెళ్లి అవసరమైన వైద్య పరీక్షలు చేస్తారని తెలిపారు.

శిబిరాల నిర్వహణ సమయానికి వారి హెల్త్ రిపోర్టు సిద్ధం చేస్తారని చెప్పారు. ఆరోగ్య సమస్యలున్న వారు వైద్య శిబిరాలకు హాజరయ్యేందుకు వీలుగా ఏఎన్ఎంలు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు టోకెన్ నంబర్లు ఇస్తారు. ఈ నెల 30 నుండి రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలను ఏర్పాటు చేయనుంది. నెల రోజుల పాటు ఈ శిబిరాల నిర్వహణ జరగనుంది. ఈ శిబిరాల్లో 342 మంది స్పెషలిస్ట్ డాక్టర్స్, ఇతర వైద్య సిబ్బంది ఉండనున్నారు. 162 రకాల మందులతో పాటు 18 రకాల శస్త్రచికిత్సల వస్తువులు, 14 రకాల ఎమర్జెన్సీ కిట్లు, ఇతర మెడికల్ కిట్స్ ఈ వైద్య శిబిరాల్లో అందుబాటులో ఉండనున్నాయి. ఆరోగ్య సమస్యలున్న వారిని వైద్యులు పరీక్షిస్తారు. అవసరమైన వారికి ఈసీజీ వంటి వైద్య పరీక్షలు కూడా చేసి.. ఉచితంగా మందులిస్తారు. ఎవరికైనా శస్త్ర చికిత్సలు అవసరమైతే.. వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకం కింద రిఫర్ చేస్తారు.