iDreamPost
android-app
ios-app

వాటి ప్రభావం లేనట్లేనా..?

వాటి ప్రభావం లేనట్లేనా..?

తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు బీజేపీ వ్యతిరేకులకు ఆశ్చర్యాన్ని కలిగించాయనడంలో సందేహం లేదు. పంజాబ్‌ మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాలలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. పంజాబ్‌లో ఆ పార్టీకి ఎలాంటి ఆశలు లేవు. అయితే ఉత్తరప్రదేశ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్‌లలో బీజేపీ మళ్లీ అధికారం నిలబెట్టుకోవడమే ప్రత్యర్థి పార్టీలకు నమ్మశక్యంగా లేదు.

2019 నుంచి కరోనా వల్ల దేశంలో పరిస్థితులు క్షీణించాయి. ప్రజలు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారికి ఊరటనిచ్చేలా కేంద్రంలోని మోడీ సర్కార్‌ నిర్ణయాలు తీసుకోలేదు. కేవలం బియ్యం ఇచ్చి చేతులు దులుపుకుంది. చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరిపై ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రభావం చూపే పెట్రోల్, డీజిల్‌ ధరలు వంద రూపాయల మార్క్‌ను దాటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ ఆయిల్‌ ధర తగ్గినా.. మనదేశంలో పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరగడంపై ప్రతిపక్ష పార్టీలు ఆందోళనలు చేపట్టాయి. ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాయి. ప్రజల్లోనూ చర్చ జరిగింది.

ఇక వంట గ్యాస్‌ ధర వేయి రూపాయలు దాటింది. సబ్సిడీ దాదాపు కనుమరుగైంది. పది లేదా 20 రూపాయలు తిరిగి లబ్ధిదారుల ఖాతాల్లో పడుతున్నాయి. సబ్సిడీ మినహాయించి గ్యాస్‌ సిలిండర్‌ విక్రయించే సమయంలో.. దాని ధర 500 రూపాయలు. ఇప్పుడు ధర రెట్టింపు అయింది. క్రమంగా సబ్సిడీని ఎత్తేశారు. దీని ప్రభావం ప్రజలు ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారు. ఇక వంట నూనెల ధరలు ఆకాశాన్ని అంటాయి. రెండేళ్లలో ధరలు రెట్టింపు అయ్యాయి. ఇప్పుడు ఉక్రెయిన్‌–రష్యా యుద్ధం వల్ల పెట్రోల్, డీజిల్, వంట నూనెల ధరలు పెరుగుతాయని చెబుతున్నారు.

75 ఏళ్ల స్వాతంత్ర దేశంలో.. స్థాపించిన ప్రభుత్వ కంపెనీలు, సంస్థలను మోడీ సర్కార్‌ విక్రయిస్తోంది. నష్టాలు వస్తున్నాంటూ ఆ పని పూనుకుంది. నష్టాలు వచ్చే సంస్థలతోపాటు లాభాల్లో ఉన్న వాటిని విక్రయిస్తోంది. ఇందులో విశాఖ ఉక్కు సహా బంగారు బాతు వంటి ఎల్‌ఐసీ కూడా ఉంది. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేయడంపై పార్లమెంట్‌లోనూ, బయటా చర్చ జరిగింది. ప్రజలు ఈ విషయంపై చర్చించుకున్నారు. సోషల్‌ మీడియాలో మోడీ సర్కార్‌పై సెటైర్లు పడ్డాయి.

నూతన వ్యవసాయ చట్టాలతో వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్‌ పరం చేసేందుకు బీజేపీ ప్లాన్‌ చేసిందనే కారణంతో.. రైతులు ఏడాదిగా పోరాటం చేశారు. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌ రాష్ట్రాల రైతులు ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాల రైతులు, ప్రజలు, బీజేపీయేతర పార్టీలు, ప్రభుత్వాలు రైతులకు మద్ధతుగా బంద్‌లు, నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. ఉత్తరప్రదేశ్‌లో నిరసనలో పాల్గొని తిరిగి వస్తున్న రైతులపై కేంద్ర మంత్రి కుమారుడు కారును పోనిచ్చి ఏడుగురు మృతికి కారణమయ్యారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా సాగిన ఆందోళనల్లో దాదాపు 700 మంది రైతులు మరణించారు. సాగు చట్టాలను రద్దు చేసినా.. కనీస మద్ధతు ధర, వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు ఏర్పాటు నిర్ణయం వెనక్కి, మరణించిన రైతు కుటుంబాలకు పరిహారం ఇస్తామనే హామీలను మోడీ సర్కార్‌ విస్మరించింది. సాగు చట్టాలను మళ్లీ తెస్తామని వ్యవసాయశాఖ మంత్రి చెప్పారు. రైతులను మోసంచేసిన బీజేపీని శిక్షించాలంటూ సంయుక్తు కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) నేతలు పిలుపునిచ్చారు.

అయితే ఇవేమీ బీజేపీ విజయాన్ని ఆపలేకపోయాయి. పెట్రోల్, డీజిల్‌, వంట గ్యాస్, వంట నూనెల ధరలు, ప్రభుత్వరంగ సంస్థల అమ్మకాలు.. ఏవీ కూడా బీజేపీపై ప్రభావం చూపకపోవడమే ప్రతిపక్ష పార్టీలతోపాటు బీజేపీ నేతలను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. నాలుగు రాష్ట్రాలలో బీజేపీ విజయం.. ధరల పెరుగుదల, మోడీ సర్కార్‌ నిర్ణయాలను సమర్థించినట్లైంది.