NTR district ఎన్టీఆర్ జిల్లా : క‌ళ‌ల తీరం.. సంతోషంతో ఉప్పొంగుతున్న వైనం..!

కృష్ణాతీరం పుల‌కించిపోయింది. స‌రికొత్త నామంతో ఆ ప్రాంతం సంతోషం వెలిబుచ్చుతోంది. న‌ట సామ్రాట్‌.. అతిర‌థ మ‌హా నాయ‌కుడు.. క‌ళాభిరాముడు.. అంద‌రి అభిమాన ఘ‌నుడు నంద‌మూరి తార‌క రామ‌రావు ఆయ‌నే ఎన్టీఆర్. ఆ పేరును త‌మ ప్రాంతానికి చేర్చ‌డంతో ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు. తెలుగుదేశాన్ని స్థాపించి.. రాజ‌కీయాల్లో కొత్త ఒర‌వ‌డిని సృష్టించి.. తెలుగు వారి గొప్ప‌త‌నాన్ని చాటిన ఆయ‌న‌కు ఆ పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు కూడా ఇంత ప్రాధాన్యం ఇవ్వ‌లేదు. వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి రాజ‌కీయాల‌కు అతీతంగా ఎన్టీఆర్ పేరుతో జిల్లాను ఏర్పాటుచేసి త‌న గొప్ప‌త‌నాన్ని చాటుకున్నార‌ని స్థానికులు ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తుతున్నారు.

ఎంద‌రో క‌ళాకారుల‌కు పుట్టినిల్లు, మ‌రెంద‌రో రాజులు నడయాడిన నేల.. ఎంతో చరిత్రను కళ్లముందుంచే కొండపల్లి కోట.. గడిచిన చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచిన కొండ గుహలు.. మూడు కాలాల్లోనూ పంట పొలాలకు నీరందిస్తూ.. పొడవునా పరుచుకున్న కృష్ణాతీరం.. ఇవి కొత్తగా ఏర్ప‌డ్డ‌ ఎన్టీఆర్‌ జిల్లా ప్రత్యేకతలు. 300 ఏళ్ల చరిత్ర కలిగిన ఒకనాటి బెజవాడ.. నేడు మహానగరంగా మారిన విజయవాడ. రాష్ట్రంలోనే అతి పెద్దదైన ఈ నగరం నూతన ఎన్టీఆర్‌ జిల్లాకు ముఖ్య పట్టణం. 68.2 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన ఈ నగరం రాష్ట్ర విభజన తరువాత ఆర్థిక నగరంగా అవతరించింది. దేశ విదేశాల నుంచి వచ్చేవారికి ఆతిథ్య నగరమయింది. ఇప్పుడు ఎన్టీఆర్‌ జిల్లా కేంద్రంగా కీలకపాత్ర పోషించనుంది.

కృష్ణానదికి పశ్చిమ దిక్కున తీరం పొడవునా విస్తరించిన ఈ జిల్లా సహజ వనరులతో నిండి ఉంది. ఇబ్రహీంపట్నంలోని నార్ల తాతారావు థర్మల్‌ విద్యుత్‌ స్టేషన్‌ జిల్లాకు ప్రత్యేకం. ఎందరో రాజులు నడయాడిన కొండపల్లి కోట చారిత్రక విశిష్టతను చాటి చెబుతోంది. కొండ కింద రూపుదిద్దు కొంటున్న బొమ్మలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినవి. ఈ రిజర్వు ఫారెస్ట్‌తో పాటు విస్తారమైన అటవీ ప్రాంతాలు మైలవరం, తిరువూరు పరిధిలో ఉన్నాయి. గ్లోబల్‌ సిటీ అనాదిగా వర్తక వాణిజ్యానికి కేంద్రం ఈ నగరం. బకింగ్‌హామ్‌ కెనాల్‌ ద్వారా జల రవాణా నడిపిన ఈ నగరం నేడు గ్లోబల్‌ సిటీ. అంతర్జాతీయ ఎగుమతులు, దిగుమతులకు కేంద్రంగా మారింది. 2010లో మూడు బిలియన్‌ డాలర్ల జాతీయ స్థూల ఉత్పత్తితో దేశంలోనే విజయవాడ పేరు మారుమోగింది.

కృష్ణానది మధ్య ఆహ్లాదాన్ని పంచే అందమైన భవానీ ద్వీపం, ఆ పక్కనే ఇంద్రకీలాద్రి, మరోపక్క గుణదల కొండ.. గాంధీకొండపై 52 అడుగుల గాంధీ స్థూపం.. ఆ పక్కనే ప్లానిటోరియం.. మొగల్రాజపురం గుహలు.. పురాతన విక్టోరియా, బాపు మ్యూజియం.. సమీపంలోనే కొండపల్లి కోట.. చుట్టూ రిజర్వు ఫారెస్టు.. ఇవన్నీ నిత్యం సందర్శకులతో కళకళలాడే ప్రాంతాలు. విజయవాడ రవాణా రంగానికి కూడా కేంద్ర స్థానం. అతిపెద్ద రైల్వే జంక్షన్‌.. బస్‌స్టేషన్‌ల నుంచి నిత్యం లక్షల మంది ప్రయాణిస్తుంటారు.ఇది ఆధ్యాత్మిక నగరం. దుర్గమ్మ కొలువుతీరిన ఇంద్రకీలాద్రి.. గుణదల కొండపై మేరీమాత.. మరెన్నో శైవ, వైష్ణవ క్షేత్రాలతో అల‌రారుతుంది.

3,315 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో.. మూడు రెవెన్యూ డివిజన్లు.. 20 మండలాలు, 321 గ్రామాలతో ఆవిర్భవించిన నూతన ఎన్టీఆర్‌ జిల్లా పాలన విజయవాడలోని సబ్‌ కలెక్టరేట్‌ కేంద్రంగా ఏర్పడిన కలెక్టరేట్‌ నుంచి పాల‌న ప్రారంభ‌మైంది. తాత్కాలిక కలెక్టరేట్‌గా సబ్‌ కలెక్టరేట్‌ను తీర్చిదిద్దారు. ఆ ప్రాంగణంలోనే జాయింట్‌ కలెక్టర్‌, డీఆర్వో చాంబర్లు రూపుదిద్దుకున్నాయి. పాలనా విభాగం మాంటిస్సోరి స్కూల్‌లో ఏర్పాటయింది. కొత్త జిల్లాకు తొలి కలెక్టర్‌గా ఎస్‌.ఢిల్లీరావు సోమవారం ఉదయం బాధ్యతలు స్వీక‌రించారు. జాయింట్‌ కలెక్టర్‌గా మాధవీలత స్థానంలో హౌసింగ్‌ బాధ్యతలు చూస్తున్న అజయ్‌ నుపుర్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు. రెవెన్యూ అధికారిగా ఉమ్మడి కృష్ణా వెల్ఫేర్‌ జేసీ మోహనరావు నియమితులయ్యారు.

Show comments