iDreamPost
android-app
ios-app

ఎవరి రోడ్‌ మ్యాప్‌ వారిదేనా?

  • Published Apr 02, 2022 | 7:30 AM Updated Updated Apr 02, 2022 | 11:50 AM
ఎవరి రోడ్‌ మ్యాప్‌ వారిదేనా?

ఒకే ఇంట్లో ఉన్న తోడికోడళ్లు ఎవరి వంట వారు చేసుకున్నట్టు ఉంది రాష్ట్రంలో బీజేపీ – జనసేనల వైఖరి. పేరుకు రెండుపార్టీల మధ్య పొత్తు ఉంది కానీ ఏ విషయం లోనూ వారు కలసి ముందుకు సాగడంలేదు. పరిషత్‌, మున్సిపల్‌, ఉప ఎన్నికల్లో కలసి పోటీ చేయలేదు. కనీసం వివిధ అంశాలపై పోరాడే విషయంలోనూ వారు ఉమ్మడి ప్రణాళికతో వెళ్లడంలేదు. విద్యుత్‌ చార్జీల పెంపును నిరసిస్తూ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఆందోళనలను కూడా విడివిడిగా చేపట్టాయి.

వచ్చే ఎన్నికల్లో అధికార వైఎస్సార్‌ సీపీని ఓడించే విషయంలో ఏకాభిప్రాయంతో ఉన్న ఈ రెండు పార్టీలు అది ఏ విధంగా అన్న విషయంలో ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాయి. అందుకే గత నెలలో జరిగిన జనసేన ఆవిర్భావసభలో పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ బీజేపీ ఇచ్చే రూట్‌ మ్యాప్‌ కోసం ఎదురుచూస్తున్నాను అని అన్నారు. అదే సందర్భంలో వైఎస్సార్‌ సీపీ వ్యతిరేక ఓటు చీలకుండా ప్రయత్నిస్తాను అని చెప్పారు. అంటే తెలుగుదేశం పార్టీని కూడా కలుపుకొని వైఎస్సార్‌ సీపీపై పోరాడాలి అన్నది ఆయన ఉద్దేశం. ఇది బీజేపీకి నచ్చడం లేదు.

బాబుతో కలవడానికి ఒప్పుకోని బీజేపీ..

గత ఎన్నికల్లో కాంగ్రెస్‌తో జతకట్టి దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు చేసిన ప్రచారాన్ని కమలనాథులు మరచిపోలేకపోతున్నారు. దానికితోడు ప్రధాని మోడీపై వ్యక్తిగత విమర్శలు చేయడం, అమిత్‌ షా తిరుపతి పర్యటనలో ఉండగా ఆయనపై దాడి చేయించడం వంటి విషయాలను బీజేపీ అగ్రనాయకత్వం సీరియస్‌గా తీసుకుంది. బాబుతో కలసి పయనించడానికి వారు ఒప్పుకోవడం లేదు. అందుకే చంద్రబాబు ఢిల్లీ వెళ్లినప్పుడు కనీసం అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వలేదు.

పవన్‌ ద్వారా కార్యం సాధించాలని బాబు యత్నం..

కమలనాథులను ప్రసన్నం చేసుకోవడానికి చంద్రబాబు తన పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులను బీజేపీలో విలీనం చేశారు. వారి ద్వారా రకరకాల ప్రయత్నాలు చేశారు. అయితే బీజేపీ ససేమిరా అనడంతో తన చిరకాల మిత్రుడు పవన్‌కల్యాణ్‌ ద్వారా ఎలాగైనా కమలంతో పొత్తును సాధించాలని చంద్రబాబు ఇప్పటికీ ప్రయత్నం చేస్తున్నారు. అందుకే పవన్‌ కల్యాణ్‌ ద్వారా వైఎస్సార్ సీపీ
వ్యతిరేక ఓట్లు చీలకూడదు అనే మాటను అనిపించారు.
అయినా బీజేపీ మెత్తపడక పోవడంతో వారితో పవన్ అంటీ ముట్టనట్టు ఉంటున్నారు.

రెండు పార్టీలకు పవన్ అవసరం

అటు రాష్ట్రంలో బలపడాలని చూస్తున్న బీజేపీకి, మళ్లీ అధికారంలోకి రావాలని ఆశపడుతున్న టీడీపీకి పవన్ కల్యాణ్ అవసరం ఉంది. గత ఎన్నికల్లో ఏడు శాతం ఓట్లు సాధించిన జనసేన సొంతంగా అధికారంలోకి వచ్చే అవకాశం లేకపోయినా గెలుపు ఓటములను ప్రభావితం చేయగలదు అని టీడీపీ, బీజేపీ నమ్ముతున్నాయి. అందుకే పవన్ తో స్నేహానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇటు పవన్ కూడా దేశవ్యాప్తంగా బలపడుతున్న బీజేపీని, రాష్ట్రంలో జనసేన కన్న బలమైన టీడీపీని కలుపుకొని వెళితేనే వైఎస్సార్ సీపీని నిలువరించగలమని భావిస్తున్నారు. అయితే టీడీపీతో కలవడానికి బీజేపీ ఒప్పుకోదు. టీడీపీ కలిస్తే కాని జనసేన ముందుకు సాగలేదు. అందుకే పరిస్థితి పిచ్చి కుదిరితే కాని పెళ్లి కాదు… పెళ్లి అయితే కాని పిచ్చి కుదరదు అన్నట్టు ఉంది.

ప్రస్తుతానికి ఎవరి రూటు వారిదే..

దీంతో అటు బీజేపీని వీడలేక, ఇటు టీడీపీతో బహిరంగంగా కలవలేక పవన్ మధ్యేమార్గంగా వ్యవహరిస్తున్నారు.
అడపాదడపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తూ ఉనికిని చాటుకుంటున్నారు.బీజేపీ కూడా ఒంటరిగానే పోరాడుతూ తన బలం పెంచుకోవాలని చూస్తోంది. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉన్నా కలసి పోటీ చేయలేని, ఉమ్మడిగా పోరాడలేని స్థితిలో ఘనీభవించి పోయింది.
అందుకే ప్రస్తుతానికి ఎవరి రోడ్ మ్యాప్ ప్రకారం వారు ముందుకు సాగుతున్నారు.