Idream media
Idream media
భారతదేశాన్ని హిందూ దేశంగా మార్చాలని బీజేపీ యోచిస్తోందంటూ నిన్నమొన్నటి వరకు ప్రత్యర్థి పార్టీలు, బీజేపీ వ్యతిరేకులు కమలం పార్టీపై విమర్శలు చేసేవారు. విద్యను కాషాయీకరణ చేసేందుకు యత్నిస్తోందనే విమర్శలు బీజేపీ సర్కార్‌పై వెల్లువెత్తాయి. నిన్నటి వరకు బీజేపీపై దాని ప్రత్యర్థులు విమర్శలు చేయగా.. ఇప్పడు కమలం పార్టీ నేతలే ఆయా అంశాలపై స్పష్టంగా మాట్లాడుతుండడం విశేషం.
హిజాబ్ వివాదం నేపథ్యంలో గత నెలలో కర్ణాటకలోని శివమొగ్గలో విద్యార్థులు కళాశాలలో జాతీయ జెండా బదులు కషాయ జెండాను ఎగురవేశారు. ఈ ఘటనను ప్రస్తావిస్తూ కర్ణాటక మంత్రి ఈశ్వరప్ప ఏదో ఒక రోజు ఎర్రకోటపై కాషాయ జెండా ఎగురుతుందంటూ మాట్లాడి తన మనసులోని మాటను బయటపెట్టారు.
మంత్రి వ్యాఖ్యలపై వివాదం కొనసాగుతుండగానే.. ఆ వ్యాఖ్యలను బలపరిచేలా ఆర్‌ఎస్‌ఎస్ కర్ణాటక నేత కల్లడ్క ప్రభాకర్ భట్ జాతీయ జెండాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కుట్రపూరిత విధానాల వల్ల భారత పతాకం మారిందన్న కల్లడ్క ప్రభాకర్.. రానున్న రోజుల్లో కాషాయ జెండానే జాతీయ పతాకం కావచ్చని అభిప్రాయపడ్డారు. తాను చెప్పింది నిజం అవుతుందనేందుకు కల్లడ్క ఓ థియరీ చెప్పారు. గతంలో బ్రిటీషు పతాకం దేశం అంతటా ఉండేదని, అంతకు ముందు ఆకుపచ్చ పతాకం ఉండేదన్నారు. లోక్‌సభ, రాజ్యసభలో స్పష్టమైన మెజారిటీ వస్తే.. జాతీయ పతాకం మార్పు సాధ్యం కాదని చెప్పలేమంటూ మనసులోని మాటను బయటపెట్టారు.
బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ రాష్ట్ర స్థాయి నేతలే కాదు.. బీజేపీ జాతీయ నేతలు కూడా కాషాయీకరణపై బహిరంగంగా మాట్లాడుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. విద్యను కాషాయీకరణ చేస్తే తప్పు ఏముందంటూ ఇటీవల ఉప రాష్ట్రపతి ముప్పువరపు వెంకయ్యనాయుడు చెప్పడం విశేషం. జాతి సమైక్యత, ప్రజల మధ్య స్నేహం, శాంతి, ప్రజాస్వామ్యం వంటి అంశాలపై నిత్యం హితబోధ చేసే వెంకయ్య నాయుడు విద్యను కాషాయీకరణ చేస్తే తప్పేముందనడం గమనార్హం. రాష్ట్రపతి పదవిని ఆశిస్తున్నందు వల్లే వెంకయ్యనాయుడు ఇలా మాట్లాడారనే వారు లేకపోలేదు. అయినా భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశంలో విద్యపై, జాతీయ జెండాపై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు తప్పక పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలు.