iDreamPost
android-app
ios-app

కేసీఆర్‌కు డౌట్‌ వచ్చిందా..? అందుకే మమత దారిలో వెళుతున్నారా..?

కేసీఆర్‌కు డౌట్‌ వచ్చిందా..? అందుకే మమత దారిలో వెళుతున్నారా..?

ఒకటిన్నర దశాబ్దం పాటు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంకోసమే కేసీఆర్‌ రాజకీయ పార్టీని నడిపారు. ప్రజాపోరాటాల ద్వారా ఉద్యమం చేయడం ఒక ఎత్తు అయితే… రాజకీయ పార్టీ ద్వారా అనుకున్న లక్ష్యం వైపు నడవడం మరోదారి. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) పార్టీ ద్వారా 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించారు. తెలంగాణ ఏర్పడడం, ఆ వెంటనే ఎన్నికలు జరగడం చకచకా జరిగిపోయాయి. ఉద్యమ నేత అయిన కేసీఆర్‌ 119 సీట్లు ఉన్న తెలంగాణ శాసనసభలో 63 సీట్ల స్వల్ప మెజారిటీతో అధికారం చేపట్టారు. ఐదేళ్ల పవర్‌ను నాలుగున్నరేళ్లకే ముగించి.. ఆరునెలల ముందుగానే ముందస్తు ఎన్నికల నగారా మోగించారు కేసీఆర్‌. మళ్లీ గెలుస్తాననే నమ్మకంతో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్‌.. విశ్వాసం నిజమైంది. ఈ సారి ఏకంగా 88 సీట్లు సాధించారు.

వచ్చే ఏడాది (2023) డిసెంబర్‌కు కేసీఆర్‌ ప్రభుత్వ పాలనకు గడువు ముగుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈ సారి కేసీఆర్‌ ముందస్తుకు వెళ్లే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. కాంగ్రెస్‌తోపాటు ఈ సారి బీజేపీ కూడా అధికారం కోసం గట్టిగానే పోరాడే అవకాశం ఉంది. గడిచిన ఐదేళ్లలో బీజేపీ తెలంగాణలో చెప్పుకోదగ్గ స్థాయిలో బలపడింది. గత లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ 17 లోక్‌సభ స్థానాలకు గాను నాలుగు సీట్లను గెలుచుకుంది. ఇక తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఉన్న కాంగ్రెస్‌కు తమను పాలించే అవకాశం ప్రజలు ఇంకా ఇవ్వలేదు. ఈ సారి కాంగ్రెస్‌కు చావో రేవో లాంటి పరిస్థితి.

మళ్లీ గెలిస్తే.. కేసీఆర్‌ చరిత్ర సృష్టిస్తారు. మూడోసారి వరుసగా అధికారం చేపడతారు. హ్యాట్రిక్‌ ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతారు. తెలుగు రాజకీయాల్లో 1983లో తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత.. ఏ రాజకీయ పార్టీ కూడా వరుసగా మూడుసార్లు అధికారాన్ని చేపట్టిన దాఖలాలు లేవు. మళ్లీ అధికారంలోకి రావడంతోపాటు జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలని కేసీఆర్‌ ఉబలాటపడుతున్నారు.

మూడోసారి అధికారం దక్కితే.. 2023 లోక్‌సభ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి కిరీటం కుమారుడు కేటీఆర్‌కు పెట్టి.. కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనే ఆలోచనతో ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. అయితే.. మూడోసారి అధికారం అంత సులువు కాదనే విషయం గులాబీ దళపతికి అర్థమైనట్లుంది. రెండుదఫాల పాలన తర్వాత సహజంగానే ప్రజల్లో వచ్చే వ్యతిరేకత, బీజేపీ దూకుడు, తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఈ సారైనా తమకు అవకాశం ఇవ్వాలంటున్న కాంగ్రెస్‌తోపాటు.. కొత్త రాజకీయ శక్తులు తమ సత్తాను చాటే క్రమంలో.. కేసీఆర్‌కు మూడోసారి అధికారం అంత సులువు కాదు.

అందుకే.. ఉద్యమంలోనూ, గత రెండు దఫాల్లోనూ లేనిది ఈ సారి వ్యూహకర్తను రంగంలోకి దింపారు. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ (పీకే)తో తాజాగా రెండుసార్లు భేటీ అయ్యారు. గులాబీ పార్టీ అమలుచేస్తున్న పథకాలపై ప్రచారంతోపాటు.. రాబోయే ఎన్నికల్లో వ్యూహాలను రచించేందుకు పీకే సేవలను కేసీఆర్‌ వినియోగించుకోబోతున్నట్లు అర్థమవుతోంది. పశ్చిమ బెంగాల్‌లో వరుసగా రెండుసార్లు మమతా బెనర్జీ విజయం సాధించినా.. మూడోసారి వ్యూహకర్త సహకారం తీసుకున్నారు. మూడోసారి మమతకు అధికారం దక్కడంలో పీకే ప్రధాన భూమిక పోషించారు. మమత తరహాలోనే.. కేసీఆర్‌ కూడా పీకే సేవలు వినియోగించుకోవడం ఖాయమైంది. మరి కేసీఆర్‌ అనుకున్న లక్ష్యాలు చేరుకుంటారా..? లేదా..? 2023 చివరాఖరున తేలుతుంది.