కేసీఆర్‌ది తెలంగాణ కాదా..?

కేసీఆర్‌ది ఏ రాష్ట్రం..? ఈ ప్రశ్న ఎప్పటి నుంచో తెలంగాణ ప్రజల్లో మెదులుతోంది. కేసీఆర్‌ తెలంగాణ వాసి కాదంటూ ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తూనే ఉన్నాయి. ఒక్కోసారి ఒక్కో ప్రాంతం పేరు తెరపైకి వస్తోంది. తాజాగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి మరోసారి కేసీఆర్‌ స్వస్థలంపై మాట్లాడారు. కేసీఆర్‌ తెలంగాణ వాసి కాదని చెప్పేందుకే ప్రతిపక్ష పార్టీలు యత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే రేవంత్‌ రెడ్డి కూడా కేసీఆర్‌ది తెలంగాణ కాదని, బీహార్‌ రాష్ట్రమని చెప్పుకొస్తున్నారు. 2008లో ఒక ఇంటర్వ్యూలో కేసీఆర్‌ ఈ విషయం చెప్పారని తన మాటలకు బలం చేకూర్చే ప్రయత్నం చేశారు.

కేసీఆర్‌ చెప్పాడనే కాకుండా.. తాజాగా ఆయన వ్యవహార శైలి కూడా అలానే ఉందంటూ రేవంత్‌ తన మాటలు నిజమని చెప్పేందుకు యత్నిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌.. బీహార్‌కు చెందిన ఉన్నతాధికారులకు పెద్దపీట వేస్తున్నారంటూ అధికారుల పేర్లను చెబుతున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్, డీజీపీ అంజనీ కుమార్‌లతోపాటు రజత్‌కుమార్, అరవింద్‌కుమార్, సందీప్‌కుమార్, సుల్తానియాలు బీహార్‌ వాళ్లేనంటూ రేవంత్‌ చెప్పుకొస్తున్నారు. వీరేకాకుండా ఇతర శాఖల్లోనూ బీహార్‌కు చెందిన అధికారులకు పెద్దపీట వేశారంటూ.. కేసీఆర్‌ బీహార్‌ వాసి కావడం వల్లే ఇలా చేస్తున్నారనేలా రేవంత్‌ మాట్లాడుతున్నారు. ఇలా బీహార్‌కు చెందిన ఉన్నతాధికారులకు ప్రాధాన్యత ఇస్తూ.. తెలంగాణ ఐఏఎస్‌లకు అన్యాయం చేస్తున్నారంటూ విమర్శలు చేశారు. కేసీఆర్‌ను తాను ప్రశ్నిస్తుండడంతో బీహార్‌కు చెందిన మంత్రి సంజయ్‌ కుమార్‌ ఝూ తనపై దాడి చేస్తున్నారని రేవంత్‌ చెప్పుకొస్తున్నారు. కేసీఆర్‌ బీహార్‌ వ్యక్తి కావడం వల్లే.. ఆయనకు మద్ధతుగా ఆ రాష్ట్రానికి చెందిన మంత్రి మద్ధతుగా మాట్లాడుతున్నారనేలా రేవంత్‌ వ్యాఖ్యలున్నాయి.

బీహార్‌కు చెందిన అధికారులను అడ్డంపెట్టుకుని తెలంగాణలో కేసీఆర్‌ పెత్తనం చేలాయించాలని చూస్తున్నారని, ఇందుకు కొనసాగింపుగానే బీహార్‌కు చెందిన ప్రశాంత్‌ కిషోర్‌ను ఎన్నికల వ్యూహకర్తగా తెచ్చుకున్నారని రేవంత్‌ రెడ్డి చెప్పుకొస్తున్నారు. మొత్తంగా కేసీఆర్‌ తెలంగాణ వ్యక్తి కాదని చెప్పేందుకు రేవంత్‌ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతోంది. అయితే ఈ వ్యూహంతో కేసీఆర్‌ను నిలువరించగలరా..? అంటే ప్రత్యర్థులు అందరూ బిక్కమొహం వేయకతప్పదు.

కేసీఆర్‌ ఏ రాష్ట్రం వాడైనా.. తెలంగాణలో పుట్టి పెరిగినవాడు. ప్రత్యేక రాష్ట్రం సాధించి తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చారు. అందుకే రెండు సార్లు అధికారం ఇచ్చారు. కేసీఆర్‌ స్థానికతపై ఎన్ని విమర్శలు వచ్చినా.. తెలంగాణ ప్రజలు ఈ విషయం మరచిపోరు. పీసీసీ అధ్యక్షుడుగా కాంగ్రెస్‌ పార్టీని తెలంగాణలో అధికారంలోకి తెచ్చేందుకు రేవంత్‌ రెడ్డికి అనేక అవకాశాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌ ఇప్పటికీ ప్రజల మనసుల్లో ఉంది. ఈ ఒక్క విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అధికారం దక్కేలా చేయొచ్చు. ఇలాంటి విషయాలు వదిలేసి.. కేసీఆర్‌ స్థానికతపై విమర్శలు చేసినంత మాత్రాన ప్రజలు కాంగ్రెస్‌కు ఓట్లు వేస్తారా..?

Show comments