విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. 709 కోట్ల రూపాయలు జమ చేసిన సర్కార్‌

చదువుతోనే జీవన స్థితిగతుల్లో మార్పు వస్తుందని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. విద్యా దీవెన పథకంలో భాగంగా 2021 అక్టోబర్‌ – డిసెంబర్‌ త్రైమాసికానికి సంబంధించిన ఫీజు మొత్తం 709 కోట్ల రూపాయలను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో బుధవారం సచివాలయంలో బటన్‌ నొక్కి సీఎం జగన్‌ నేరుగా జమచేశారు.

ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ.. విద్యకు ఉన్న విలువను గుర్తుచేశారు. ఎవరూ దొంగిలించలేని ఆస్తి చదువు ఒక్కటేనని సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి అభివర్ణించారు. విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు ఎంతో సంతోషాన్ని ఇచ్చే పథకాలని సీఎం జగన్‌ పేర్కొన్నారు. జగనన్న విద్యా దీవెన పథకం కింద 10.82 లక్షల మంది విద్యార్థులకు ఫీజులు చెల్లిస్తున్నామని తెలిపారు. విద్య ద్వారానే నాణ్యమైన జీవితం సాకారం అవుతుందని స్పష్టం చేశారు.

2007లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఫీజు రియంబర్స్‌మెంట్‌ పథకానికి శ్రీకారం చుట్టారు. కులాలు, మతాలతో సంబంధం లేకుండా పేదలైన ప్రతి ఒక్క (రేషన్‌కార్డు ప్రాతిపదిక) విద్యార్థి ఉన్నత చదువులు చదివేందుకు అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే చెల్లించేలా ఫీజు రియంబర్స్‌మెంట్‌ పథకానికి శ్రీకారం చుట్టారు. మెడిసిన్, ఇంజినీరింగ్‌ సహా వివిధ వృత్తి విద్యాకోర్సులు చదివేవారికి ఎంత ఫీజులైనా వైఎస్‌ఆర్‌ ప్రభుత్వం చెల్లించింది. ఆయన మరణాంతరం వచ్చిన ప్రభుత్వాలు వివిధ కొర్రీలు వేసినా.. పథకాన్ని కొనసాగించారు.

చదువుతోనే పేదరికం నుంచి బయటపడతామని చెప్పే వైఎస్సార్‌ ఆశయాలను ఆయన కుమారుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కొనసాగిస్తున్నారు. ఫీజు రియంబర్స్‌మెంట్‌ పథకాన్ని జగనన్న విద్యా దీవెన పేరుతో సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం బకాయిలు పెట్టిన 1,778 కోట్ల రూపాయలను చెల్లించడమే కాకుండా.. ఇప్పటివరకు విద్యా దీవెన పథకం కింద జగన్‌ సర్కార్‌ 9,274 కోట్ల రూపాయలను విద్యార్థుల ఫీజుల కోసం వెచ్చించింది. ఆయా విద్యార్థులు వసతి, భోజన ఖర్చుల కోసం జగనన్న వసతి దీవెన పథకం ప్రారంభించారు. ఈ పథకం కింద ఐటీఐ, డిప్లోమా చదవేవారికి 15 వేల రూపాయలు, డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ కోర్సులు చదివే వారికి 20 వేల రూపాయలు రెండు దఫాలుగా అందిస్తున్నారు.

Show comments