iDreamPost
android-app
ios-app

ఆ యాభై మంది మరింత బాధ్యతగా ఉండాల్సిందే, ఎమ్మెల్యేలకు జగన్ సూచన

  • Published Mar 15, 2022 | 9:12 PM Updated Updated Mar 16, 2022 | 9:13 AM
ఆ యాభై మంది మరింత బాధ్యతగా ఉండాల్సిందే, ఎమ్మెల్యేలకు జగన్ సూచన

ప్రభుత్వాన్ని గాడిలో పెట్టే యత్నం చేస్తూనే పార్టీని కూడా ఉత్తేజితం చేసేందుకు జగన్ దృష్టి సారించారు. దానికి అనుగుణంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీ వ్యవహారాలకు సంబంధించి శాసనసభాపక్ష సమావేశంలో భవిష్యత్తు గురించి ఎమ్మెల్యేలకు సూచనప్రాయంగా తెలిపారు. వచ్చే ఎన్నికలకోసం ఇప్పటి నుంచే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సూటిగానే చెప్పారు. మళ్లీ పోటీలో ఉండాలంటే ఎమ్మెల్యేలంతా మరింత బాధ్యతగా వ్యవహరించాల్సిందేనని తేల్చేశారు. అదే సమయంలో పనితీరు పరంగానూ, ఇతర వ్యవహారాల్లోనూ ఆరోపణలు ఎదుర్కొంటున్న 50 మంది ఎమ్మెల్యేలకు దాదాపుగా ఫస్ట్ వార్నింగ్ ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. పనితీరు సవరించుకోకపోతే పక్కన పెట్టాల్సి వస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం దానికి నిదర్శనం.

పార్టీ కి చెందిన 151 మంది ఎమ్మెల్యేల్లో మూడో వంతు సిట్టింగుల విషయంలో సీఎం అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. పార్టీ వ్యవహారాలతో పాటుగా, వివిధ కార్యకలాపాల్లో పనితీరు సంతృప్తిగా లేనట్టు కనిపిస్తోంది. దానికి తగ్గట్టుగా మెరుగైన పనితీరు ప్రదర్శించే వారికి మాత్రమే వచ్చే ఎన్నికల్లో తిరిగి అవకాశం ఉంటుందనే అంశాన్ని ముఖ్యమంత్రి స్పష్టంగా తెలిపారు. ప్రజల్లో నిత్యం తిరుగుతూ, ప్రజాదరణ పొందాల్సిందేనన్నారు. స్థానికంగా ప్రజలను మెప్పించిన వారిని మాత్రమే కొనసాగిస్తామని స్పష్టం చేశారు. దానికి అనుగుణంగా సర్వేలు చేస్తామని వెల్లడించారు. ఆ నివేదికల ఆధారంగానే ఎమ్మెల్యేలకు అవకాశం ఉంటుందని చెప్పేశారు.

దాదాపుగా 50 మంది ఎమ్మెల్యేల పనితీరు మార్చుకోవాల్సిందేనని విషయాన్ని సీఎం సూటిగా చెప్పడం విశేషంగా మారింది. వారిలో 30 మంది తొలిసారి గెలిచిన వారే ఉండడం విశేషం. ఇక 12 మంది సీనియర్ ఎమ్మెల్యేలు కూడా ఆ జాబితాలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇంటిలిజెన్స్ నివేదికల ఆధారంగా సీఎం ఈ నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. లిస్టులో ఉన్న వారిలో 8 మంది మహిళా ఎమ్మెల్యేల పేర్లు ఉండడం ఆసక్తిగా మారింది. ఫెర్మార్మెన్స్, పార్టీ పట్ల నిబద్ధత కొలమానంగా తీసుకునే అవకాశం కనిపిస్తోంది. దానికి అనుగుణంగా ఎమ్మెల్యేలంతా బాధ్యతాయుతంగా మెలగాలని సీఎం స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల పనితీరు కొలబద్ధగా తీసుకుంటామని చెప్పడంతో ఎమ్మెల్యేలంతా మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం కనిపిస్తోంది.