రాష్ట్రం లో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. బీఆర్ఎస్ నేతల ఇళ్లల్లో ఐటీ దాడులు చోటు చేసుకోవడం సంచలనంగా మారింది. క బుధవారం ఉదయం నుంచి హైదరాబాద్‌లోని ముగ్గురు బీఆర్ఎస్ నేతల ఇళ్లు, కార్యాలయాలతో పాటు వారికి సంబంధించి వ్యాపార సంస్థలు, వారి వద్ద పని చేసే సిబ్బంది ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి ఇళ్లల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేపడుతున్నారు.
బీఆర్ఎస్ నేతలు కొత్తపేటలోని పైళ్ల శేఖర్ రెడ్డి, జూబ్లిహిల్స్ రోడ్ నెంబర్ 36లోని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, కొండాపూర్ బోటానికల్ గార్డెన్ దగ్గర ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డి ఇళ్లల్లో ఉదయం నుంచి ఏకకాలంలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. అలాగే కేపీహెచ్‌బీలోని జేసీ బ్రదర్స్ షాపింగ్ మాల్‌లో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. జే సీ బ్రదర్స్ షాపింగ్ మాల్స్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జనార్థన్ రెడ్డి, అతడి బంధువులు డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. ఉదయం 6 గంటల నుంచి సోదాలు జరుగుతుండగా.. జేసీ బ్రదర్స్‌లో జరిగిన లావాదేవీపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు.
అంతేకాక కొత్తపేట గ్రీన్‌హిల్స్ కాలనీలోని ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి ఇల్లు, కార్యాలయాల్లో కూడా ఉదయం నుంచి ఐటీ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి తీర్థ గ్రూప్ పేరుతో రియల్ ఎస్టేట్, మైనింగ్, సోలార్ ఎనర్జీ, లిథియం బ్యాటరీల వ్యాపారాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే సౌత్ ఆఫ్రికాలో కూడా తీర్థ గ్రూప్ మైనింగ్ వ్యాపారం చేస్తోన్నట్లు ఐటీ శాఖ గుర్తించింది. ఈ తీర్థ గ్రూపులో ఫైళ్ల శేఖర్ రెడ్డి కుటుంబసభ్యులు డైరెక్టర్లుగా ఉన్నారు.
అటు నగరంలోని హిల్ ల్యాండ్ టెక్నాలజీస్ కంపెనీ, మెయిన్ ల్యాండ్ డిజిటల్ టెక్నాలజీస్ కంపెనీలలో కూడా ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ రెండు కంపెనీలకు పైళ్ల శేఖర్ రెడ్డి భార్య వనితా డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యే ఇళ్లు, కార్యాలయాలు, సిబ్బంది ఇళ్లతో పాటు 12 చోట్ల ఏకకాలంలో 70 బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఐటీ చెల్లింపుల అవకతవకలపై అధికారులు ఆరా తీస్తున్నారు. అధికార బీఆర్ఎస్ నేతల ఇళ్లల్లో వరుసగా ఐటీ దాడులు జరగడం ఆ పార్గీ వర్గాల్లోనే కాక రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హైటెన్షన్ క్రియేట్ చేస్తోంది. బీజేపీ అగ్ర నేత అమిత్ షా ఖమ్మంలో జరిగే బహిరంగ సభలో పాల్గొనేందుకు ఇవాళ అర్ధరాత్రి హైదరాబాద్‌కు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఐటీ సోదాలు జరగడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.