Idream media
Idream media
ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు బీజేపీ వ్యతిరేక పార్టీలకు నిరాశను కలిగించాయి. ఉత్తరప్రదేశ్‌తోపాటు, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాలలో మళ్లీ బీజేపీనే అధికారం వరించబోతోందని దాదాపు అన్ని సర్వే సంస్థలు అంచనా వేశాయి. పంజాబ్‌లో ఆప్, గోవాలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని పేర్కొన్నాయి. పంజాబ్‌లో బీజేపీ బలంగా లేదు. ఆ రాష్ట్రంలపై కమలం పార్టీ ఎలాంటి ఆశలు పెట్టుకోలేదు. ఐదు రాష్ట్రాలలో అతి ముఖ్యమైన ఉత్తరప్రదేశ్‌పైనే బీజేపీ నేతలు ఎక్కువగా ఫోకస్ చేశారు. యూపీలో అధికారం నిలబెట్టుకోవడం ద్వారా 2024 ఎన్నికలకు మార్గం సుగమం చేసుకోవచ్చనేది కమలం నేతల ప్లాన్.
2024 ఎన్నికల విషయం ఎలా ఉన్నా.. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో సర్వే సంస్థల అంచనాలు నిజమైతే.. బీజేపీ దూకుడును ఎవరూ అడ్డుకోలేరు. తాను అనుకున్నది చేసి తీరుతుంది. ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ ఇంకా వేగవంతంగా సాగుతుంది. బీజేపీ సర్కార్‌కు ఇంకా రెండేళ్లపాటు సమయం ఉంది. ఈ రెండేళ్లలో చేయాలనుకున్న అన్ని పనులను చేసేందుకు బీజేపీ సిద్ధమవుతుందనడంలో సందేహం లేదు. వెనక్కి తీసుకున్న నూతన వ్యవసాయ చట్టాలపై కూడా మోదీ సర్కార్ దృష్టి సారించే అవకాశం లేకపోలేదు. వ్యవసాయ చట్టాలను మళ్లీ తెస్తామంటూ.. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ చెప్పిన మాటలు నిజం అయ్యే పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది.
నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు ఏడాది పాటు ఉద్యమం చేసినా పట్టించుకోని మోడీ సర్కార్.. ఐదు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆ చట్టాలను వెనక్కి తీసుకున్నట్లు మంత్రి నరేంద్రసింగ్ తోమర్ వ్యాఖ్యల ద్వారా అర్థమైంది. చట్టాలను వెనక్కి తీసుకున్న ఈ ఎన్నికల్లో రైతులు బీజేపీకి వ్యతిరేకంగా ఓటువేస్తారని అందరూ అంచనా వేశారు. విశ్వహిందూ పరిషత్ మాజీ కార్యనిర్వాహఖ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఉద్యమం చేసిన రైతులు గత ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేశారని, ఈసారి వారందరూ బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయబోతున్నారని ఆయన జోస్యం చెప్పారు. రైతుల పట్ల బీజేపీ సర్కార్ వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టారు. మద్ధతు ధరకు చట్టబద్ధత, ఆందోళనల్లో మరణించిన రైతులకు పరిహారం, విద్యుత్ మీటర్ల తొలగింపు.. హామీలు ఇచ్చి అమలు చేయని బీజేపీని శిక్షించండి అంటూ సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) యూపీ ప్రజలకు పిలుపునిచ్చింది.
ఎన్నికల వరకు ఇలాంటి పరిస్థితులు ఉన్నా.. బీజేపీ మళ్లీ ఉత్తరప్రదేశ్‌లో గెలిస్తే ఆ పార్టీ చేసిన ప్రతి పనికి ప్రజల మద్ధతు ఉన్నట్లుగానే భావించాలి. అంటే వెనక్కి తీసుకున్న నూతన వ్యవసాయ చట్టాలకు మళ్లీ పురుడుపోసేలా పరిస్థితులు ఏర్పడతాయి. ఉద్యమం తీవ్ర స్థాయిలో జరిగినా, ఢిల్లీని దిగ్భంధించినా వెనక్కి తగ్గని మోడీ సర్కార్.. ఎన్నికల నోటిఫికేషన్‌కు కేవలం నెలన్నర ముందు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఎన్నికలు ముగిశాయి. ఎగ్జిట్ పోల్ ఫలితాలు వచ్చాయి. ఎగ్జాట్ పోల్ ఫలితాలు ఈ నెల 10వ తేదీన రాబోతున్నాయి. ఎగ్జిట్ పోల్ ఫలితాలే నిజమైతే.. బీజేపీ దూకుడు జెట్ స్పీడ్‌లో ఉంటుంది.