iDreamPost
android-app
ios-app

ఏపీ బడ్జెట్: ఇరిగేషన్ కి భారీగా కేటాయింపులు

  • Published Mar 11, 2022 | 1:26 PM Updated Updated Mar 11, 2022 | 7:16 PM
ఏపీ బడ్జెట్: ఇరిగేషన్ కి భారీగా కేటాయింపులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బడ్జెట్ లో నీటిపారుదల శాఖకి భారీగా నిధులు కేటాయించారు. 2022-23 సంవత్సరానికి తాజా బడ్జెట్ ప్రతిపాదనలను ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎపి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రూ. 2,56,256 కోట్ల భారీ బడ్జెట్ ని సభ ముందు ఉంచారు. అందులో సంక్షేమం, అభివృద్ధి కి సమ ప్రాధాన్యతనిచ్చినట్టు కనిపిస్తోంది.

నీటిపారుదల రంగంలో పురోగతికి అనుగుణంగా ఈసారి కేటాయింపు జరిగిందనే అభిప్రాయం వినిపిస్తోంది. ముఖ్యంగా పోలవరం, వెలిగొండ వంటి సుదీర్ఘకాలంగా పెండింగులో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేసే లక్ష్యంతో ప్రభుత్వం ఉన్నట్టు కనిపిస్తోంది.

వెలిగొండ లో మొదటి టన్నెల్ ఇప్పటికే పూర్తయింది. రెండో టన్నెల్ నిర్మాణం వేగంగా సాగుతోంది. మొదటి టన్నెల్ ద్వారా వచ్చే ఖరీఫ్ నాటికి నీటి విడుదల యత్నం చేస్తున్నారు. అందుకు అనుగుణంగా పునరావాసం కోసం నిధులు విడుదల చేసేందుకు ఇరిగేషన్ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. సుమారుగా వెయ్యి కోట్లు అందుకు అవసరం అవుతాయి. వాటిని నిర్వాసితులకు అందిస్తే పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ మొదటి దశ అందుబాటులోకి వస్తుంది.

ఇప్పటికే నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రాంతాన్ని వెలిగొండ మొదటి దశలో తీసుకురావాలని మేకపాటి రాజమోహన్ రెడ్డి సీఎం జగన్ ని కోరారు. దానికి అసెంబ్లీ సాక్షిగా సీఎం అంగీకరించారు. గౌతమ్ రెడ్డి ఆశయాల సాధనలో ఇది కూడా భాగం అని తెలిపారు. దాంతో ఈసారి బడ్జెట్ కేటాయింపుల ద్వారా వెలిగొండ తో పాటుగా రాయలసీమ కి చెందిన పెండింగ్ ప్రాజెక్టుల పనులు వేగవంతం అయ్యే అవకాశం ఉంది.