iDreamPost
android-app
ios-app

భూమా కుటుంబంలో మరోమారు రచ్చకెక్కిన విభేదాలు

  • Published Mar 12, 2022 | 5:56 PM Updated Updated Mar 12, 2022 | 10:27 PM
భూమా కుటుంబంలో మరోమారు రచ్చకెక్కిన విభేదాలు

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ అంటే భూమా కుటుంబ అడ్డా అని కొన్నాళ్ల క్రితం వరకు పేరుండేది. రాజకీయమంతా ఆ కుటుంబం చుట్టూనే తిరిగేది.కానీ నాగిరెడ్డి దంపతుల మృతి తర్వాత పరిస్థితి మారిపోయింది.ఆ కుటుంబమే వివాదాలకు కేంద్రంగా మారింది.రాజకీయ ఆధిపత్యం విషయంలో తలెత్తిన విభేదాలు, అఖిలప్రియ దుందుడుకు చర్యలు ఆ కుటుంబాన్ని తరచూ వివాదాలు, కేసుల్లోకి నెట్టడమే కాకుండా కుటుంబంలోనూ చిచ్చు పెట్టాయి. తాజాగా భూమా దంపతుల విగ్రహావిష్కరణ వ్యవహారం ఆ కుటుంబంలో వివాదం రేపింది. తాను ఏర్పాటు చేసిన విగ్రహాలను అఖిలప్రియ, ఆమె సోదరుడు ఆవిష్కరించారంటూ వారి కజిన్ సోదరుడు భూమా కిషోర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది.

సొంత స్థలంలో జంట విగ్రహాలు

నంద్యాల ఎమ్మెల్యేగా ఉన్న భూమా నాగిరెడ్డి 2017 మార్చి 12న గుండెపోటుతో మృతి చెందారు. అంతకుముందు 2014 ఎన్నికల ప్రచార సమయంలో ఆయన సతీమణి శోభానాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించారు. వారి స్వగ్రామమైన ఆళ్లగడ్డలో భూమా కుటుంబానికి చెందిన, మాజీమంత్రి అఖిలప్రియకు వరుసకు సోదరుడైన భూమా కిషోర్ రెడ్డి తన సొంత స్థలంలో, సొంత ఖర్చులతో భూమా దంపతుల విగ్రహాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. విగ్రహాలు తయారు చేయించారు. భూమా వర్ధంతి రోజైన మార్చి 12(శనివారం)న వాటిని ఆవిష్కరించేందుకు వీలుగా విగ్రహాలను ఏర్పాటు చేశారు. కానీ కిషోర్ ప్రమేయం లేకుండా భూమా నాగిరెడ్డి కుమార్తె, మాజీమంత్రి అఖిలప్రియ, ఆమె భర్త భార్గవరామ్, సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డిలు ఆ విగ్రహాలను ఆవిష్కరించి, పాలాభిషేకం కూడా చేసేశారు. తర్వాత వచ్చిన కిషోర్ రెడ్డి జరిగిన విషయం తెలుసుకుని అఖిలప్రియ తీరు పట్ల మండిపడ్డారు. తాను సొంత ఖర్చులతో, సొంత స్థలంలో ఏర్పాటు చేసిన విగ్రహాలను వారు ఎలా ఆవిష్కరిస్తారని ప్రశ్నిస్తూ అసహనం వ్యక్తం చేశారు. తర్వాత ఆయన మళ్లీ వాటిని ఆవిష్కరించారు.

కొన్నాళ్లుగా కుటుంబంలో వివాదాలు

గత ఎన్నికల్లో ఓటమి తర్వాత భూమా కుటుంబంలో విభేదాలు, వివాదాలు మొదలయ్యాయి. రోజురోజుకూ అవి ముదిరిపోతున్నాయి. అఖిలప్రియ దంపతులు, సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి అనేక వివాదాలు, కిడ్నాప్ కేసుల్లో ఇరుక్కోవడం, జైలు పాలవ్వడంతో అటు అనుచరవర్గానికి, ఇటు కుటుంబానికి దూరం అవుతున్నారు. వీరి తీరు నచ్చక ఈ కుటుంబానికి చెందిన భూమా కిషోర్ రెడ్డి గత ఎన్నికల అనంతరం బీజేపీలో చేరారు. ప్రస్తుతం ఆ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జిగా వ్యవహరిస్తున్నారు. అయితే అఖిలప్రియ వివాదాల్లో ఇరుక్కున్నందున వచ్చే ఎన్నికల నాటికి టీడీపీలో చేరి, ఆళ్లగడ్డ టికెట్ సాధించాలని కిషోర్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇది కూడా అఖిల, కిషోర్ మధ్య విభేదాలకు మరింత ఆజ్యం పోసింది. గత నెలలో ఒక గోడ కూల్చివేత ఘటనలో కిషోర్ రెడ్డి అఖిలప్రియ దంపతులపై కేసు కూడా పెట్టారు. తాజాగా విగ్రహావిష్కరణ వ్యవహారం కుటుంబంలో మరింత వివాదానికి కారణమైంది.