iDreamPost
android-app
ios-app

ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయడానికే ఈ కుట్రలు: డిప్యూటీ సీఎం

ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయడానికే ఈ కుట్రలు: డిప్యూటీ సీఎం

పోలీసుల త్యాగాన్ని గుర్తించక పోయినా పర్లేదు కానీ.. వారిని అవహేళన మాత్రం చేయద్దంటూ చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డి కోరారు. పుంగనూరులో పోలీసులపై దాడికి సంబంధించి డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, చిత్తూరు ఎస్పీ, కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. ‘పుంగనూరు ఘటనలో పోలీసులే టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టారని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. అందుకు కావాల్సిన సాక్షాధారాలు మా దగ్గర ఉన్నాయి. ముందస్తు ప్రణాళికతోనే వాళ్లు పోలీసులపై దారుణంగా దాడి చేశారు. ఆ దాడిలో మా కానిస్టేబుల్ కన్ను పోయింది’ అంటూ ఎస్పీ రిషాంత్ రెడ్డి చెప్పారు.

ఈ ఘటనపై కలెక్టర్ సగిలి షన్మోహన్ అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో కానిస్టేబుల్ రణధీర్ పూర్తి చూపు కోల్పోవడం భాదాకరమన్నారు. ప్రజారక్షణలో భాగంగా కళ్ళను కోల్పోయిన కానిస్టేబుల్ కుటుంబంతో పాటు, గాయపడిన పోలీసుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కానిస్టేబుళ్లకు మెరుగైన వైద్యం కోసం పెద్ద పెద్ద సిటీలకు పంపిన విషయాన్ని తెలియజేశారు. వారికి సంబంధించి ఏ విషయంలోనూ రాజీ పడేది లేదని కలెక్టర్ సగిలి షన్మోహన్ వ్యాఖ్యానించారు. అయితే కళ్ళు శాశ్వతంగా కోల్పోవడం చాలా బాధాకరమన్నారు.

పుంగనూరు ఘటనపై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏ1 ముద్దాయిగా కేసు నమోదు చేయాలని నారాయణ స్వామి డిమాండ్ చేశారు. సీఎం జగన్ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసేందుకే ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు చూసి.. ప్రభుత్వాన్ని ఏదో రకంగా ఇరకాటంలో పెట్టాలని చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. పుంగనూరులో విధ్వంసానికి  టెర్రరిస్టుల మాదిరి పథకం పన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి సభల్లో కావాలనే సీఎం జగన్ పై అసభ్య పదజాలాన్ని వాడుతూ వైసీపీ శ్రేణులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

పుంగనూరు పర్యటనలో భాగంగా చంద్రబాబుకు బైపాస్ లో వెళ్లడానికి రూట్ మ్యాప్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ, వాళ్లు కావాలని గొడవలు చేయడం కోసం టౌన్ లోకి వచ్చారన్నారు. పుంగనూరు టౌన్ లోకి వచ్చేలా చంద్రబాబు కార్యకర్తల్ని రెచ్చగొట్టినట్లు చెప్పుకొచ్చారు. విచక్షణ కోల్పోయిన వాళ్లు రాళ్లు, బీర్ బాటిల్స్ తో పోలీసులపై దాడి చేశారన్నారు. ఆ సమయంలో ఎస్పీ ఎంతో సహనంతో వ్యవహరించారని.. అభినందించారు. పోలీసులు కూడా టీడీపీ కార్యకర్తల శైలిలో స్పందించవచ్చు. కానీ, అదే జరిగుంటే పరిస్థితి ఇంకోలా ఉండేదన్నారు. అలా జరిగితే ప్రభుత్వం మీద నిందలు వేయచ్చు అనేదే వారి ప్రణాళిక అంటూ వెల్లడించారు. కానీ పోలీసులు మాత్రం ఎంతో సంయమనం పాటించారన్నారు. ఈ దాడిలో దాదాపు 60 మంది పోలీసులు గాయపడ్డారని.. వారిలో ఒక డీఎస్పీ కూడా ఉన్నారన్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుపై A1 ముద్దాయిగా కేసు నమోదు చేయాలని నారాయణస్వామి ఎస్పీ రిశాంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.