iDreamPost
iDreamPost
ఐదు రాష్ట్రాల్లో సుదీర్ఘ పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడ్డాయి. యూపీ సహా మిగతా రాష్ట్రాల విషయం పక్కనపెడితే గోవాలో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని, ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవచ్చని వెల్లడైన అంచనాలు.. అసలు ఫలితాలకు ముందే కాక రేపుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటుకు ఇతర పార్టీలు, ఎమ్మెల్యేలపై ఆధారపడాల్సిన పరిస్థితి వస్తే బేరసారాలు, జంపింగులు జోరుగా జరిగే అవకాశం ఉందని భావిస్తున్న ప్రధాన పార్టీలు ముందు జాగ్రత్త పడుతున్నాయి. తమ సభ్యులు జారిపోకుండా చేసుకోవడంతో పాటు ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం సాధించేందుకు ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ 2017లో ఎదురైన చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని తమ అభ్యర్థులందరినీ ఢిల్లీకి తరలించింది.
ఐదేళ్ల క్రితం ఏం జరిగిందంటే
2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించిన కాంగ్రెస్.. బీజేపీ మైండ్ గేమ్ ముందు చతికిల పడి ఐదేళ్లు అధికారానికి దూరంగా ఉండిపోయింది. 40 మంది సభ్యులు ఉన్న గోవాలో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 21. కానీ ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ 17 సీట్లు గెలుచుకుని అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా గుర్తింపు పొందినా ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 21 మంది సభ్యుల బలాన్ని సమీకరించుకోలేకపోగా తన ఎమ్మెల్యేలనే కాపాడుకోలేక పోయింది. మరోవైపు 13 చోట్ల గెలిచిన బీజేపీ ముగ్గురు మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ (ఎంజీపీ) సభ్యులు, మరికొందరు స్వతంత్రులతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కొన్నాళ్ల తర్వాత కాంగ్రెస్ నుంచి మెజారిటీ ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకుని అధికారాన్ని సుస్థిరం చేసుకుంది. ఆ చేదు అనుభవం, ప్రభుత్వ ఏర్పాటులో వైఫల్యం ఇప్పటికీ కాంగ్రెసును బాధపెడుతోంది. అందుకే ఈసారి ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది.
ఢిల్లీలో క్యాంప్
ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ గోవా ఫార్వర్డ్ పార్టీతో పొత్తు పెట్టుకుని పోటీ చేసింది. ఈ నెల పదో తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అయితే దానికి ముందు వెలువడిన ఎగ్జిట్ ఫలితాల్లో ఏ పార్టీకి మెజారిటీ రాదని దాదాపు అన్ని సర్వేలు అంచనా వేశాయి. కాంగ్రెస్, బీజేపీల మధ్య రెండు మూడు సీట్ల తేడా మాత్రమే ఉంటుందని కూడా పేర్కొన్నాయి. దీంతో కాంగ్రెస్ అప్రమత్తం అయ్యింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ రంగంలోకి దిగారు. పార్టీ గోవా నేతలతో మంతనాలు జరుపుతున్నారు. పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు చేజారిపోకుండా ముందు జాగ్రత్త చర్యగా వారందరినీ ఢిల్లీకి తరలించారు. హంగ్ ఏర్పడుతుందన్న అంచనాల దృష్ట్యా ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి జంపింగులు, మద్దతు సమీకరించే క్రమంలో గెలుస్తారన్న అంచనాలు ఉన్న అభ్యర్థులతో బేరసారాలకు అవకాశం లేకుండా అభ్యర్థులతో ఢిల్లీలో క్యాంప్ ఏర్పాటు చేశారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి ఏ అవకాశాన్ని వదులుకోవడానికి కాంగ్రెస్ సిద్ధంగా లేదని ఆ పార్టీ నేతలు స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏర్పాటుకు తప్పనిసరిగా ప్రయత్నిస్తామని అంటున్నారు. మెజారిటీకి సంఖ్యాబలం తగ్గితే ఇతర ఎమ్మెల్యేల మద్దతు స్వీకారిస్తామని అంటున్నారు. ఇప్పటికే ఆ దిశగా కేసీ వేణుగోపాల్ ప్రయత్నాలు మొదలుపెట్టారు.