iDreamPost
android-app
ios-app

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పొలిటికల్ జర్నీ! పైలెట్ నుండి పవర్ ఫుల్ లీడర్ గా!

Uttam Kumar Reddy Biography & Political Journey: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిందంటే.. దానికోసం కృషి చేసిన నేతల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూాడా ఒకరు. ఆయన ఇప్పుడు తెలంగాణ మంత్రిగా బాధ్యతలు కూడా స్వీకరించనున్నారు. ఆ సందర్భంగా ఉత్తమ్ పొలిటికల్ జర్నీపై ప్రత్యేక కథనం.

Uttam Kumar Reddy Biography & Political Journey: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిందంటే.. దానికోసం కృషి చేసిన నేతల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూాడా ఒకరు. ఆయన ఇప్పుడు తెలంగాణ మంత్రిగా బాధ్యతలు కూడా స్వీకరించనున్నారు. ఆ సందర్భంగా ఉత్తమ్ పొలిటికల్ జర్నీపై ప్రత్యేక కథనం.

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పొలిటికల్ జర్నీ! పైలెట్ నుండి పవర్ ఫుల్ లీడర్ గా!

నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఈ పేరు వింటే తెలుగు ప్రజల్లో ఒక ఉత్సాహం నెలకొంటుంది. దేశ సేవే పరమావధిగా భారత వైమానికి దళంలో పైలట్ గా సేవలందించారు. ఆ తర్వాత రాష్ట్రపతి భవన్ లో విధులు నిర్వర్తించారు. ఎయిర్ ఫోర్స్ లో ఉన్నా.. రాష్ట్రపతి భవన్ లో సేవ చేసిన అది ప్రజా సేవే. కానీ, పరోక్షంగా చేసే ఆ సేవ నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ప్రజలకు సేవ చేయాలి అని ఆయనలో వచ్చిన ఆ ఆలోచన ఇప్పుడు తెలంగాణ ప్రజలకు ఆధారంగా మారింది. ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టింది మొదలు ఇప్పటివరకు ప్రజా సేవే ప్రధాన అజెండాగా ముందుకు సాగారు. తెలంగాణ ఏర్పడిన పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే సీనియర్ నేతగా ఉత్తమ్ కుమార్ చేసిన కృషి ఎనలేనిది. ఇప్పుడు మంత్రిగా బాధ్యతలు చేపట్టినున్న సందర్భంగా ఉత్తమ్ కుమార్ రాజకీయ ప్రస్థానం గురించి ప్రత్యేక కథనం.

విద్యాభ్యాసం:

1962, జూన్ 20న సూర్యాపేటలో పురుషోత్తంరెడ్డి- ఉషారాణి దంపతులకు ఉత్తమ్ కుమార్ రెడ్డి జన్మించారు. ఆయన బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. ఆ తర్వాత భారత వైమానిక దళంలో అడుగుపెట్టారు. ఆ తర్వాత పైలట్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి దేశ సేవలో తన వంతు పాత్ర పోషించారు. ఆ తర్వాత భారత రాష్ట్రపతి భవన్ లో సేవలు అందించారు. రాష్ట్రపతి విదేశీ ప్రయాణాల్లో సెక్యూరిటీ ప్రొటోకాల్ కంట్రోలర్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎనలేని సేవలు అందించారు. అలాంటి ఒక గొప్ప పదవిలో ఉన్న వ్యక్తి ఎంతో సంతోషంగా తన జీవితాన్ని గడిపేయచ్చు. రిటైర్ అయిన తర్వాత భార్యాపిల్లలు, మనువలు, మనవరాళ్లు అంటూ జీవితాన్ని సంతోషంగా గడిపేయచ్చు. కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ దారిని ఎచుకోలేదు. ముళ్లుంటాయని తెలిసినా రాజకీయాల్లోకి రావాలి అనుకున్నారు. దేశ సేవ చాలించి.. ప్రత్యక్షంగా ప్రజలకు సేవ చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రజా సేవ, రాజకీయాలు అంటే అవమానాలు, విమర్శలు, ఛీత్కారాలు ఉంటాయని తెలిసినా కూడా కావాలనే రాజకీయాల్లోకి వచ్చారు.

Uttam kumar reddy political life journey

రాజకీయ ప్రస్థానం:

కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని, పార్టీకి అండగా ఉన్న నాయకులు, సీనియర్లలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఒకరు. ఆయన రాజకీయ ప్రస్థానం 1994లో ప్రారంభమైంది. కాంగ్రెస్ తరఫున 1994లో కోదాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. కానీ, ఆ సమయంలో ఉత్తమ్ కు ఓటమి తప్పలేదు. కానీ, ఓటమితో ఆయన కుంగిపోలేదు. ప్రజాక్షేత్రంలోనే తన పోరాటాన్ని కొనసాగించారు. తర్వాతి దఫా 1999లో ఎన్నికల్లో మళ్లీ కోదాడ స్థానం నుంచే పోటీ చేసి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2004 ఎన్నికల్లో రెండోసారి కోదాడ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009లో ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానం పోటీ చేశారు. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలో కొత్తగా ఏర్పడ్డ హుజూర్ నగర్ నుంచి పోటీ చేశారు. అప్పుడు కూడా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014, 2018లో కూడ హుజూర్ నగర్ స్థానం నుంచే బరిలోకి దిగిన ఉత్తమ్ కుమార్ ఘన విజయం సాధించారు. 2019లో నల్గొండ లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహా రెడ్డిపై 25,682 ఓట్ల మెజారిటీతో అద్భుతమైన విజయం సొంతం చేసుకున్నారు.

తాజాగా ఎన్నికల్లో కూడా హుజూర్ నగర్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించి.. ఇప్పుడు మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్నో గొప్ప బాధ్యతలను కూడా నిర్వర్తించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిప్యూటీ స్పీకర్ గా చేశారు. అలాగే కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో గృహ, బలహీన వర్గాల మంత్రిగా సేవలందించారు. 2015-2021 మధ్య టీపీసీసీ అధ్యక్షుడిగా కూడా ఉత్తమ్ కుమార్ పని చేశారు. తెలంగాణ ఇచ్చిన పదేళ్ల తర్వాత తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే సీనియర్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన సేవను పార్టీ సైతం మర్చిపోలేదు. అందుకే పార్టీలో ఉన్న ఒక సీనియర్ నేతను మంత్రి పదవితో గౌరవించింది. ఒక పైలట్ గా దేశానికి సేవలందించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.. దాదాపు 3 దశాబ్దాలుగా అంతే బాధ్యతగా ప్రజాసేవకు అంకితమయ్యారు. మరి.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మీ శుభాకాంక్షలను కామెంట్స్ రూపంలో తెలిజేయండి.