గుండెపోటు అనే పదం ఇప్పుడు అందరినీ కలవర పెడుతోంది. ఎందుకంటే వయసుతో సంబంధం లేకుండా ఎంతో మంది గుండెపోటుతో మరణిస్తున్నారు. గతంలో అంటే ఒబేసిటీ, వయసు మీద పడిన వారికి మాత్రమే గుండెపోటు వస్తుండేది. కానీ, ఇప్పుడు అలా లేదు. కుర్రాళ్లు.. బాగా ఫిట్ గా ఉన్న వాళ్లకు కూడా గుండెపోటు వస్తోంది. అలా గుండెపోటుతో కాంగ్రెస్ లీడర్ కుమారుడు చాలా చిన్న యవసులోనే మరణించడం అందరినీ కలచి వస్తోంది.
కాంగ్రెస్ నేత, మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ మానుకొండ రాధా కిషోర్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కుమారుడు శ్రీధర్(31) గుండెపోటుతో మరణించారు. ఇవాళ(సోమవారం) జిమ్ కి వెళ్లొచ్చిన తర్వాత ఛాతిలో నొప్పిగా ఉన్నట్లు శ్రీధర్ తెలిపాడు. అలా చెప్పగానే కాసేపటికే శ్రీధర్ కుప్పకూలాడు. హుటాహుటిన కుటుంబ సభ్యులు శ్రీధర్ ను ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే శ్రీధర్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కుమారుడు అకాల మరణంతో రాధా కిషోర్ కుటుంబ సభ్యులు కుంగి పోయారు.
ఆదివారం ఉదయమే శ్రీధర్ కుమారుడి బారసాల కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి రేణుకా చౌదరి కూడా హాజరయ్యారు. తర్వాతి రోజే శ్రీధర్ ఆకస్మకి మరణంతో కుటుంబంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి. ఆదివారం ఖమ్మం నగరం అల్లీపురంలో గరికపాటి నాగరాజు అనే యువకుడు గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. రెండ్రోజుల వ్యవధిలో ఇద్దరు యువకులు గుండెపోటుతో మరణించడం స్థానికులను కలచి వేస్తోంది.