iDreamPost
android-app
ios-app

సంగం బ్యారేజీకి గౌతమ్‌ పేరు – సీఎం జగన్‌

సంగం బ్యారేజీకి గౌతమ్‌ పేరు – సీఎం జగన్‌

దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డికి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఘన నివాళి అర్పించింది. ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయిన వెంటనే గౌతమ్‌ మృతికి సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం పలువురు సభ్యులు, సీఎం జగన్‌ మంత్రి గౌతమ్‌ మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్‌ రెడ్డిని తలుచుకుంటూ సీఎం జగన్‌ ఉద్వేగానికి లోనయ్యారు. గౌతమ్‌ కన్న కలలను తాను సాకారం చేస్తానని, తన ప్రాంతం అభివృద్ధి కావాలనే ఆకాంక్షను తాను నెరవేరుస్తానని సీఎం జగన్‌ చెప్పారు. అంతేకాదు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా గౌతమ్‌ రెడ్డి పేరును సంగం బ్యారేజీకి పెడతామని సీఎం జగన్‌ ప్రకటించారు. మరో ఆరువారాల్లో బ్యారేజీ పనులు పూర్తి చేస్తామని, ప్రారంభం రోజున మేకపాటి గౌతమ్‌ సంగం బ్యారేజీగా నామకరణం చేస్తామని సీఎం జగన్‌ చెప్పారు.

‘‘ నా సహచరుడు, మిత్రుడు మేకపాటి గౌతమ్‌ రెడ్డి ఇక్కడ లేడు అని ఊహించుకోలేకపోతున్నాం. గౌతమ్‌ రెడ్డి లేకపోవడం రాష్ట్రానికి తీరని నష్టం. గౌతమ్‌ నాకు చిన్ననాటి నుంచి స్నేహితుడు. స్నేహమే కాదు.. నా కన్నా వయస్సులో ఒక ఏడాది పెద్దవాడు. అయినా నన్ను అన్నలా భావించాడు. నేను చెప్పేది తప్పకుండా ఆచరించేవాడు. నాకు ఏది మంచిదో అదే చేసేవాడు. అలాంటి గౌతమ్‌ లేడు అంటే జీర్ణించుకోలేకపోతున్నా.

లండన్‌లోని మాంచెస్టర్‌ యూనివర్సిటీలో మంచి చదువులు చదివాడు. రాజకీయాల్లోకి వచ్చాడు. నేను కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చినప్పుడు గౌతమ్‌ తండ్రి మేకపాటి రాజమోహన్‌ రెడ్డి నాతో ఉన్నారు. బహుశా నేను ఈ స్థాయికి వస్తానని ఎక్కువ మంది నమ్మలేదు. కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చిన సందర్భంలో నన్ను నమ్మిన అతి తక్కువ మంది నాతో ఉన్నారు. అందులో గౌతమ్‌ ఒకరు. గౌతమ్‌ ద్వారా రాజమోహన్‌ రెడ్డి నాతో ఉన్నారు. నేను లక్ష్యం సాధించగలననే నమ్మకం ఉండబట్టే.. గౌతమ్, వారి కుటుంబం నా వెంట నడిచింది. రెండుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు. ఆరు శాఖలకు మంత్రిగా పని చేశారు. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాడు. ఈ మధ్యకాలంలో దుబాయ్‌ ఎక్స్‌పోకు వెళ్లే ముందు కలిశాడు. ఆల్‌దిబెస్ట్‌ చెప్పాను. అక్కడ చేసిన పనిని ప్రతిరోజు సీఎంవో ద్వారా నాకు పంపాడు.

దిలీప్‌ స్వింఘ్వీ, ఆదిత్యా బిర్లా, బజాంక, బంగర్ల్, అదానీల పేర్లను పేపర్లలో చదివేవాళ్లం. కానీ మన ప్రభుత్వం వచ్చాక వీరు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నారు. వారితో నేరుగా భేటీ అయి, వారిలో నమ్మకం కలిగేలా చేయడం, నా వద్దకు పంపడం.. ఇలా పరిశ్రమలు రావడంతో గౌతమ్‌ కృషి ఎనలేనిది. గౌతమ్‌ లేకపోవడం బాధాకరం. గౌతమ్‌ లేకపోయినా తన కల, తన ప్రాంతం అభివృద్ధి చెందాలనే ఆకాంక్షను నేను నెరవేరుస్తాను.

రాజమోహన్‌ రెడ్డి అన్న కోరినట్లుగా ఉదయగిరిలోని మెరిట్స్‌ కాలేజీకి గౌతమ్‌ పేరు పెట్టి, అగ్రికల్చర్, హార్టికల్చర్‌ కాలేజీగా మారుస్తాం. వెలిగొండ పరిధిలోకి ఉదయగిరి ప్రాంతాన్ని ఫేజ్‌ 1లోకి తీసుకువస్తాం. వెలిగొండ ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తాం. ఉదయగిరిలోని డిగ్రీ కాలేజీలో వసతులు మెరుగుపరుస్తాం. నాడు–నేడు ఫేజ్‌ 2లో కాలేజీకి మెరుగులు దిద్దుతాం.

ఇవి మాత్రమే కాదు.. గౌతమ్‌ను జిల్లా ప్రజలకు చిరస్థాయిగా గుర్తుకు ఉండేలా చేస్తాం. సంగం బ్యారేజీ పనులు మరో ఆరువారాల్లో పూర్తవుతాయి. ఆ ప్రాజెక్టుకు గౌతమ్‌ పేరు పెడతాం. మేకపాటి గౌతమ్‌ సంగం బ్యారేజీగా నామకరణం చేస్తాం. తాను ఎక్కడ ఉన్నా.. మంచి వాడు కాబట్టి పై లోకంలో దేవుడు కూడా మంచిగా చూస్తాడు. దేవుడి ఆశీస్సులు గౌతమ్‌ కుటుంబానికి ఉండాలని కోరుకుంటున్నాను. గౌతమ్‌ కుటుంబానికి తానేకాదు వైసీపీలోని ప్రతి కుటుంబసభ్యుడు అండగా ఉంటారు. గౌతమ్‌ కుటుంబానికి మంచి జరగాలని కోరుకుంటూ..’’ సీఎం జగన్‌ తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు.

సభ్యులు, సీఎం జగన్‌ మాట్లాడిన తర్వాత.. స్పీకర్‌ తమ్మినేని సీతారాం గౌతమ్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత తీర్మానం ప్రవేశపెట్టారు. రెండు నిమిషాలు మౌనం పాటించిన తర్వాత.. సభను గురువారానికి వాయిదా వేశారు.