HYDRA: అక్రమ నిర్మాణం.. ప్రభుత్వంలో ఉన్న వారిదైనా కూల్చడమే: CM రేవంత్

CM Revanth Reddy- HYDRA: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ మహా నగరంలో ఎలాంటి అక్రమ నిర్మాణాలు ఉన్నా.. ఆ నిర్మాణాలు ఎవరికి చెందినవి అయినా కూల్చేయడమే అంటూ స్పష్టం చేశారు.

CM Revanth Reddy- HYDRA: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ మహా నగరంలో ఎలాంటి అక్రమ నిర్మాణాలు ఉన్నా.. ఆ నిర్మాణాలు ఎవరికి చెందినవి అయినా కూల్చేయడమే అంటూ స్పష్టం చేశారు.

అక్రమ నిర్మాణాలు, హైడ్రా.. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలే కాదు దేశవ్యాప్తంగా ఈ రెండే హాట్ టాపిక్ గా మారాయి. హైదరాబాద్ లోని చెరువులు, నాలాలు, బఫర్ జోన్ లో ఎలాంటి అక్రమ నిర్మాణాలు, కబ్జాలు చేసిన నిర్మించిన భవనాలు ఉన్నా కూడా హైడ్రా కూల్చేస్తోంది. అయితే ఈ చర్యలపై పలు విమర్శలు కూడా వస్తున్నాయి. కక్ష సాధింపు చర్యలుగా ఈ పనులు చేస్తున్నారని.. చట్ట విరుద్ధంగా కూల్చివేతలు చేపడుతున్నారు అంటూ హైడ్రా కార్యకలాపాలపై పెద్దల నుంచి విమర్శలు వస్తున్నాయి. అలాగే ప్రభుత్వంలో ఉన్న వారికి చెందిన భవనాలు ఉంటే కూలుస్తారా? అనే ప్రశ్నలు కూడా వేస్తున్నారు. వాటన్నింటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా సమాధానం చెప్పారు. అక్రమ నిర్మాణం ఎవరిదైనా కూడా కూల్చేస్తామని మరోసారి స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. “భవిష్యత్ తరాలకు ప్రకృతిని అందిచాల్సిన బాధ్యత మన మీద ఉంది. నేను అక్రమ నిర్మాణాలను వదిలేస్తే ప్రజా ప్రతినిధిగా విఫలమైనట్లే. హైదరాబాద్ ను రక్షించుకోవాల్సిన మన అందరి మీదా ఉంది. మీరు ఉత్తరాఖండ్, చెన్నై, వయనాడ్ లో ఏం జరిగిందో చూశారు. అందుకే ఈ అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని నిర్ణయించుకున్నాం. అందుకోసమే హైడ్రాని ఏర్పాటు చేశాం. ఈ అక్రమ నిర్మాణాల కూల్చివేత పనులు భవిష్యత్ తరాల కోసం చేపట్టాం. హైదరాబాద్ మహానగరం లేక్ సిటీ. ఉస్మాన్ సాగర్, గండిపేట చెరువులు హైదరాబాద్ వాసుల దాహార్తిని తీరుస్తున్నాయి. అలాంటి చెరువులను ఆక్రమించి కొందరు పెద్దలు ఫామ్ హౌస్ లు నిర్మించుకున్నారు. ఇంకొంత మంది ధనవంతులు వాటి పక్కనే ఫామ్ హౌస్ లు ఏర్పాటు చేసుకున్నారు.

అంతేకాకుండా.. ఆ డ్రైనేజీని చెరువుల్లో కలుపుతున్నారు. గండిపేట పక్కనే ఉన్న ఫామ్ హౌస్ ల నాలాలు అన్నీ గండిపేటలో కలుపారు. ఈ అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు అందరూ సహకరించాలని కోరుతున్నాను. రాజకీయం కోసమో, కక్ష సాధింపుల చర్యల్లో భాగంగానే మేము ఈ కూల్చివేతల పర్వం మొదలు పెట్టలేదు. ఎంత ఒత్తిడి వచ్చినా కూడా హైడ్రా తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఈ అక్రమ నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వాలను ప్రభావితం చేసే వాళ్లు కూడా ఉన్నారు. సమాజాన్ని ప్రభావితం చేసే వాళ్లు ఉన్నారు. ప్రభుత్వంలో ప్రత్యక్షంగా భాగస్వాములు అయిన వాళ్లు కూడా ఉండొచ్చు. అయినా అదేం నేను పట్టించుకోను. అక్రమ నిర్మాణం ఎవరిదైనా కూల్చేయడమే. ఈ ఆక్రమణదారుల నుంచి చెరువులకు విముక్తి కల్పిస్తాం” అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. హైడ్రాకి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments