Idream media
Idream media
పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసి జాతికి అంకితం చేస్తామని సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పునరుద్ఘాటించారు. మంగళవారం శాసనసభలో పోలవరంపై జరిగిన స్వల్పకాలిక చర్చలో సీఎం జగన్ మాట్లాడారు. ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరు, నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యలు, గత ప్రభుత్వ నిర్వాకాన్ని సీఎం జగన్ వివరించారు. టీడీపీ, ఆ పార్టీ అనుకూల మీడియా ప్రాజెక్టుపై చేస్తున్న దుష్ప్రచారాన్ని జగన్ ఖండించారు. చంద్రబాబు ఎత్తు తగ్గుతారేమో గానీ.. ప్రాజెక్టు ఎత్తు తగ్గదని స్పష్టం చేశారు. ప్రాజెక్టు పూర్తిచేసి అక్కడ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని చెప్పారు.
” చంద్రబాబు పాలనలో స్పిల్‌వే కాంక్రీట్ శంకుస్థాపన, ఐకానిక్ బ్రిడ్జ్ అండ్ కాపర్ డ్యామ్ పనుల పేరిట మరో శంకుస్థాపన, పునాది అయిపోయిందని ఇంకో శంకుస్థాపన, స్పిల్‌వేలో గేట్లకు సంబంధించిన పనులకు సంబంధించిన ఓ శంకుస్థాపన..ఇలా అవసరం లేని శంకుస్థాపనలతో కోట్ల ప్రజాధనం వృధా చేశారు. గేట్లకు సంబంధించిన.. స్పిల్‌వేలో గ్యాలరీ వాక్ అంటూ కుటుంబసభ్యులతో ఫ్యామిలీటూర్ చేసి, తద్వారా పోలవరం పనులు పూర్తయ్యాయనే భ్రమను జనాల్లో కలిగించే ప్రయత్నం చేశారు. ఎన్నికలకు ముందు ప్రజలను మభ్యపెట్టాలనే ఉద్దేశంతో.. రూ.100 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి బస్సుల్లో జనాలను పోలవరం తరలించారు. ‘జయము జయము చంద్రన్న’ పాటతో ప్రత్యేకంగా భజన సైతం చేయించుకున్నారు. (ఆ సమయంలో జయము జయము చంద్రన్న పాట ప్లే కాగా.. సభ మొత్తం నవ్వులు పూశాయి.)
కమీషన్ల కోసం కక్కుర్తి పడే ప్రాజెక్టును చంద్రబాబు తన చేతుల్లోకి తీసుకున్నారు. ప్రత్యేకహోదాను తాకుట్టుపెట్టి పోలవరం ప్రాజెక్టును తీసుకున్నారు. 2013-2014 అంచనాల ప్రకారమే ప్రాజెక్టు కడతామని చెప్పారు. దీనిపై ప్రశ్నిస్తే అప్పట్లో అసెంబ్లీలో నా గొంతు నొక్కారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు. ఇప్పుడు చేస్తున్న కుట్రలకు వచ్చే ఎన్నికల్లో కుప్పంలోనూ బాబుకు ఓటమి తప్పదు. వక్రీకరణ, అబద్దాలపై ఆధారపడి రాజకీయాలు చేస్తున్నారు. తాను విజనరి అని చెప్పుకునే చంద్రబాబు వల్లే ప్రాజెక్టుకు కష్టాలు వచ్చాయి.
ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నామని చంద్రబాబుకు ఎవరు చెప్పారు? పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేసింది. రామోజీరావు.. రామోజీరావు.. నేను మోడీని మాట్లాడుతున్నానూ.. పోలవరం ఎత్తు తగ్గిస్తున్నాను.. అని చెప్పినట్లుగా, రాథాకృష్ణ, రాథాకృష్ణ నేను షెకావత్‌ను మాట్లాడుతున్నానూ.. పోలవరం ఎత్తు తగ్గిస్తున్నానూ.. అని చెప్పినట్లుగా వీరు రాస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు ఒక్క ఇంచు కూడా తగ్గించం.
పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే పూర్తి చేయకుండానే కాఫర్ డ్యామ్ కట్టారు. మధ్యలో మూడు పెద్ద ఖాళీలు వదిలిపెట్టారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఆర్థిక నష్టంతో పాటు నిర్మాణంలో విపరీతమైన జాప్యం జరిగింది. దిగువ కాపర్‌డ్యామ్‌కు కూడా భారీ నష్టం వాటిల్లింది. పునాదిపైన, లోపల కలిపి 35.6 మీటర్ల మేర గుంట ఏర్పడింది. చంద్రబాబు తప్పిదాలతోనే పోలవరానికి ఈ పరిస్థితి వచ్చింది.
పోలవరం టూర్ పేరుతో రూ.100 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారు. పోలవరం వద్ద తన అనుచరులతో చంద్రబాబు భజన చేయించుకున్నారు. 2023 ఖరీఫ్ కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం. ఉక్కు సంకల్పంతో పోలవరం నిర్మాణం చేపడుతున్నాం. కేంద్రం సహకారంతో ఆర్‌అండ్‌ఆర్ పనులు వేగంగా పూర్తి చేస్తాం. ప్రాజెక్టు పనులు నా తండ్రి వైఎస్సార్ ప్రారంభించారు. ఆయన వారసుడిగా కచ్చితంగా ప్రాజెక్టును తాను పూర్తి చేస్తాను. ప్రాజెక్టు వద్ద వైఎస్సార్ విగ్రహం ఏర్పాటు చేస్తాం. ప్రాజెక్టును వైఎస్సార్‌కు అంకితం చేస్తానని సీఎం వైఎస్ జగన్ తెలిపారు.