iDreamPost
android-app
ios-app

వరద బాధితులకు CM జగన్ భరోసా.. నెలలోపే పంట నష్ట సాయం!

వరద బాధితులకు CM జగన్ భరోసా.. నెలలోపే పంట నష్ట సాయం!

కోనసీమ జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన రెండోరోజు కొనసాగుతోంది. ఈ పర్యటనలో సీఎం జగన్ వరద బాధితులతో మమేకమవుతున్నారు. వరదల వల్ల వారికి కలిగిన నష్టం.. వారికి ప్రభుత్వం నుంచి అందుతున్న సాయం గురించి నేరుగా ప్రజలనే అడిగి తెలుసుకుంటున్నారు. ప్రభుత్వం స్పందించిన తీరు, వారికి అందుతున్న సాయం పట్ల కోనసీమ జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒక బిడ్డలాగా వారిని సీఎం జగన్ ఆదుకున్నారంటూ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వరద నష్టం సాయం, వరద ముంపు నుంచి నియంత్రణకు సంబంధించిన చర్యల గురించి ప్రస్తావించారు.

రైతులకు ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే.. అదే సీజన్‌లో పరిహారం ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మనది అంటూ సీఎం జగన్ పేర్కొన్నారు. గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండ్రోజుల పర్యటనలో భాగంగా సీఎం జగన్‌ కోనసీమ జిల్లాలో పర్యటిస్తున్నారు. గురజపులంక, కూనలంక గ్రామాల్లో వరద బాధితులను సీఎం జ‌గ‌న్  పరామర్శించారు. “గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా మీరు గమనించాలి. గతంలో పేపర్లో ఫొటోలు వస్తే చాలు అనుకునేవారు.. కానీ ఇప్పుడు ఇలా కాదు, వరద బాధితులకు సాయం అందించేందుకు జిల్లా కలక్టర్లకు కేవలం వారం రోజులే సమయం ఇచ్చాం. ఆ సమయంలోగా అందరికీ సాయం అందాలని స్పష్టం చేశాం. నేనే స్వయంగా వారిని కలుస్తానని చెప్పాను. రెండ్రోజులుగా వరద బాధితులతో మాట్లాడుతున్నాను” అంటూ సీఎం వ్యాఖ్యానించారు.

RBK రికార్డుల్లో రైతుల వివరాలు:

“పేదలకు సహాయం అందించే విషయంలో వెనుకడుగు వేయకూడదని, తక్కువ డ్యామేజీ జరిగినా రూ.10 వేలు ఇవ్వాల్సిందేన‌ని క‌లెక్ట‌ర్ల‌ను ఆదేశించాను. ప్రతి గ్రామంలో విలేజీ క్లినిక్‌తో ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందిస్తున్నాం. పేరు, విస్తీర్ణం, పంట నష్టం వివరాలు ఆర్‌బీకేల్లో పొందుపరుస్తాం. మీరు ఆర్బీకే సెంటర్ కు వెళ్లండి. మీ పేరు చెక్ చేసుకోండి. ఏదైనా పొరపాటు జరిగి.. మీ పేరు అందులో లేకపోతే ఫిర్యాదు చేయండి. మళ్లీ రీవెరిఫై చేసి మీ పేరును ఆ లిస్ట్ లో చేరుస్తారు” అంటూ ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు.

150 కోట్ల‌తో రక్షణ గోడ:

ఈ గ్రామాల్లో సరైన రక్షణ గోడ లేకపోవడం వల్ల కోతకు గురౌతోందని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ఈ విషయంపై కలెక్టర్లతో చర్చించానన్నారు. లంక గ్రామాల ప్రజలను వ‌ర‌ద ముప్పు నుంచి ర‌క్షించేందుకు రూ.150 కోట్ల‌తో రివెట్‌మెంట్ వాల్ నిర్మాణం చేప‌డుతున్న‌ట్లు సీఎం జ‌గ‌న్ వెల్లడించారు. వెంట‌నే ప్ర‌తిపాద‌న‌లు రూపొందించాల‌ని ఇంజినీర్ల‌ను ఆదేశించారు. గ‌త ప్ర‌భుత్వానికి ఈ ప్ర‌భుత్వానికి వ్యత్యాసం గ‌మ‌నించాలని ముఖ్యమంత్రి జగన్ కోరారు. ఈ నాలుగేళ్ల‌లో ఇలాంటి ఏ ఘ‌ట‌న జ‌రిగినా.. క‌లెక్ట‌ర్‌కు ఆదేశాలు ఇచ్చి వారి చేతుల్లో డ‌బ్బులు పెట్టామన్నారు. గ‌తంలో లేని  గ్రామ స‌చివాల‌య‌, వాలంటీర్ వ్య‌వ‌స్థ‌ను గ్రామ స్థాయిలోకి తీసుకువ‌చ్చామని అన్నారు. క‌లెక్ట‌ర్ల‌కు, అధికారుల‌కు స‌మ‌యం ఇచ్చి ప్ర‌తి గ్రామంలో యాక్టివేట్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. “న‌ష్ట‌పోయిన ఏ ఒక్క‌రు మిగిలి పోకూడ‌దు, నాకు స‌హాయం అందలేద‌న్న మాట రాకూడ‌దు. గ్రామాల్లో ఏ ఒక్క‌రూ కూడా మా క‌లెక్ట‌ర్ స‌రిగ్గా ప‌ని చేయ‌లేద‌న్న మాట విన‌ప‌డ‌కూడ‌ద‌ని చెప్పాను. ఇప్పుడు ఏ గ్రామానికి వెళ్లినా మాకు స‌హాయం అందింది.. నిత్యావ‌స‌రాలు అందించార‌ని.. అధికారులు బాగా ప‌ని చేస్తున్నార‌ని చెబుతున్నారు” అంటూ సీఎం జ‌గ‌న్ చెప్పారు.