iDreamPost
android-app
ios-app

వారు చేసేది వ్యాపారం కాదు.. సమాజసేవ : సీఎం జగన్‌

వారు చేసేది వ్యాపారం కాదు.. సమాజసేవ : సీఎం జగన్‌

తోపుడు బండ్లు, రోడ్ల పక్కన, సైకిళ్లు, మోటారు సైకిళ్లపై పండ్లు, కూరగాయలు, టీ, టిఫిన్లు విక్రయిస్తూ తమకు తాము ఉపాధి పొందుతున్న చిరు వ్యాపారులు చేసేది వ్యాపారం కాదని, సమాజ సేవ అని సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి అభివర్ణించారు. ఈ రోజు చిరు వ్యాపారులకు వడ్డీ లేMýంండా పది వేల చొప్పన రుణం ఇచ్చే జగనన్న తోడు పథకం మూడో విడతను సీఎం జగన్‌ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. బటన్‌ నొక్కి 5.10 లక్షల మంది ఖాతాల్లో పది వేల రూపాయల చొప్పన జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ ఈ పథకం పూర్వాపరాలను వివరించారు.

‘‘ పెద్ద ఆదాయాలు వచ్చే వ్యాపారాలు కాదు. కానీ తమకు తాము ఉపాధిని కల్పించుకుంటూ నామమాత్రపు ధరలకు వ్యాపారం చేయడం గొప్ప విషయం. ఇది వ్యాపారం అనడం సరికాదు.. గొప్ప సేవ అని చెప్పవచ్చు. వస్తువులు, కూరగాయలు, పండ్లు, టీ, టిఫిన్లను తోపుడు బండ్లపై, రోడ్డు పక్కన, ఇళ్ల సమీపంలో విక్రయించడం, సైకిళ్లు, మోటారు సైకిళ్లపై అమ్ముతూ లక్షల మంది స్వయం ఉపాధి పొందుతున్నారు. ఇలాంటి వారందరూ స్వయం ఉపాధి పొందుతూ వాళ్ల కాళ్లపై వారు నిలబడేందుకు జగనన్న తోడు పథకం ఉపయోగపడుతోంది. వీరు స్వయం ఉపాధి పొందడమే కాదు.. వీరి ద్వారా ఆటోలు, ఇతర రవాణా వాహనాలు నడుపుకునే వారికి, మూటలు ఎత్తేవారికి ఉపాధి లభిస్తోంది.

వీరి జీవితాలను చాలా దగ్గర నుంచి చూశాను. వీరందరూ ఆర్గనైజ్డ్‌ సెక్టార్‌గా లేకపోవడంతో బ్యాంకుల్లో రుణాలు పుట్టని పరిస్థితి. వీరి పరిస్థితి, అవసరాలు, కష్టాలను నా పాదయాత్రలో దగ్గరగా చూశాను. వీరికి అండగా ఉండాలి, మంచి జరగాలి అనే ఆలోచన నుంచే జగనన్న తోడు పథకం పుట్టింది. వీరికి బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించేందుకు ప్రభుత్వం పూచికత్తుగా ఉంటుంది, రుణాలపై వడ్డీ మొత్తాన్ని భరిస్తామని బ్యాంకులకు చెప్పాము. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఐదు లక్షల మందికి, మొత్తంగా మూడు విడతల్లో 14 లక్షల మందికి మేలు జరిగింది.

వీరు హోల్‌సేల్‌గా వస్తువులు కొంటారు. పెట్టుబడి కోసం పది రూపాయల వడ్డీకి వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు తీసుకుంటారు. ఇలాంటి అధ్వాన్నమైన పరిస్థితిలో ఉన్న వీరందరికీ మంచి చేయాలని ఈ పథకానికి శ్రీకారం చుట్టాం. వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ.. బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పిస్తున్నాం. ఆరు నెలలకు ఒకసారి వడ్డీ తిరిగి చెల్లిస్తున్నాం. గత ఆరు నెలలకు గాను 16.16 కోట్ల రూపాయలు ఈ రోజు జమ చేస్తున్నాం. మొత్తంగా ఇప్పటి వరకు 32 కోట్ల రూపాయలు వడ్డీని చెల్లించాం.

రుణాలు తీసుకునే వారందరికీ నా విజ్ఞప్తి. రుణాలు సకాలంలో చెల్లించండి. మళ్లీ రుణాలు బ్యాంకులు ఇస్తాయి. వడ్డీని మేము చెల్లిస్తాం. కానీ కట్టకపోతే మాత్రం బ్యాంకులు వెనుకడుగువేస్తాం. ఇంకా లబ్ధిదారులకు మంచి జరిగే అవకాశం పోతుంది. మీ అన్నగా, తమ్ముడుగా.. తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించాలని కోరుతున్నాను.

జగనన్న తోడు పథకం కింద లబ్ధిపొందుతున్న 14.16 లక్షల మందికి.. ఖచ్చితంగా జగనన్న అమ్మ ఒడి, వైఎస్సార్‌ ఆసరా, వెఎస్సార్‌ చేయూత, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా దీవెన, ఇళ్ల పట్టాలు, ఫించన్‌ పథకాల్లో కనీసం మూడు, నాలుగు పథకాలు అంది ఉంటాయి. వీటి వల్ల వారి జీవితాలు మారాలనే ఈ పథకాలను అమలు చేస్తున్నాం. నిరుపేదలైన చిరు వ్యాపారులకు మాత్రమే కాకుండా.. సాంప్రదాయమైన చేతి వృత్తుల ద్వారా బతికేవారిని కూడా జగనన్న తోడు పథకంలోకి తీసుకువచ్చాం. వీరిందరికీ కూడా మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నాను.

ఈ రోజు ఎవరికైనా పొరపాటున రాకపోయి ఉంటే ఖంగారుపడాల్సిన పని లేదు. మన ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ మంచి చేయాలనే లక్ష్యంతో ఉంది. ఎవరికైనా రాకపోతే వాలంటీర్‌ను లేదా గ్రామ, వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోండి.

కోవిడ్‌ కారణంగా దేశంలో వ్యాపారం లేక 82 శాతం చిరు వ్యాపారులు ఇబ్బందులు పడ్డారని సర్వే చెబుతోంది. అలాంటి అవస్థల నుంచి మన రాష్ట్రంలోని చిరు వ్యాపారులను, పేదలను ఆదుకునేందుకు మన ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ఏకంగా 1.29 లక్షల కోట్ల రూపాయలను ఎలాంటి వివక్ష, లంచాలకు తావులేకుండా అందించాం..’’ అని సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి వివరించారు.