iDreamPost
android-app
ios-app

2025 ఆగస్టు నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామన్న CM జగన్!

2025 ఆగస్టు నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామన్న CM జగన్!

గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం, ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం గొమ్ముగూడెంలో వరద బాధితులను పరామర్శించారు. ఒక్క కూనవరంలోనే సీఎం జగన్ 4.20 గంటలపాటు గడిపారు. అక్కడి వారికి వరద సహాయం అందిన తీరుపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఎవరికైనా సహాయం అందకపోతే నేరుగా వచ్చి చెప్పాలంటూ సీఎం కోరారు. ప్రభుత్వం ఆదుకున్న తీరుపై బాధితుల హర్షం వ్యక్తం చేశారు. ఈ సభల్లోనే సీఎం జగన్ పోలవరం ప్రాజెక్టు గురించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరాన్ని 2025 ఆగస్టు కల్లా పూర్తి చేస్తామని చెప్పారు.

“నేను అనుకున్నంత వేగంగా చేయలేకపోయిన పని ఒకటుంది. అది ఆర్‌ అండ్‌ ఆర్‌ ఇప్పించడం. అది నా చేతుల్లో ఉండే పని కాదు కాబట్టి నేను కూడా కష్టపడాల్సి వస్తోంది. 3 సంవత్సరాల్లో పూర్తి డ్యామ్‌ను నింపుతారు. 3 ఫేజ్‌లలో డ్యామ్‌ను ఫస్ట్‌ ఇంత, తర్వాత ఇంత, ఆ తర్వాత ఇంత అని మూడేళ్లలో మూడు ఫేజ్‌లలో నింపుకుంటూ పోవాలి. అప్పుడే డ్యామ్‌ పటిష్టంగా నిలబడుతుంది. చిన్నచిన్న రిపేర్లు ఏవైనా ఉంటే కూడా తెలిసిపోతుంది. సీడబ్ల్యూసీ నార్మ్స్ కి తగ్గట్టుగానే 41.15 మీటర్లకు సంబంధించి మొట్ట మొదటగా ఫస్ట్‌ నీళ్లు నింపే కార్యక్రమం చేస్తారు. మనం ఈ 41.15 నింపితే కటాఫ్‌ అయిపోయే ఊర్లు, కటాఫ్‌ అయిపోయే గ్రామాలు కూడా ఇంకా ఉంటాయి. ఆ గ్రామాలను కూడా ఫస్ట్‌ ఫేజ్‌లోనే తీసుకొని రాకపోతే ఆ ఊర్లకు పోవడానికి ఇబ్బంది అవుతుంది. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి మనం లిడార్‌ సర్వే చేయించి మళ్లీ 48 హ్యాబిటేషన్స్‌ను, 32 గ్రామాల్లో 48 హ్యాబిటేషన్స్‌ను మళ్లీ యాడ్‌ చేయించాం.

దీనికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం కోసం కిందా మీదా పడుతున్నాం. అసలు ఇదంతా ఎందుకు స్టార్ట్‌ అయిందంటే.. గత ప్రభుత్వం 2013-2014 రేట్లతోనే ప్రాజెక్టును పూర్తి చేస్తామంటూ అండర్‌ టేకింగ్‌ ఇచ్చింది. వాళ్లు ఇచ్చిన అండర్ టేకింగ్ చూపిస్తూ మేం ఇంతకు మించి డబ్బు ఇవ్వమంటూ కేంద్రం చెప్పడం ప్రారంభించింది. 2013-14 రేట్ల ప్రకారం ప్రాజెక్టు పూర్తి చేయాలంటే ఎలా చేయగలుగుతాం? ఎల్‌ఏ మారుతుంది, ఆర్‌అండ్‌ఆర్‌ మారుతుంది. కన్‌స్ట్రక్షన్‌ కాస్ట్‌ మారుతుంది. ఆ రేట్లతోనే పూర్తి చేయగలుగుతాము అని వాళ్లెవరో అడగడం ఏంటి? మీరేదో దాన్ని ఒప్పుకోవడం ఏంటి? 2022లో మేం అంతకన్నా డబ్బులు ఇవ్వము అని చెప్పడం ఏంటి? కరెక్టా మీరు చేసేది అని.. కేంద్రాన్ని గట్టిగా నిలదీస్తూ.. వారికి అర్థమయ్యేట్లుగా చెప్పాం.

CM Jagan about polavaram project

ఈ నేపథ్యంలోనే వాళ్లలో కూడా కొంత కదలిక వచ్చింది. సానుకూల వాతావరణం ఏర్పడింది. ఇప్పుడు ఉన్న రేట్లకు మళ్లీ రివైజ్‌ చేసి.. పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసే కార్యక్రమం మొదలు పెట్టడానికి అడుగులు వేశాం. ప్రస్తుతం పోలవరం రివైజ్డ్ ఎస్టిమేషన్స్ జలశక్తి మినిస్ట్రీ.. కేబినెట్‌కు పెట్టాల్సి ఉంది. బహుశా దేవుడు ఆశీర్వదిస్తే ఈ నెలాఖరు కల్లా కేబినెట్‌కు ఈ ఎస్టిమేషన్స్ చేరుతాయి. కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపితే తొలి ప్రాధాన్యతా పనుల కోసం రూ.17 వేల కోట్లు మనకు ఇచ్చేందుకు కేంద్రం ముందుకొస్తుంది. ఆ నిధులతో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ముఖ్యమైన పనులన్నీ పూర్తవుతాయి. డ్యామ్‌ అంతా కూడా పూర్తి హైట్‌కు కంప్లీట్‌ అవుతుంది.

అలాగే 41.15 మీటర్ల వరకు నీళ్లు నింపడానికి వీలుంటుంది. అందుకు సంబంధించిన ఆర్‌అండర్‌ఆర్‌కు ఎంతమంది అయితే ఉంటారో వాళ్లందరికీ నగదు ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత సెకండ్‌ ఇయర్‌కి సెకండ్‌ ఫేజ్‌, థర్డ్‌ ఇయర్‌ లో థర్డ్‌ ఫేజ్‌. ఈ విషయంలో మనం రాజీ పడక తప్పదు. ఎందుకంటే ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం కడుతోంది. వాళ్లను ఒప్పించేందుకు కృషి చేస్తున్నాం. బహుశా జగనే కడితే మొదట మీకు ఇచ్చి, తర్వాత తర్వాత ప్రాజెక్టు గురించి ఆలోచన చేసేవాడినేమో. మనం రాక ముందు కేవలం 3 వేల కుటుంబాలను మాత్రమే తరలించారు. మనం వచ్చాక ఈ నాలుగేళ్లలోఇప్పటికే 12 వేల కుటుంబాలను షిప్ట్‌ చేశాం. మరో 8 వేల కుటుంబాలతో కలిపి.. మొత్తం 20 వేల కుటుంబాలను తరలిస్తున్నాం.

CM Jagan about polavaram project

ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన వారికి 5 లక్షల రూపాయలు ప్యాకేజీ ఇస్తాము అని చెప్పాం. లక్షన్నర అప్పట్లో ఇచ్చుంటే మరో రూ.3.5 లక్షలు ఇస్తాం. రూ.5 లక్షలు కనీసంగా వాళ్లకు వచ్చేలా చూస్తాం. ఇది కాక రెండోమాట కూడా నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు రూ.6.8 లక్షలు కేంద్ర ప్రభుత్వం ఈ ప్యాకేజీల కింద ఇస్తోంది. దాన్ని 10 లక్షలు చేస్తాం. దానికి సంబంధించి రూ.3.2 లక్షలుగా ఉన్న వ్యత్యాస మొత్తాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచే ఇస్తాం. ఈ మాటను కూడా రాష్ట్ర ప్రభుత్వం కచ్చితంగా చేసి తీరుతుంది. 41.15 లెవల్‌ లోకి నీళ్లు నింపే టైమ్‌ కల్లా కేంద్రం ఇవ్వాల్సింది కేంద్రం ఇస్తుంది. మనం ఇవ్వాల్సిన డబ్బు కూడా మనం ఇస్తాం. గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల ప్రాజెక్టు మనం అనుకున్నంత వేగంగా ముందుకు వెళ్లలేకపోయింది. ఇప్పుడు వీటన్నింటినీ అధిగమించి కొంచం గాడిలోపడింది. 2025 ఖరీఫ్‌ కల్లా కచ్చితంగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు కూడా పెట్టే పరిస్థితి వస్తుంది. 2025 జూలై, ఆగస్టులో 41.15 మీటర్లలో నీళ్లు పెట్టే పరిస్థితి కూడా దేవుని దయ వల్ల కచ్చితంగా ఏర్పడుతుంది” అంటూ ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించారు.