iDreamPost
iDreamPost
సంక్షేమానికి ఆద్యుడు ఎన్టీఆర్ అని, తెలుగు చరిత్ర చదవాలంటే టీడీపీ ఆవిర్భావానికి ముందు.. ఆవిర్భావం తర్వాత అని చదవాల్సిందేనని చెబుతున్న చంద్రబాబుకు ఎన్టీఆర్ గొప్పతనం ఇప్పుడు తెలుస్తోందా అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం ఆయా దేశాల్లో స్థిరపడిన టీడీపీ అభిమానులు, కార్యకర్తలను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. బాబు వ్యాఖ్యలు మరీ విడ్డూరంగా ఉన్నాయని ఎన్టీఆర్ అభిమానులు అంటున్నారు. తెలుగువాడి ఉనికిని దేశవ్యాప్తంగా చాటిన ఘనత ఎన్టీఆర్ ది. టీడీపీ స్థాపించక మునుపు తెలుగువారంటే మదరాసీలు అని అనుకొనేవారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి జాతీయ స్థాయిలో నేషనల్ ఫ్రంట్ ఛైర్మన్ గా కూడా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడంతో తెలుగు వారి గొప్పతనం గురించి దేశవ్యాప్తంగా తెలిసివచ్చింది.
పేదల పెన్నిధిగా కీర్తి..
ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వెంటనే ఎన్టీఆర్ మద్యపాన నిషేధం ఫైల్ పై సంతకం చేశారు. ఒక్క పూట గంజికైనా నోచుకోని పేదలకోసం చౌకధరల దుకాణాల ద్వారా కిలో రెండు రూపాయల బియ్యం. ఇతర నిత్యావసర వస్తువులు అందజేశారు. అన్నదాతల కోసం విద్యుత్తును హార్సు పవర్ కు రూ.50 చొప్పున పంపిణీ చేశారు. సొంత గూడు లేని బడుగు, బలహీన వర్గాల కోసం లక్షలాది ఇళ్లు కట్టించి ఇచ్చారు. ప్రజలకు మేలు చేయడం కోసం చిత్తశుద్ధితో సంక్షేమ పథకాలను అమలు చేశారు. ఆర్థికంగా ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా పేదలకు సంక్షేమ పథకాలు అందించడానికి వెనుకాడలేదు. అందుకే ఆయన పేదల పెన్నిధిగా కీర్తి గడించారు.
పరిపాలనలో సంస్కరణలు..
ప్రజలను ఇబ్బందులపాలు చేస్తున్న మున్సబు, కరణాల వ్యవస్థకు చరమగీతం పాడారు. తాలూకా వ్యవస్థ స్థానంలో మండల ప్రజాపరిషత్ లను తీసుకొచ్చి పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేశారు. పరిపాలనలో జవాబుదారీతనాన్ని పెంచారు.సాహసోపేతమైన నిర్ణయాలతో పాలనను కొత్తపుంతలు తొక్కించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న తన మంత్రివర్గ సహచరుడిని బర్తరఫ్ చేయడం కానీ,ఒకేసారి మొత్తం 31 మంత్రులు ఉన్న కేబినెట్ ను రద్దు చేయడం, ఆడపడుచులకు ఆస్థిలో వాటా ఇవ్వడం, బడుగు బలహీన వర్గాలను అధికారంలో భాగస్వాములను చేయడం వంటి నిర్ణయాలతో ఆయన తనకంటూ ఒక ముద్ర సాధించారు.
చేయాల్సిందంతా చేసి…
ఎన్టీఆర్ గొప్పతనం తెలుగు వారందరికీ సుపరిచితమే. వెంట ఉండి కూడా ఆయన ఔన్నత్యాన్ని గుర్తించనిది చంద్రబాబు నాయుడే. అందుకే దారుణంగా వెన్నుపోటు పొడిచి అధికారం కైవసం చేసుకున్నారు.ఎన్టీఆర్ ఆశయాలు, ఆలోచనలు తుంగలో తొక్కారు. పార్టీని జనానికి దూరం చేశారు. ఇప్పుడు ఓట్లు రాబట్టుకోవడం కోసం అందరికీ తెలిసిన ఎన్టీఆర్ గొప్పతనంపై బాబు ఉపన్యాసం ఇవ్వడమే వింతగా ఉందని అభిమానులు విమర్శిస్తున్నారు.తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో పుట్టిన, జనం నెత్తిన పెట్టుకొన్న టీడీపీకి అదే జనంలో విశ్వసనీయత లేకుండా చేసి ఇప్పడు పార్టీ గొప్పదనం గురించి చెప్పడం బాబుగారికే చెల్లిందని అంటున్నారు.