iDreamPost
iDreamPost
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నటించిన భీమ్లానాయక్ సినిమా విషయంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు ప్రభుత్వ ఉగ్రవాదాన్ని తలపిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేస్తున్న వ్యాఖ్యలను అధికారపార్టీ నేతలు తప్పు పడుతున్నారు. అభిమానుల బలహీనతను ఆసరాగా చేసుకొని విచ్చలవిడిగా సాగుతున్న సినిమా టికెట్ల బ్లాక్ మార్కెట్ దందాను అరికట్టడానికి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తుంటే చంద్రబాబు విచిత్రంగా స్పందిస్తున్నారని అంటున్నారు. శుక్రవారం ట్విట్టర్ వేదికగా బాబు స్పందిస్తూ భారతీ సిమెంట్ రేటుపై లేని నియంత్రణ ‘భీమ్లానాయక్’ సినిమాపై ఎందుకు? అని ప్రశ్నించారు. ప్రపంచస్థాయికి వెళ్లిన తెలుగు సినిమాను తెలుగు రాష్ట్రంలో జగన్ వేధిస్తున్నారని పేర్కొన్నారు. థియేటర్ల దగ్గర రెవెన్యూ ఉద్యోగులను కాపలా పెట్టిన ప్రభుత్వతీరు అభ్యంతరకరమన్నారు.
గతం మరచిపోయారా..
తెలుగు సినిమాను తెలుగు రాష్ట్రంలో జగన్ వేధిస్తున్నారని వ్యాఖ్యలు చేస్తున్న చంద్రబాబు ఒకసారి గతాన్ని గుర్తు చేసుకోవాలి. చంద్రబాబు ప్రభుత్వం రుద్రమదేవి సినిమా విషయంలో తమను ఎలా వేధించింది? ఆ చిత్ర దర్శకుడు గుణశేఖర్ చెప్పారు. గొప్ప చారిత్రక సినిమా అంటూ తన బావమరిది బాలకృష్ణ నటించిన ‘గౌతమిపుత్రశాతకర్ణి’ చిత్రానికి చంద్రబాబు సర్కారు రాయితీలు ఇచ్చింది. మరో చారిత్రక సినిమా రుద్రమదేవికి మాత్రం తిరస్కరించింది. మరి దీన్నేమంటారో? చంద్రబాబే సెలవివ్వాలి. జనసేనతో పొత్తు కోసం పరితపించి పోతున్న చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసమే ఇటువంటి వ్యాఖ్యలు చేసి పవన్ కల్యాణ్‌కు దగ్గరవ్వాలని చూస్తున్నారని వైఎస్సార్ సీపీ నేతలు అంటున్నారు. న్యాయమైన ధరలకే సామాన్యులకు వినోదం అందించడానికి ప్రభుత్వం యత్నిస్తుంటే పవన్‌ను వేధిస్తున్నట్టు కలర్ ఇవ్వడానికి చంద్రబాబు అండ్ కో ట్రై చేయడం దారుణం.
ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏడాదికి ఒకటో, రెండు సినిమాల్లో నటించే పవన్‌కల్యాణ్‌ను నియంత్రించడం కోసం కాదు. మొత్తంగా సినిమాపేరిట సామాన్యుడిని దోచుకోవడాన్ని అడ్డుకోవాలని. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ అయినా ప్రజల మేలుకోసం పనిచేయాలి. సినిమా టికెట్లు నిర్ణీతధరకు అమ్మకాలు సాగేలా ప్రభుత్వం చూస్తుంటే.. కాదు బ్లాక్ మార్కెట్ కొనసాగాలని ప్రతిపక్షం కోరుకోవడం ఏమిటి? నిర్దేశించిన ధరకు అమ్ముతున్నారా? లేదా? అని పరిశీలించడానికి అధికారులు థియేటర్లపై నిఘాపెడితే అది ప్రభుత్వ ఉగ్రవాదం అయిపోతుందా? అంటే ప్రభుత్వం జనాన్ని వారి ఖర్మానికి వారిని వదిలేయాలా? ఇదెక్కడి పద్ధతి?
పైగా మోకాలికి బోడిగుండుకు ముడిపెట్టినట్టు భారతీ సిమెంట్‌కు భీమ్లానాయక్‌కు సంబంధం ఏమిటి? భారతీ సిమెంట్‌ను ఏమైనా నిబంధనలకు విరుద్ధంగా బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్నారా? భారతీ సిమెంట్ అయినా, హెరిటేజ్ పాల వ్యాపారమైనా, సినిమా అయినా నిబంధనలకు విరుద్ధంగా జరిగితే ప్రభుత్వం ఊరుకోదు కదా? ఒకవేళ ప్రభుత్వం ఉపేక్షించినా నిలదీయడానికి అనేక వేదికలు ఉన్నాయిగా. ఇన్నేళ్ల రాజకీయ అనుభవాన్ని ప్రజా ప్రయోజనాలకు కాక ఒక సినిమాను ప్రమోట్ చేయడానికి వినియోగించడం శోచనీయమని అధికార పార్టీ నేతలు చంద్రబాబు వైఖరిని విమర్శిస్తున్నారు.