iDreamPost
android-app
ios-app

మరో వివాదంలో రాహుల్.. మహిళా ఎంపీలకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చారంటూ..!

మరో వివాదంలో రాహుల్.. మహిళా ఎంపీలకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చారంటూ..!

రాహుల్ గాంధీ ఇటీవలే ‘మోదీ ఇంటి పేరు’ పరువు నష్టం కేసులో ఊరట పొంది లోక్ సభలో తిరగి అడుగుపెట్టారు. అయితే అడుగుపెట్టి ఎంతోకాలం కాలేదు. మళ్లీ మరో వివాదంలో చిక్కుకునే సూచనలు కనిపిస్తున్నాయి. బుధవారం సభలో జరిగిన అవిశ్వాసం తీర్మానంలో రాహుల్ గాంధీ అధికార పార్టీపై నిప్పులు చెరిగారు. కానీ, చివర్లో ఒక వివాదంలో చిక్కుకున్నారు. సభ నుంచి వెళ్లబోతూ మహిళా ఎంపీలవైపు చూసి ఫ్లయింగ్ కిస్ ఇచ్చారని స్మృతి ఇరానీ ఆరోపణలు చేశారు. అంతేకాకుండా మహిళా ఎంపీలు సంతకాలు చేసిన స్పీకర్ కు ఫిర్యాదు కూడా చేశారు.

లోక్ సభలో అవిశ్వాస తీర్మానం చర్చ వాడీ వేడీగా సాగుతోంది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అధికార పార్టీపై మణిపూర్ విషయంలో నిప్పులు చెరిగారు. బీజేపీ వాళ్లు మణిపూర్ లో భరతమాతను హత్య చేశారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మీరంతా దేశ భక్తులు కాదు.. మీరంతా దేశాన్ని ప్రేమించే వాళ్లు కాదు.. మీరంతా దేశ ద్రోహులు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మణిపూర్ ని రెండుగా విభజించింది బీజేపీనే అంటూ విమర్శలు గుప్పించారు. ప్రసంగం ముగించుకుని సభ నుంచి బయటకు వెళ్లే క్రమంలో తమవైపు చూస్తూ రాహుల్ గాంధీ ఫ్లయింగ్ కిస్ ఇచ్చారని.. మహిళా ఎంపీలతో ప్రవర్తించే తీరు ఇదేనా అంటూ స్మృతీ ఇరానీ ఆరోపణలు చేశారు.

“ఒక విషయంలో నాకు అభ్యంతరం ఉంది. నా కంటే ముందు మాట్లాడిన వ్యక్తి సభ నుంచి బయటకు వెళ్తూ అసభ్యంగా ప్రవర్తించారు. మహిళలను ఇష్టపడని వాళ్లు, మహిళలను వ్యతిరేకించే వాళ్లే ఇలా ప్రవర్తిస్తారు. మహిళలంటే గౌరవం లేని వాళ్లే.. మహిళా ఎంపీలు కూర్చునే ఈ పార్లమెంట్ లో ఫ్లయింగ్ కిస్ ఇస్తారు. ఇలాంటి ప్రవర్తన గతంలో ఎప్పుడూ చూడలేదు” అంటూ స్మృతీ ఇరానీ తీవ్రంగా స్పందించారు. ఎంపీలు కేవలం ఆరోపణలతో ఆగలేదు. రాహుల్ గాంధీపై ఫిర్యాదు చేశారు. బీజేపీ ఎంపీ శోభ కరంద్లజే నేతృత్వంలో మహిళా ఎంపీలు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు రాతపూర్వక ఫిర్యాదు చేశారు. మహిళా ఎంపీల ఫిర్యాదు నేపథ్యంలో లోక్ సభ స్పీకర్ ఘటనపై విచారణకు ఆదేశించారు.

అలాగే రాహుల్ గాంధీ ప్రసంగం, ప్రతిపక్ష కూటమిపై కూడా స్మృతీ పలు వ్యాఖ్యలు చేశారు. “అవినీతి, వారసత్వ రాజకీయాలు దేశాన్ని వదిలిపోవాలి. మీది ఇండియా కాదు.. అవినీతికి ప్రతిరూపం. మణిపూర్ విడిపోలేదు. మణిపూర్ భారత్ లో అంతర్భాగమే. ఎంతో మందిని హత్య చేసిన చరిత్ర ఉన్న కాంగ్రెస్.. ఇప్పుడు భరతమాతని హత్య చేశామని ఆరోపించడంలో ఎలాంటి అర్థం లేదు. మణిపూర్ ని ఎవరూ ముక్కలు చేయలేరు. దేశం పట్ల మాకు చిత్తశుద్ధి ఉంది. కాంగ్రెస్ కు ఎలాంటి చిత్తశుద్ధి లేదు” అంటూ స్మృతి ఇరానీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ వ్యాఖ్యలు, స్మృతీ ఇరానీ ఆరోపణలు నెట్టింట పెద్దఎత్తున చర్చకు దారి తీశాయి.